iDreamPost
android-app
ios-app

తీవ్ర విషాదం.. వడదెబ్బతో ఒక్కరోజులోనే ఐదుగురు మృతి.. మరో 4 రోజులు ఇదే పరిస్థితి

  • Published Apr 30, 2024 | 9:51 AM Updated Updated Apr 30, 2024 | 9:51 AM

Heat Stroke: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఇక వడదెబ్బ కారణంగా ఐదుగురు మృతి చెందారు అంటే.. ఎండలు ఎంతలా మండిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఆ వివరాలు..

Heat Stroke: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఇక వడదెబ్బ కారణంగా ఐదుగురు మృతి చెందారు అంటే.. ఎండలు ఎంతలా మండిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఆ వివరాలు..

  • Published Apr 30, 2024 | 9:51 AMUpdated Apr 30, 2024 | 9:51 AM
తీవ్ర విషాదం.. వడదెబ్బతో ఒక్కరోజులోనే ఐదుగురు మృతి.. మరో 4 రోజులు ఇదే పరిస్థితి

ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. సాధారణంగా మే నెలలో నిప్పులు చెరగాల్సిన భానుడు.. మార్చి నుంచే తన ప్రభావం చూపించడం మొదలు పెట్టాడు. మార్చి నెల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. ఇక ఈ ఏడాది ప్రపంచ చరిత్రలోనే అ‍త్యధిక వేడి సంవత్సరంగా రికార్డులోకి ఎక్కింది. ఇక ఏప్రిల్‌ నెలలో సాధారణం కన్నా 5 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలు మండిపోవడంతో పాటు.. వడగాడ్పులు కూడా వీస్తూ.. జనాలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటకు రావాలంటే భయపడే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వడదెబ్బ కారణంగా దారుణం చోటు చేసుకుంది. ఒక్క రోజే సుమారు ఐదుగురు కన్ను మూశారు. ఆ వివరాలు..

తెలంగాణలో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. మండే ఎండలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మండే ఎండలతో పాటు.. వడగాడ్పులు కూడా వీస్తుండటంతో.. జనాల కష్టాలను వర్ణించడానికి మాటలు రావడం లేదు. ఇక ఎండలకు భయపడి జనాలు భయకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. దాంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో.. మధ్యాహ్నం సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇక సోమవారం నాడు అనగా.. ఏప్రిల్ 29న నల్గొండ జిల్లా త్రిపురారం మండలం మాటూరులో రాష్ట్రంలోనే అత్యధికంగా 45.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. అలానే సోమవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఇక తీవ్రమెన ఎండలతో వడదెబ్బకు గురై ఒక్కరోజే ఐదుగురు ప్రాణాలు విడవడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. మరణించిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. ములుగు జిల్లా బూటారం గ్రామానికి చెందిన రామగిరి ప్రేమలీల(70), కుమురం భీం జిల్లా ఎల్కపల్లి గ్రామానికిచెందిన చౌధరి రవి(23), కాగజ్‌నగర్‌ రైల్వేస్టేషన్‌లోని రెండో ప్లాట్‌ఫాంపై గుర్తుతెలియని వృద్ధుడు, శంషాబాద్‌లో భిక్షాటన చేస్తూ జీవించే 45 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందారు. వీరితో పాటు నల్గొండ జిల్లా అజ్మాపురానికి చెందిన కౌషిక్‌(12) అనే బాలుడు కూడా వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలకు బయటకు రావాలంటే జనాలు భయపడుతున్నారు.

ఇ​క సోమవారం నాడు తెలంగాణలోని ములుగు జిల్లా మంగపేటలో 45.1 డిగ్రీల సెల్సియస్, నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం తిమ్మాపురంలో 45.1 డిగ్రీల సెల్సియస్, మాడుగులపల్లిలో 45 డిగ్రీలు, త్రిపురారం మండలం కామారెడ్డిగూడెంలో 44.9 డిగ్రీల ఎండ నమోదైంది. ఇక ఖమ్మం, గద్వాల, నిజామాబాద్‌, మంచిర్యాల, సూర్యాపేట, జగిత్యాల, మహబూబాబాద్‌ జిల్లాల్లో 44 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

అంతేకాక తెలంగాణలో నేటి నుంచి వచ్చే నెల అనగా మే, 3 వరకు ఎండలు కొనసాగుతాయని, పలు జిల్లాలకు వడగాలుల ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌, ఖమ్మం, కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌, నల్గొండ జిల్లాల్లో వడగాలులు వీస్తాయని సూచించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడటంతో ఎండల తీవ్రత కొనసాగే అవకాశాలు ఉన్నాయని సూచించింది.