వీడియో: కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌.. నెటిజన్‌ ప్రశ్నకు కేటీఆర్‌ సమాధానం!

నగరాల్లో ఉండే వారు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య ట్రాఫిక్‌ జామ్‌. భాగ్యనగరం హైదరాబాద్‌ ఇందుకు మినహాయింపు కాదు. నగరంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విపరీతమైన ట్రాఫిక్‌ ఉంటుంది. అదృష్టం బాగోక.. అదే సమయంలో వర్ష్ం పడితే.. ఇక చుక్కలు చూడాల్సిందే. చిన్నపాటి వర్షానికి కూడా నగరంలో భారీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతుంది. అలాంటిది ఇక ఇప్పుడు కురుస్తోన్న కుండపోత వర్షాల సమయంలో ట్రాఫిక్‌ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. రోడ్ల మీద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి.. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి.. ఇళ్లకు చేరుకోవడానికి జనాలు పడే అవస్థలు అన్నీ ఇన్ని కావు.

గత వారం రోజులుగా నగరంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. జనాలు ట్రాఫిక్‌ సమస్యకు భయపడి రోడ్ల మీదకు వెళ్లకపోవడమే మంచిది అనుకుంటున్నారు. ఇక ట్రాఫిక్‌ సమస్యపై సెలబ్రిటీలు సహా సామాన్యులు అధికారులను, మంత్రులను ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ట్రాఫిక్‌ సమస్యపై ఓ నెటిజన్‌ మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించారు. ఆయన ఇచ్చిన సమాధానం వైరల్‌గా మారింది. మరి ఇంతకు ట్రాఫిక్‌ సమస్యపై కేటీఆర్‌ ఏమన్నారంటే..

హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఏర్పడే ట్రాఫిక్‌ సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గంటల తరబడి రోడ్ల మీద ట్రాఫిక్‌లో ఇరుక్కోవాల్సిన పరిస్థితి. ఇక్కడ ట్రాఫిక్‌ సమస్యకు అద్దం పట్టే ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరలవుతుంటాయి. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఈ ప్రాంతాల్లో వేల సంఖ్యలో కార్లు ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. ఈ క్రమంలో రోడ్డు కిలో మీటర్ల మేర ఆగిపోయిన వాహనాల వీడియో తీసి.. ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు ఆ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన ఓ వ్యక్తి. దీన్ని కేటీఆర్‌కు ట్యాగ్‌ చేస్తూ.. దయచేసి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపండి అని కోరాడు.

ఈ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్‌ స్పందించాడు. వచ్చే కేబినెట్‌ మీటింగ్‌లో హైదరాబాద్‌ మెట్రో రైలు పొడిగింపు అంశాన్ని ప్రధానంగా చర్చిస్తామని తెలిపారు. ఇప్పటికే ఈ సమస్యపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తమ శాఖకు ఆదేశాలు జారీ చేశారని.. ప్రస్తుతం ఆ పనుల్లోనే ఉన్నామని తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరలవుతోంది. చాలా మంది నెటిజనుల ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించమని కోరుతున్నారు.

Show comments