40 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన టీచర్ కు ప్రభుత్వం సన్మానం!

  • Author Soma Sekhar Published - 12:47 PM, Tue - 1 August 23
  • Author Soma Sekhar Published - 12:47 PM, Tue - 1 August 23
40 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన టీచర్ కు ప్రభుత్వం సన్మానం!

విద్యార్థులకు పాఠాలు చెప్పడం వరకే టీచర్ జాబ్ అయితే.. అతడు టీచర్ గానే మిగిలిపోతాడు. పాఠాలతో పాటు వారి ప్రాణాలకు రక్షణగా ఉంటే.. పది కాలాలపాటు ఈ సమాజం గుర్తించుకుంటుంది. తాజాగా ఓ టీచర్ వృత్తితో పాటు మానవతా దృక్పథంతో, ముందుచూపుతో ఏకంగా 40 మంది విద్యార్థుల ప్రాణాలను కాపాడాడు. రాబోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన ఆ ఉపాధ్యాయుడు 40 మంది విద్యార్థుల నిండుప్రాణాలను కాపాడాడు. అతడి కృషిని గుర్తించిన తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఆగస్టు 15న సన్మానం చేయనున్నట్లు ప్రకటించారు.

తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. దాంతో రాష్ట్రంలోని వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లి భారీ వరదలు సంభవించాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వరదలు ప్రళయాన్నే సృష్టించాయని చెప్పాలి. వరదల కారణంగా ములుగు జిల్లాలోని మోరాంచపల్లి గ్రామంలోని వాగు ఉప్పొంగడంతో.. ఏటూరునాగారం మండలంలోని కొండాయి గ్రామం జలదిగ్బందమైంది. అయితే వరదల సమాచారన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు కొండాయి పల్లిలోని గిరిజన గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు పాయం మీనయ్య. వరదలు వస్తే.. పాఠశాల మునుగుతుందని ముందుగానే పసిగట్టిన టీచర్ మీనయ్య.. పాఠశాలలోని 40 మంది విద్యార్థులను తన ఇంటికి తీసుకెళ్లారు.

ఇక విద్యార్థులందరికి తన ఇంట్లోనే భోజనంతో పాటు వసతి కల్పించారు మీనయ్య. ఆయన అనుకున్నట్లుగానే వరదలు పాఠశాలను ముంచెత్తాయి. టీచర్ మీనయ్య తన సమయస్ఫూర్తితో పిల్లలను తన ఇంటికి తీసుకెళ్లి వారి ప్రాణాలను కాపాడారు. ఇక ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ట్విట్టర్ వేదికగా టీచర్ మీనయ్యను అభినందించారు. కాగా.. ఈ ట్వీట్ ను రీ ట్వీట్ చేశారు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్. గ్రేట్ జాబ్ పాయం మీనయ్య గారు అంటూ ప్రశంసించారు కేటీఆర్. ఈ క్రమంలోనే ఆగస్టు 15న టీచర్ పాయం మీనయ్యను సన్మానించనున్నట్లు ఇటీవలే తెలిపారు కేటీఆర్. టీచర్ తో పాటుగా వరదలో ఈదుకుంటూ వెళ్లి కరెంట్ తీసుకొచ్చిన లైన్ మెన్ లను కూడా సన్మానించనున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.


ఇదికూడా చదవండి: తెలంగాణకు నేడు భారీ వర్షాలు.. ఏపీలో కూడా ఇదే పరిస్థితి!

Show comments