iDreamPost
android-app
ios-app

RTC డ్రైవర్‌ కుటుంబంలో ముగ్గురికి కానిస్టేబుల్‌ ఉద్యోగాలు! సక్సెస్‌ స్టోరీ

  • Published Oct 08, 2023 | 11:50 AM Updated Updated Oct 08, 2023 | 11:50 AM
RTC డ్రైవర్‌ కుటుంబంలో ముగ్గురికి కానిస్టేబుల్‌ ఉద్యోగాలు! సక్సెస్‌ స్టోరీ

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ ఇటీవల విడుదల చేసిన పోలీస్ కానిస్టేబుల్ తుది ఫలితాల్లో పలు కుటుంబాల్లో ఆనందం నింపింది. ఒకే కుటుంబంలో ఏకంగా ఇద్దరు, ముగ్గురు, నలుగురు అభ్యర్థులు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికై నయా హిస్ట్రీ క్రియేట్ చేశారు. సంగారెడ్డి జిల్లాలో ఒకే కుటుంబంలో నలుగురు ఒకేసారి కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ ఆర్టీసీ డ్రైవర్ కుటుంబంలోకి పోలీస్ ఉద్యోగాలు క్యూ కట్టాయి. ఆ ఆర్టీసీ ఉద్యోగి ఇద్దరు కొడుకులతో పాటు కోడలు కూడా కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైంది. దీంతో వారి కుటుంబం ఆనందంలో మునిగిపోయింది.

తండ్రి ఆర్టీసీ డ్రైవర్.. చాలీ చాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇది గమనించిన అతడి కుమారులు తండ్రి కష్టాన్ని, తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మొక్కవోని ధైర్యంతో, అంకితభావంతో చదివి లక్ష్యాన్ని ఛేదించి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలను సాధించారు. మహమూబ్‌ నగర్‌ జిల్లా పెబ్బేరుకు చెందిన కుడుకుంట్ల గోపాల్‌ అనే వ్యక్తి దాదాపు 30 ఏళ్ల క్రితం పొట్టచేత పట్టుకుని కుటుంబంతో సహా హైదరాబాద్ కు వచ్చాడు. కుటుంబాన్ని పోషించుకునేందుకు ఆర్టీసీలో డ్రైవర్ గా చేరాడు. కాగా ఇతడికి వాసు, వినయ్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. తను పడే కష్టం తన కొడుకులు పడకూడదని వారిని ఉన్నతంగా చదివించాడు.

కాగా గోపాల్ పెద్ద కుమారుడు వాసు 2018లో బీటెక్ విద్యను పూర్తి చేసి, అదే సమయంలో టీఎస్ గవర్నమెంట్ చేపట్టిన కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో ప్రిలిమ్స్ కు అర్హత సాధించి, ఫిజికల్ ఈవెంట్స్ లో విఫలమయ్యాడు. ఇక చిన్న కొడుకు వినయ్ ఓయూలో బీఎస్సీ కంప్యూటర్స్ విద్య అభ్యసిస్తున్నాడు. కాగా 2021 అక్టోబర్‌లో పెద్దకుమారుడు వాసుకు వనపర్తి జిల్లా జగత్‌పల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ టీచర్‌ కుమార్తె భవానీతో వివాహం జరిపించారు. ఈ క్రమంలో గతేడాది తెలంగాణ ప్రభుత్వం పోలీస్‌ కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో వీరు ముగ్గురు అప్లై చేసుకున్నారు.

రేయింబవళ్లు కష్టపడి చదివి ప్రిలిమ్స్, ఫిజికల్ ఈవెంట్స్ లో అర్హత సాధించారు. ఆ తర్వాత మెయిన్స్ పరీక్షలో కూడా ప్రతిభ కనబర్చి విజయం సాధించారు. కాగా ఇటీవల కానిస్టేబుల్స్‌ మెయిన్‌ పరీక్షల ఫలితాలు విడుదలవగా ముగ్గురు కూడా పోలీస్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఇద్దరు కొడుకులతో పాటు కోడలికి కూడా కానిస్టేబుల్ ఉద్యోగాలు రావడంతో ఆర్టీసీ డ్రైవర్‌ గోపాల్‌ ఇంట్లో సంతోషం నెలకొంది. ఒకే కుటుంబం నుంచి ముగ్గురు ఒకేసారి పోలీస్ ఉద్యోగాలు సాధించడంతో వారిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.