Venkateswarlu
Venkateswarlu
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. మొన్నటి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బయటకు వెళ్లి పనులు చేసుకునే వారికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇక, తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌తో పాటు మరో రెండు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెంతో పాటు మరో ఆరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గత రెండు రోజులనుంచి కురుస్తున్న వర్షాల కారణంగా స్కూళ్లకు వెళ్లే పిల్లలకు ఇబ్బందులు తెలెత్తుతున్నాయి. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని స్కూళ్లకు పంపటానికి వెనకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, ఎడ తెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి పోటెత్తుతోంది. గోదావరికి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో తగిన ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫారెస్ట్ అధికారులు ములుగు జిల్లాలోని బొగత జలపాతానికి వెళ్లేందుకు పర్యాటకులకు అనుమతి రద్దు చేశారు. ఛత్తీష్‌ఘడ్-తెలంగాణ సరిహద్దులో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బొగత జలపాతం ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి, తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.