iDreamPost
android-app
ios-app

మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు వాయిదా వేసిన ముస్లిం మత పెద్దలు!

మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు వాయిదా వేసిన ముస్లిం మత పెద్దలు!

భాగ్యనగరంలో మత సామరస్యం వెల్లివిరిసే ఘటన చోటుచేసుకుంది. దాదాపు 35 ఏళ్ల తర్వాత హిందూ, ముస్లింల పండుగలు కలిసి వచ్చాయి. సెప్టెంబర్ 28న హైదరాబాద్ లో గణేశ్ శోభాయాత్ర జరగనుంది. అదేరోజు ముస్లింల మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు జరగాల్సి ఉంది. అయితే ప్రజల్లో ఆందోళన.. పోలీసులు, అధికారుల్లో కంగారు వచ్చేశాయి. ఆ రోజు ఏం చేయాలి? ఎలా చేయాలి అని అంతా తర్జనబర్జన అవుతున్నారు. ఆ నేపథ్యంలో ముస్లిం మత పెద్దలు తమ పండుగను వాయిదా వేస్తూ గొప్ప నిర్ణయం తీసుకున్నారు.

హిందువులకు గణేశ్ శోభాయాత్ర అంటే ఎంతో ప్రత్యేకం. నవరాత్రులు పూజలు అందుకున్న వినాయకుడు ఆ రోజు ఊరేగింపుగా నిమజ్జనానికి బయల్దేరుతాడు. మహానగరంలో ఈ శోభాయాత్ర చార్మినార్ సహా పాతబస్తీలోని పలు ప్రాంతాల మీదుగా ఈ యాత్ర సాగుతుంది. మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని ముస్లింలు మిలాద్ ఉన్ నబీగా జరుపుకుంటారు. ఈ పండుగ ఎంతో విశిష్టమైనది. త్యాగానికి ప్రతీకగా కొరడాతో కొట్టుకుంటూ పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహిస్తారు. దాదాపు 35 ఏళ్ల తర్వాత ఈ రెండు పడుగలు ఒకేరోజు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు శాంతి భద్రతల దృష్ట్యా ఆందోళన చెందారు. రెండు యాత్రలు ఒకేరోజు కావడంతో.. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేయాలి అంటూ తలలు పట్టుకున్నారు.

అలాంటి అవసరం లేకుండా ముస్లిం మత పెద్దలు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. శోభాయాత్ర కోసం మిలాద్ ఉన్ నబీ పండుగనే వాయిదా వేశారు. సెప్టెంబర్ 28న జరుపుకోవాల్సిన ర్యాలీని అక్టోబర్ 1వ తారీఖుకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సమావేశం అనంతరం ముస్లిం మత పెద్దలు కీలక వ్యాఖ్యలు చేశారు. “ఇస్లాం అంటే త్యాగానికి ప్రతీక. ఇస్లాంని అనుసరించేవాడే ముస్లిం. మంచి కోసం త్యాగం చేయడమే మాకు.. ఇస్లాంకు గౌరవం. అందరి మంచి గురించి ఆలోచించి త్యాగానికి ప్రతీక అయిన మిలాద్ ఉన్ నబీ పండుగను వాయిదా వేసేందుకు నిర్ణయించుకున్నాం” అంటూ వ్యాఖ్యానించారు. ముస్లిం మతపెద్దలు తీసుకున్న ఈ నిర్ణయంపై హిందూ మతపెద్దలు హర్షం వ్యక్తం చేశారు. ముస్లిం మత పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ మహానగరం.. గంగా- జమునా తహబీబ్ కు నిదర్శనమని మరోసారి నిరూపితమైందంటూ హిందూ మత పెద్దలు వ్యాఖ్యానించారు.