iDreamPost
android-app
ios-app

Hydలో గణేష్‌ ఉత్సవాలు.. DJ, విగ్రహం ఎత్తు, మండపాల నిర్వహణపై కీలక ఆదేశాలు!

  • Published Aug 30, 2024 | 3:37 PM Updated Updated Aug 30, 2024 | 3:37 PM

Vinayaka Chavithi 2024-Rachakonda CP Comments: వినాయక చవితి పండుగకు మరి కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు..

Vinayaka Chavithi 2024-Rachakonda CP Comments: వినాయక చవితి పండుగకు మరి కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు..

  • Published Aug 30, 2024 | 3:37 PMUpdated Aug 30, 2024 | 3:37 PM
Hydలో గణేష్‌ ఉత్సవాలు.. DJ, విగ్రహం ఎత్తు, మండపాల నిర్వహణపై కీలక ఆదేశాలు!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకునే పండగ అంటే.. గణేష్‌ ఉత్సవాలు. మరో పది రోజుల్లో పండగ ప్రారంభం కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక భాగ్యనగరంలో అయితే ఆ సందడి చెప్పక్కర్లేదు. తొమ్మిది రోజుల పాటు.. ధూం ధామ్‌గా గణేష్‌ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఖైరతాబాద్‌ బడా గణపతి ఈ ఉత్సవాలకే హైలెట్‌గా నిలుస్తాడు. ప్రతి వీధిలో వినాయకుడి మండపాలు వెలుస్తాయి. తొమ్మిది రోజుల పాటు నిత్య పూజలు నిర్వహించి.. ఆ తర్వాత గణపయ్యను గంగమ్మ ఒడికి చేరుస్తారు. ఇక ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి రేవంత్‌ రెడ్డి శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. గణేష్‌ మండపాలకు ఫ్రీ కరెంట్‌ ఇస్తామని తెలిపారు. అదలా ఉంచితే ఉత్సవ ఏర్పాట్లకు సంబంధించిన రాచకొండ సీపీ కీలక వ్యాఖ్యలు చేశారు. డీజే, విగ్రహం ఎత్తుపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు..

ఈ ఏడాది గణేశ్ ఉత్సవాలకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై.. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులతో రాచకొండ సీపీ సుధీర్ బాబు సమన్వయ సమావేశం నిర్వహించారు. వినాయకుడి విగ్రహాల ఏర్పాటుతో పాటు నిమజ్జనం కూడా పక్కా ప్రణాళిక ప్రకారం జరిగేలా.. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేలా పోలీసు శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని.. అందుకు కమిటీల నిర్వాహకులు కూడా సహకరించాలని సీపీ సూచించారు. గణేష్‌ శోభాయాత్ర కోసం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో జరుపుకొనే అతిపెద్ద ఉత్సవాల్లో ఒకటైన గణేష్ వేడుకలను భక్తులు శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో  జరుపుకోవాలని ఈ సందర్భంగా సీపీ సూచించారు.

డీజేకి నో..

ప్రశాంతమైన వాతవరణంలో వినాయక చవితి నవరాత్రి వేడుకలు జరిగేలా చూడాలని సీపీ నిర్వాహకులకు సూచించారు. మండపాల్లో డీజే ఏర్పాటుకు అనుమతి లేదని.. ఈ సందర్భంగా సీపీ స్పష్టం చేశారు. అలానే గణేష్ మండపంలో వాలంటీర్లు రోజంతా ఉండాలని.. రాత్రి సమయంలో కనీసం ముగ్గురు ఉండేలా చూసుకోవాలని సూచించారు. భక్తుల సందర్శనను దృష్టిలో ఉంచుకుని మండపాలలో క్యూలైన్లను ఏర్పాటు చేసేలా నిర్వహకులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

తాత్కాలిక ప్రాతిపదికన అయినా సరే ఉత్సవాలు నిర్వహించే అన్ని రోజుల పాటు మండపాల వద్ద సీసీటీవీలు ఏర్పాటు చేసుకోవాలని.. గణేష్ మండపాల నిర్వాహకులు, కమిటీ వివరాలు, మండపాల బాధ్యత వహించే వారి వివరాలు, ఫోన్ నెంబర్లతో కూడిన ఫ్లెక్సీలను మండపంలో ఏర్పాటు చేయాలని సీపీ తెలిపారు. సమీపంలో ఉన్న చెరువు లేదా కుంటల లోతును బట్టి విగ్రహాల ఎత్తును నిర్ణయించి ఏర్పాటు చేయాలని సీపీ సూచించారు. ఎలాంటి ఉద్రిక్తతలకు తావు లేకుండా శాంతియుతంగా ఉత్సాలు జరుపుకోవాలని సూచించారు.