iDreamPost
android-app
ios-app

సింగరేణి ఉద్యోగుల పిల్లలకు కేసీఆర్‌ సర్కార్‌ భారీ శుభవార్త.. కీలక నిర్ణయం!

  • Published Jul 07, 2023 | 11:10 AM Updated Updated Jul 07, 2023 | 11:10 AM
  • Published Jul 07, 2023 | 11:10 AMUpdated Jul 07, 2023 | 11:10 AM
సింగరేణి ఉద్యోగుల పిల్లలకు కేసీఆర్‌ సర్కార్‌ భారీ శుభవార్త.. కీలక నిర్ణయం!

సింగరేణి ఉద్యోగుల పిల్లలకు తెలంగాణ సర్కార్‌ భారీ శుభవార్త చెప్పింది. వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న కల సాకారం దిశగా ప్రభుత్వం చర్చలు ప్రారంభించింది. రామగుండంలో కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్‌ కాలేజీలో.. సింగరేణి ఉద్యోగుల పిల్లలకు.. ఎంబీబీఎస్‌ సీట్ల కేటాయింపులో రిజర్వేషన్‌ కల్పిస్తూ.. కేసీఆర్‌ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ గురువారం.. ఆదేశాలు జారీచేశారు. రాష్ట్ర సర్కారు జిల్లాకో మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. దానిలో భాగంగా ఇప్పటికే రామగుండంలో మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేయడమేగాకుండా, గతేడాది నుంచే తరగతులు ప్రారంభించింది.

అయితే రామగుండంలో ఏర్పాటు చేసిన మెడికల్‌ కాలేజీ ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీలో ప్రత్యేక కోటా కేటాయించాలని సింగరేణి ప్రాంత ఉద్యోగులు ఎప్పటి నుంచో విజ్ఞప్తి చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తోపాటు మంత్రులు అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. వీరి వినతులను పరిగణలోకి తీసుకున్న సీఎం కేసీఆర్‌.. రామగుండంలోని మెడికల్‌ కాలేజీలో సింగరేణి ఉద్యోగుల పిల్లలకు.. ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీలో రిజర్వేషన్‌ కల్పించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

రామగుండం మెడికల్‌ కాలేజీలో మొత్తం 150 సీట్లు ఉన్నాయి.  23 సీట్లు ఆల్‌ ఇండియా రిజర్వేషన్‌కు కేటాయించారు. మిగిలిన 127 సీట్లలో సింగరేణి ఉద్యోగుల పిల్లలకు 5 శాతం రిజర్వేషన్‌ కల్పించారు. దీని ప్రకారం మిగిలిన 123 సీట్లలో.. 7 సీట్లు సింగరేణి ఉద్యోగుల పిల్లలకు కేటాయించనున్నారు. నీట్‌ మెరిట్‌ ప్రకారం భర్తీ కానున్న ఈ సీట్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకుంటారు. ఇక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సింగరేణి ఉద్యోగులు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రామగుండంలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు, ఇప్పుడు సింగరేణి పిల్లలకు ఎంబీబీఎస్‌ సీట్లలో 5 శాతం రిజర్వేషన్‌ విషయంలో ఎమ్మెల్యే చందర్‌ కృషి ఎనలేనిదని చెబుతున్నారు. కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం వల్ల తమ పిల్లలకు మేలు కలుగుతుందని తెలిపారు.