iDreamPost
android-app
ios-app

రైతు బీమా తరహాలో మరో పథకం.. వారికి రూ.10 లక్షల వరకు సాయం!

  • Author singhj Published - 08:26 AM, Mon - 31 July 23
  • Author singhj Published - 08:26 AM, Mon - 31 July 23
రైతు బీమా తరహాలో మరో పథకం.. వారికి రూ.10 లక్షల వరకు సాయం!

తెలంగాణ ప్రభుత్వం అన్నదాతల కోసం తీసుకొచ్చిన పథకాల్లో ఒకటి రైతు బీమా. ఆరుగాలం కష్టపడి వ్యవసాయం చేసి పంటను పండించే రైతన్నల కుటుంబాలను ఆదుకోవడానికి ఈ స్కీమును ప్రవేశపెట్టింది. అన్నదాతలు ప్రమాదవశాత్తు మరణిస్తే పేదరికంలో ఉన్న వారి కుటుంబాలు రోడ్డున పడతాయి. ఈ పరిస్థితుల్లో వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు కేసీఆర్ సర్కారు రైతు బీమాను అమలు చేస్తోంది. రైతులు చనిపోతే వారి నామినీ అకౌంట్లలో రూ.5 లక్షల్ని ప్రభుత్వం జమ చేస్తుంది. ఈ పథకం అద్భుతం అంటూ దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా మెచ్చుకుంటున్న విషయం తెలిసిందే.

అన్నదాతలకు రైతు బీమాను అందిస్తున్నట్లే కార్మికులకు కార్మిక బీమా అమలు చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆర్థిక మంత్రి హరీశ్​రావు తెలిపారు. సిద్ధిపేటలో 300 మంది బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయం చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఆ తర్వాత జిల్లా భవన కార్మిక సంఘం సమావేశంలో హరీష్ మాట్లాడుతూ.. కార్మిక, వైద్యారోగ్య శాఖల మధ్య రీసెంట్​గా ఓ ఒప్పందం జరిగిందన్నారు. ఈ ఒప్పందం ప్రకారం కార్మికులకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆగోగ్యశ్రీ కింద ఈ సేవలను ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉపయోగించుకోవచ్చని చెప్పుకొచ్చారు.

కార్మిక బీమాలో భాగంగా గుండె, క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులకు రూ.10 లక్షల వరకు సాయం వర్తిస్తుందని హరీష్​రావు తెలిపారు. ఆగస్టు 1వ తేదీ నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. డిజిటల్ కార్డుల తయారీకి స్పెషల్ డ్రైవ్ చేపడతామన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, కార్మిక శాఖ కమిషనర్ రాణీకౌముదితో మాట్లాడినట్లు చెప్పుకొచ్చారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఒక ఏజెన్సీ ద్వారా సభ్యత్వం పొందిన కార్మికుడి వేలిముద్రలను సేకరించి, నామినీ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందని హరీష్​రావు వివరించారు.