Liquor Shops Looted: అధిక ధరలకు అమ్ముతున్నారని.. లక్షల విలువైన మద్యం లూటీ!

అధిక ధరలకు అమ్ముతున్నారని.. లక్షల విలువైన మద్యం లూటీ!

Liquor Shops Looted: తెలంగాణలో కొంతమంది మద్యం షాపు యజమానులు మందుబాబుల బలహీనత క్యాష్ చేసుకుంటూ అధిక ధరలు వసూళ్లు చేస్తున్నారు. దీనిపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.

Liquor Shops Looted: తెలంగాణలో కొంతమంది మద్యం షాపు యజమానులు మందుబాబుల బలహీనత క్యాష్ చేసుకుంటూ అధిక ధరలు వసూళ్లు చేస్తున్నారు. దీనిపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.

కొన్ని రాష్ట్రాలకు మద్యం అమ్మకం ఒక ఆదాయ వనరు అని చెబుతుంటారు. తెలంగాణ రాష్ట్రంలో పండుగలు, వివాహాది శుభకార్యాలు మద్యం అమ్మకాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. డిసెంబర్ 31 ఒక్కరాత్రే కోట్లలో మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో మందుబాబు బలహీనతను మద్యం షాపు యజమానులు క్యాష్ చేసుకుంటున్నారు. ఎమ్మార్పీ  కన్నా ఎక్కువ అమ్మకాలు జరుపుతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. ఇష్టమైతే తీసుకోండి లేదంటే మానేయండని అంటూ దబాయిస్తున్నారు. మందుకు బానిసైన వాళ్లు తమ జేబులు ఖాళీ చేసుకుంటున్నారు.  ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు మద్యం విక్రయిస్తున్నారని ఆగ్రహించిన గ్రామస్థులు వైన్స్ షాపులు లూటీ చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలో మద్యం షాపులపై స్థానికులు దాడి చేశారు. అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారంటూ షాపులను లూటీ చేశారు. ఈ లూటీలో అధికంగా మహిళలే పాల్గొన్నారు. మద్యం షాపుల్లో కేసులను అందినకాడికి తీసుకువెళ్లిపోయారు. గత కొంతకాలంగా వైన్స్ షాపు నిర్వాహకులు సిండికేట్ గా ఏర్పడి ఎమ్మార్పీ కన్నా 20-30 రూపాయ వరకు అధికంగా అమ్ముతున్నారని ఆగ్రహించిన ప్రజలు మద్యం దుకాణాలపై దాడులు చేశారు. టేకుపల్లిలో మొత్తం నాలుగు వైన్ షాపులు ఉండగా.. 3 వైన్ షాపులపై దాడి చేసి మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారని ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను అన్నారు.

టేకులపల్లి మండలంలో మొత్తం నాలుగు వైన్ షాపులు ఉన్నాయి. బుధవారం ఉదయం 10 గంటల తర్వాత షాపులు తెరిచారు. కొంతమంది గ్రామస్థులు వైన్స్ షాపు కి వెళ్లి క్వార్టర్ పై రూ. 20 నుంచి రూ.30 వరకు అధికంగా వసూళ్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు సిండికేట్ గా ఏర్పడిన షాపు యజమానులు బ్రాండెడ్ మద్యాన్ని బెల్ట్ షాపులకు తరలిస్తున్నారని అన్నారు. ఈ క్రమంలోనే పరిస్థితి ఉద్రిక్తతగా మారింది.. దీంతో సిబ్బంది భయపడటంతో ఇదే అదునుగా భావించిన గ్రామస్థులు షాపుల్లో ఉన్న కేసులు, మద్యం బాటిళ్లు లూటీ చేశారు. కొందరు మహిళలైతే ఒకేసారి రెండు మూడు పెట్టెలను ఎత్తుకెళ్లారు. దొరికినంత దోచుకో.. అందినకాడికి లూటీ చేసుకో అన్న తీరుగా నడిచింది. అటుగా వెళ్తున్న వాహనదారులు సైతం మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లారు. మొత్తానికి లూటీ వ్యవహారంలో షాపు యాజమానులకు సుమారు రూ.22 లక్షల వరకు నష్టం వాటిల్లిందని ఆరోపిస్తున్నారు. షాపు యాజమాన్యాల ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు.

Show comments