P Venkatesh
BluJ Aerospace: ఇప్పటి వరకు పైలట్ తో నడిచే విమానాలనే చూశారు. ఇకపై పైలట్ రహిత ఫ్లైట్స్ ను చూడబోతున్నాం. బ్లూజే ఏరోస్పేస్ మానవ రహిత సరుకు విమానాన్ని తయారు చేసింది.
BluJ Aerospace: ఇప్పటి వరకు పైలట్ తో నడిచే విమానాలనే చూశారు. ఇకపై పైలట్ రహిత ఫ్లైట్స్ ను చూడబోతున్నాం. బ్లూజే ఏరోస్పేస్ మానవ రహిత సరుకు విమానాన్ని తయారు చేసింది.
P Venkatesh
టెక్నాలజీ వినూత్న ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నది. సరికొత్త పరికరాలు పుట్టుకొస్తున్నాయి. సమయం ఆదా అయ్యేలా.. పనులు ఈజీగా చక్కబెట్టేలా నూతన ఆవిష్కరణలు సాక్షాత్కరిస్తున్నాయి. గత కొంత కాలంగా ఎయిర్ ట్యాక్సీలు త్వరలో అందుబాటులోకి రాబోతున్నట్లు టాక్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. వీటి వల్ల ట్రాఫిక్ సమస్యలకు చెక్ పడే అవకాశం ఉంటుంది. ఎమర్జెన్సీ టైమ్ లో యూజ్ ఫుల్ గా ఉంటాయి. ఇప్పుడు ఇదే తరహాలో మరో కొత్త విమానం రూపుదిద్దుకుంది. సాధారణంగా విమానం నడవాలంటే పైలెట్ ఉండితీరాల్సిందే. కానీ ఈ సరికొత్త ఫ్లైట్ కు పైలట్ ఉండాల్సిన పనిలేదు. మానవరహితంగానే గాల్లోకి దూసుకెళ్తుంది. ఈ పైలట్ రహిత విమానం రూపుదిద్దుకున్నది హైదరాబాద్ నగరంలోనే.
స్టార్టప్ కంపెనీ బ్లూజే ఏరోస్పేస్ మానవ రహిత సరుకు రవాణా విమానాన్ని ఆవిష్కరించింది. ఈ విమానం ప్రత్యేకత ఏంటంటే.. నింగిలోకి నిలువుగా టేకాఫ్ కాగలదు. అదే విధంగా నిట్టనిలువుగా భూమిపై ల్యాండ్ అవుతుంది. వీటీఓఎల్ టెక్నాలజీతో పైలట్ లేకుండానే ఆటోమెటిక్ గా దూసుకెళ్తుంది ఈ ఫ్లైట్. ఈ విమానం పనితీరును హైదరాబాద్ సమీపంలోని నాదర్‌గుల్ ఎయిర్‌ఫీల్డ్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఈ విమానాలను తాము 2026 సంవత్సరం నుంచి విక్రయిస్తామని బ్లూజే ఏరోస్పేస్ సంస్థ వెల్లడించింది. ఈ పైలట్ రహిత విమానం 100 కిలోల బరువును 300 కిలోమీటర్ల దూరం మోసుకెళ్లగలదని బ్లూజే ఏరోస్పేస్ తెలిపింది. ఈ విమానం 150 కి.మీ దూరాన్ని కేవలం 30 నిమిషాల్లో చేరుకోగలదని ప్రకటించింది.
ఆపద సమయంలో ఈ పైలట్ రహిత విమానం ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నది. అగ్ని ప్రమాదాలు, ప్రకృతి విపత్తు సమయాల్లో రెస్క్యూ వర్క్స్ కోసం, మారుమూల ప్రాంతాల్లోని సైన్యానికి, భద్రతా బలగాలకు ఆయుధ సామగ్రిని తరలించేందుకు ఈ విమానం బాగా ఉపయోగపడుతుంది. మెడికల్ ఎమెర్జెన్సీ టైమ్ లో వైద్య పరికరాలను, మందులను చేరవేసేందుకు కీలకపాత్ర పోషించనున్నది. ఈ ఫ్లైట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఆపత్కాల సమయంలో ఉపయోగకరంగా ఉండనున్నది.
ఇది హైడ్రోజన్‌తో పాటు విద్యుత్‌తో నడుస్తుందని కంపెనీ తెలిపింది. ఈ విమానాన్ని 2026 నాటికి అందుబాటులోకి తెస్తామని బ్లూజే ఏరోస్పేస్ చెబుతోంది. ఈ విమానాల ద్వారా దేశంలో విమానాశ్రయాలు లేని ప్రాంతాలకు కూడా విమాన సేవలను అందించొచ్చని వెల్లడించింది. ఓ వైపు ఎయిర్ ట్యాక్సీలు, మరో వైపు మానవ రహిత విమానాలు రవాణా వ్యవస్థలో పెనుమార్పులు తీసుకువస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి పైలట్ రహిత విమానం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.