Krishna Kowshik
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమారుడికి కాలేజీలో ఎదురైన చేదు అనుభవం గురించి కంప్లయింట్ చేశాడు. ఇంతకు ఏం జరిగిందంటే..?
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమారుడికి కాలేజీలో ఎదురైన చేదు అనుభవం గురించి కంప్లయింట్ చేశాడు. ఇంతకు ఏం జరిగిందంటే..?
Krishna Kowshik
విద్యార్థి దశలో అందమైనవి కాలేజీ డేస్. జీవితానికి అవసరమైన పాఠాలు, గుణపాఠాలు నేర్చుకునేది కూడా ఈ దశలోనే. అందమైన పరిచయాలు, స్నేహాలు లభించేది ఇక్కడే. బంగారం లాంటి భవిష్యత్తును డిసైడ్ చేసే సమయం ఇదే. ఎన్నో కలలు నిజం చేసుకునే మంచి తరుణమిదే. ఇది కోణానికి ఓ వైపు. మరో వైపు ర్యాగింగ్ రాజ్యమేలుతోంది. కొంత మంది విద్యార్థులు.. ఇతరులను ఇబ్బంది పెడుతూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. సీనియర్లమనే పొగరుతో జూనియర్లను ఇబ్బందికి గురి చేస్తుంటారు. ర్యాగింగ్ చేస్తూ విద్యార్థులను హెర్రాస్ చేస్తున్నారు. ర్యాగింగ్ భూతానికి ఎంతో మంది విద్యార్థులు బలైన దాఖలాలు ఉన్నాయి. దీనిపై ఎన్నో పోరాటాలు జరిగితే ఈ ర్యాగింగ్ తగ్గుముఖం పట్టింది. అక్కడక్కడా అడపాదడపా సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సామాన్యులే కాదు.. సెలబ్రిటీ పిల్లలు సైతం ఈ రక్కసి బారిన పడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తాజాగా ప్రముఖ సినీ ప్రముఖుని కొడుకు ర్యాగింగ్ కు గురయ్యాడు.
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ కుమారుడు వైష్ణవ్ ర్యాగింగ్ బారిన పడ్డాడు. శంకర్ పల్లిలోని ICFAI యూనివర్శిటీలో చదువుతున్న వైష్ణవ్‌ను సీనియర్ స్టూడెంట్ ర్యాగింగ్ చేశాడు. పలుమార్లు వద్దని చెప్పినా.. అతడిని ఇరిటేట్ చేశాడు. దీంతో విసుగు చెందిన వైష్ణవ్ యూనివర్శిటీ యాజమాన్యానికి కంప్లయింట్ చేశాడు. ఈ విషయం తెలిసిన సీనియర్.. తనపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ.. బస్సులో వైష్ణవ్‌తో గొడవపడ్డాడు. కోపంతో రగిలిపోతున్న శ్యామ్.. వైష్ణవ్ చెవి కొరకగా.. తీవ్ర రక్తస్రావం అయ్యింది. ఈ విషయం తండ్రి దృష్టికి రావడంతో.. సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీనియర్ స్టూడెంట్ శ్యామ్‌కు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
2000వ దశకంలో తన మ్యూజిక్‌తో సినీ ప్రియులను ఓలలాడించాడు ఆర్పీ పట్నాయక్. రవితేజ- మహేశ్వరి హీరో హీరోయిన్లుగా వచ్చిన నీ కోసం మూవీతో ఆయన సినీ ప్రయాణం మొదలైంది. చిత్రం, నువ్వు నేను చిత్రాలకు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందించి.. వరుస ఆఫర్లు కొల్లగొట్టాడు. మనసంతా నువ్వే హిట్టుతో ఆయన క్రేజ్ పీక్స్‌కు చేరింది. సంతోషం, జయం, జెమినీ, నీ స్నేహం, ప్రభాస్ తొలి మూవీ ఈశ్వర్, దిల్, సంబరం, నిజం ఇలా చాలా చిత్రాలకు బాణీలు సమకూర్చాడు. ఇటు కన్నడ, తమిళ చిత్రాలు కూడా చేశాడు. హీరోగా మారి.. శ్రీను వాసంతి లక్ష్మీ, బ్రోకర్ వంటి చిత్రాల్లో నటించాడు. కేవలం నటుడు మాత్రమే కాదు.. తులసి దళం అనే మూవీని స్వీయ నిర్మాణం చేశాడు. ప్రస్తుతం పలు చిత్రాలు చేస్తున్నాడు ఆర్పీ పట్నాయక్. ఇదిలా ఉంటే.. సెలబ్రిటీ పిల్లలే ఇలా ర్యాగింగ్ బారిన పడితే.. సామాన్యుల పరిస్థితి ఏంటీ అన్న ప్రశ్న మొదలౌతుంది.