ఒడిశా రైలు ప్రమాద సంఘటనను దేశ ప్రజలు అంత సులువుగా మర్చిపోలేరు. మూడు రైళ్లు ఢీకొన్న ఈ ఘటన అందర్నీ ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం, వేలాది మంది గాయాలపాలవ్వడంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈమధ్య కాలంలో భారత్‌లో జరిగిన రైలు ప్రమాదాల్లోకెల్లా కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ యాక్సిడెంట్‌ను పెద్దదిగా చెబుతున్నారు. ఈ ప్రమాదంపై విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో పెను ప్రమాదం తప్పింది. నగరంలోని మలక్‌పేట్ రైల్వే స్టేషన్‌కు సమీపంలో రెండు ఎంఎంటీఎస్ రైళ్లు ఒకే ట్రాక్ మీదకు వచ్చాయి.
ప్రమాదాన్ని ముందే గుర్తించిన ఆ ట్రెయిన్స్లోని లోకో పైలట్లు అప్రమత్తమై రైళ్లను నిలిపివేశారు. దీంతో పెద్ద యాక్సిడెంట్ తప్పినట్లు అయింది. రెండు రైళ్లు ఒకే ట్రాక్ మీదకు రావడంతో ప్రయాణికులు కాసేపు టెన్షన్ పడ్డారు. సమయానికి లోకో పైలట్లు అప్రమత్తమై చాకచక్యంగా వ్యవహరించి, రైళ్లను ఆపేయడంతో ప్యాసింజర్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ రెండు రైళ్లు ఢీకొని ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేదని ప్రయాణికులు అంటున్నారు. రెండు రైళ్లు ఒకే ట్రాక్ పైకి వచ్చిన ఘటన గురించి సమాచారం అందుకున్న సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. ఒక ట్రైన్‌ను మరో ట్రాక్ పైకి మళ్లించారు. దీంతో రెండు రైళ్లు వేర్వేరు ట్రాక్‌ల పైనుంచి వెళ్లాయి. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేస్తున్నారు. రెండు రైళ్లు ఒకే ట్రాక్ మీదకు ఎలా వచ్చాయని వారు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు రైల్వే సిబ్బంది నిర్లక్ష్యమే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఎక్కడ లోపం జరిగిందనేది తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే, రీసెంట్గా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో ఏడు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి.