మానవత్వం చాటుకున్న మహాబూబాబాద్‌ పోలీసులు.. అంధుడికి ఇల్లు కట్టించి

Mahabubabad Police-House For Blind Man: అంధుడి పరిస్థితి చూసి చలించిన పోలీసులు మానవత్వం చాటుకున్నారు. అతడికి ఇల్లు కట్టించారు. ఆ వివరాలు..

Mahabubabad Police-House For Blind Man: అంధుడి పరిస్థితి చూసి చలించిన పోలీసులు మానవత్వం చాటుకున్నారు. అతడికి ఇల్లు కట్టించారు. ఆ వివరాలు..

పోలీసులు అంటే నేటికి కూడా మన సమాజంలో ఒకరకమైన భయం ఉంటుంది. వారి దగ్గరకు వెళ్లి మాట్లాడాలి అన్నా, పోలీసు స్టేషన్‌కు వెళ్లాలన్నా చాలా భయపడతారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటూ.. ఖాకీలకు, ప్రజలకు మధ్య మంచి స్నేహ సంబంధాలు ఏర్పర్చడం కోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. జనాల్లో పాతుకుపోయిన భయం మాత్రం ఇంకా తగ్గలేదు. కానీ పోలీసుల్లో కూడా మానవత్వం ఉంటుందని.. సమస్యల్లో ఉన్న వారికి అండగా నిలుస్తారని నిరూపించే ఘటనలు ఇప్పటికే అనేకం చోటు చేసుకున్నాయి. తాజాగా ఈ కోవకు చెందిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అంధుడి కోసం ఆ పోలీసులు చేసిన సాయం చూసి ప్రతి ఒక్కరు హ్యాట్సాఫ్‌ అంటున్నారు. ఆ వివరాలు..

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట పోలీసులు.. పాటలు పాడుతూ పొట్టనింపుకుంటున్న నిరుపేద అంధునికి అండగా నిలవటమే కాకుండా.. ఇంటిని నిర్మించి ఇచ్చారు. పెద్దనాగారం గ్రామానికి చెందిన మందుల నాగన్న పుట్టుకతోనే అంధుడు. తండ్రి ఉన్నంతవరకు అతడి పరిస్థితి బాగానే ఉంది. కానీ నాగన్న ఆయన మరణించడంతో కష్టాలు మొదలయ్యాయి. దాంతో తల్లిని చూసుకునే బాధ్యత నాగన్న మీదనే పడింది. దాంతో తనకు తెలిసిన కళతో.. అంటే పాటలు పాడుతూ.. వచ్చిన ఆదాయంతో తల్లిని పోషించుకుంటున్నాడు. అయితే.. వారు ఉంటున్న ఇల్లు శిథిలావస్థకు చేరుకుని.. ప్రకృతి వైపరిత్యాల వల్ల.. పడిపోవడంతో తల్లితో కలిసి ఇంటి పక్కనే పరదాలతో చిన్న గుడారం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నాడు నాగన్న. ఇలా ఉండగానే.. నాగన్న తల్లి.. అస్వస్థతకు గురికావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు

నాగన్న పరిస్థితి చూసి చలించిన స్థానిక యువత వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అది కాస్త.. మహాబూబాబాద్‌ పోలీసులు దృష్టికి చేరింది. దీనిపై స్పందించిన ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్.. నర్సింహులపేట ఎస్‌ఐ‌ ద్వారా నాగన్న వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు. అతడికి ఇల్లు కూడా లేదని తెలిసి.. కూలిపోయిన అతడి ఇంటి స్థానంలోనే కొత్త ఇంటిని నిర్మించి ఇవ్వాలని భావించారు. తమతో పాటు కొంత మంది దాతల సాయంతో నాగన్నకు ఇల్లు కట్టించి ఇచ్చారు. గృహ ప్రవేశానికి ఎస్పీ స్వయంగా హాజరై పూజా కార్యక్రమాలు చేశారు. అంతే కాదు.. తల్లీకొడుకులకు కొత్త బట్టలు పెట్టి సంప్రదాయబద్దంగా గృహప్రవేశం చేపించారు. అనంతరం.. ఇంటి ముందు ఒక మొక్కను కూడా నాటారు. నాగన్నకు ఎప్పటికీ తమ సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా ఎస్పీ హామీ ఇచ్చారు.

పోలీసులు చొరవ తీసుకుని తనకు ఇల్లు కట్టించి ఇవ్వడమే కాక.. ఎస్పీనే స్వయంగా గృహప్రవేశానికి హాజరుకావడంతో నాగన్న ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఆ సంతోషంలో స్వయంగా పాట పాడడమే కాకుండా.. సినిమా పాటలకు డాన్సులు కూడా వేశాడు. ఇక నాగన్నను ఆదుకున్న పోలీసులకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. వారి మంచి మనసుని ప్రశంసిస్తున్నారు.

Show comments