iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలో సిటీలో మరో రెండు ఫ్లైఓవర్లు!

  • Author singhj Published - 08:31 PM, Sat - 29 July 23
  • Author singhj Published - 08:31 PM, Sat - 29 July 23
హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలో సిటీలో మరో రెండు ఫ్లైఓవర్లు!

తెలంగాణ అభివృద్ధి పథంలో వడివడిగా దూసుకుపోతోంది. ముఖ్యంగా నూతన రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి డెవలప్​మెంట్ ఇంకా ఊపందుకుంది. రోడ్ల విషయంలోనూ చాలా మార్పులు వచ్చేశాయి. ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండే హైదరాబాద్​లో ఫ్లైఓవర్ల నిర్మాణంపై కేసీఆర్ సర్కారు దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే నగరంలో చాలా చోట్ల కొత్త ఫ్లైఓవర్లు, అండర్​పాస్​లు నిర్మించింది. అయితే ఎన్ని ఫ్లైఓవర్లు, అండర్​పాస్​లు అందుబాటులోకి తీసుకొస్తున్నా ట్రాఫిక్ సమస్య వాహనదారులను వేధిస్తూనే ఉంది.

సిటీలో జనాభా పెరిగిపోతుండటంతో పాటు వాహనదారులూ ఎక్కువవుతున్నారు. దీంతో ట్రాఫిక్ జామ్ అధికంగా ఏర్పడుతోంది. పొద్దున, సాయంత్రం సమయాల్లో ట్రాఫిక్ రద్దీ మరింత ఎక్కువగా ఉంటోంది. దీంతో కొద్దిపాటి దూరం వెళ్లడానికి కూడా గంటల సమయం పడుతోంది. దీనికి చెక్ పెట్టేందుకు అధికారులు తగిన చర్యలు చేపడుతున్నారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు ప్రజలు తమ గమ్యస్థానాలకు సులువుగా చేరుకునేందుకు ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఫ్లైఓవర్లను నిర్మిస్తున్నారు. అందులో భాగంగా భాగ్యనగరంలో మరో రెండు కొత్త ఫ్లైఓవర్ల నిర్మాణానికి రంగం సిద్ధమైంది.

లింగంపల్లి రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాలనీ దగ్గర ఫ్లైఓవర్లను కట్టాలని జీహెచ్​ఎంసీ అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతులూ మంజూరు అయ్యాయి. త్వరలో ఈ ఫ్లైఓవర్ల నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. వర్షాకాలం కావడంతో పనులు మొదలుపెడితే ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే మరో రెండు నెలల తర్వాత పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రెండు ఫ్లైఓవర్ల నిర్మాణం పూర్తయితే లింగంపల్లి, ఆర్టీసీ కాలనీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ కొంతమేర తగ్గనుంది. అలాగే చందానగర్ దగ్గర ఉన్న అండర్​పాస్​ను మరింత విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నారు. కాగా, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్​మెంట్ ప్లాన్​లో భాగంగా ఈ ఫ్లైఓవర్లను జీహెచ్​ఎంసీ నిర్మిస్తోంది.