Telangana: జైల్లో ఉన్న ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్న స్నేహితులు!

Khammam: ఖమ్మంలో విషాదం చోటు చేసుకుంది. దానవాయిగూడెం దగ్గర సాగర్ కాలువలో ముగ్గురు వ్యక్తులు గల్లంతు అయ్యారు.

Khammam: ఖమ్మంలో విషాదం చోటు చేసుకుంది. దానవాయిగూడెం దగ్గర సాగర్ కాలువలో ముగ్గురు వ్యక్తులు గల్లంతు అయ్యారు.

ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. దానవాయిగూడెం సమీపంలోని సాగర్ కాలువలో ముగ్గురు వ్యక్తులు గల్లంతు అయ్యారు. వీరిలో కేవలం ఒక వ్యక్తి మృతదేహం మాత్రమే దొరికింది. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. స్నేహితుడిని కలవడానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ విషాద ఘటన జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు పట్టణానికి చెందిన రాము అనే వ్యక్తి ఖమ్మం రూరల్ మండలం, దానవాయిగూడెం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రాముకు వెంకటేశ్వర్లు, రమేష్, ప్రసాద్, భరత్ అనే నలుగురు స్నేహితులు ఉన్నారు. వారు మణుగూరు పట్టణంలో బాపన కుంటకు చెందినవారు.

సోమవారం మధ్యాహ్నం తమ మిత్రుడిని చూసేందుకు జైల్ వద్దకు ఆటోలో వెళ్లారు. రాముని కలిసి కొంత సేపు అతనితో మాట్లాడారు. తమ మిత్రుడితో కాసేపు గడిపి తిరిగి బయలు దేరారు. ఖమ్మం నగరంలో ప్రకాశ్ నగర్ లో నివాసం ఉంటున్న వెంకటేశ్వర్లు బంధువు శ్రీనివాస్ ఇంటికి వెళ్లారు. అక్కడ సరదాగా అందరూ కలిసి మద్యం సేవించారు. మళ్ళీ అదే రోజు రాత్రి దానవాయిగూడెంలో ఉన్న రమేష్ అన్న కుమారుడు శ్రీహరి ఇంటికి వెళ్లారు. ఇక అక్కడ కూడా మద్యం సేవించారు.ఆ తరువాత తమ ఇళ్లకు వెళ్ళడానికి సిద్ధం అయ్యారు. తిరుగు ప్రయాణంలో బాగా చీకటి పడిందని దానవాయిగూడెం ఎన్‌ఎస్పీ కెనాల్ వద్ద ఆగారు. కాల్వకట్ట పక్కనే ఆటోనీ ఆపి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు.

ఇక వెంకటేశ్వర్లు ఆటోలో నిద్రిస్తున్నాడు. మిగిలిన ముగ్గురు రమేష్, ప్రసాద్, భరత్ మెట్లెక్కి కాల్వపైకి వెళ్లారు. స్నానం చేసేందుకు కాల్వలోకి దిగారు. అయితే అప్పటికే మద్యం మత్తులో మునిగి తెలిపోతున్నారు. దాంతో ముగ్గురు కాల్వలో కొట్టుకొని పోయారు. ఇక ఉదయం వెంకటేశ్వర్లు లేచి చూసే సరికి తన ముగ్గురు మిత్రులు కనిపించలేదు. ఎక్కడకి వెళ్లారో అని వారి కోసం వెతికాడు. ఈ క్రమంలో కెనాల్ దగ్గర వారి దుస్తులు కనిపించాయి. ఆ దుస్తులు చూసి వెంకటేశ్వర్లు షాక్ అయ్యాడు. దీంతో కంగారు పడి వెంటనే బంధువులకి ఫోన్ చేశాడు. పోలీసులకు కూడా సమాచారం ఇచ్చాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే కేవలం భరత్ మృతదేహం మాత్రమే దొరికింది. మిగిలిన ఇద్దరి ఆచూకీ మాత్రం దొరకలేదు. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలా మితి మీరిన మద్యం మత్తు వారి ప్రాణాల్ని బలి తీసుకుంది. ఈ ఘటనతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments