iDreamPost
android-app
ios-app

విజేత సూపర్ మార్కెట్ ను సీజ్ చేసిన GHMC కమిషనర్.. కారణం తెలిస్తే షాక్!

విజేత సూపర్ మార్కెట్ ను సీజ్ చేసిన GHMC కమిషనర్.. కారణం తెలిస్తే షాక్!

హైదరాబాద్ నగరంలో సూపర్ మార్కెట్ లకు కొదవ లేదు. వివిధ రకాల ఆఫర్స్, డిస్కౌంట్ల పేరుతో కస్టమర్లను ఆకర్శించి వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరుకాయలుగా మలుచుకుంటున్నాయి. కాగా కొన్ని సూపర్ మార్కెట్లు నాసిరకం వస్తువులు, తూకాల్లో మోసాలు వంటి వాటితో కస్టమర్లను మోసాలకు గురిచేస్తూ తగిన మూల్యం చెల్లించుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ లో విజేత సూపర్ మార్కెట్ ను సీజ్ చేశారు అధికారులు. దీంతో పాటు భారీ జరిమానాను కూడా విధించారు. కానీ ఇది మోసానికి పాల్పడినందుకు మాత్రం కాదు. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు విజేత సూపర్ మార్కెట్ తగిన మూల్యం చెల్లించుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్ ను క్లీన్ సిటీగా, పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేసింది. చెత్తను ఎక్కడపడితే అక్కడ పారేయకుండా నగర ప్రజలకు అవగాహన కల్పించింది. నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రోడ్డుపై చెత్త పడేసిన ఘటనలో విజేత సూపర్ మార్కెట్ సీజ్ చేయబడింది. కాగా రాజేంద్రనగర్ సర్కిల్ హైదర్గూడలో విజేత సూపర్ మార్కెట్ లోని సిబ్బంది చెత్తను తీసుకొచ్చి రోడ్డుపై పడేశారు. ఇదే సమయంలో రాజేంద్రనగర్లో అధికారులతో కలిసి ఈరోజు జీహెచ్ఎంసీ కమీషనర్ రోనాల్డ్ రోస్ పర్యటించారు. తన ముందే చెత్తను రోడ్డుపై వేయడంతో జీహెచ్ఎంసీ కమీషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విజేత సూపర్ మార్కెట్ ను సీజ్ చేసి రూ. 50 వేల జరిమానా విధించారు. కాగా విజేత సూపర్ మార్కెట్ కు నగరంలో వినియోగదారుల నుంచి మంచి ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే.