రూ.500కే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ పథకాలపై CM రేవంత్ కీలక ఆదేశాలు

Revanth Reddy:

Revanth Reddy:

ఎన్నికల వేళ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలు కోసం కాంగ్రెస​ సర్కార్‌ తీవ్రంగా కృషి చేస్తోంది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఇతర కాంగ్రెస్‌ నేతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆరు గ్యారెంటీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ స్కీమ్‌పై మహిళా లోకం హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ పథకం అమలైన నాటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగి.. సంస్థకు ఆదాయం కూడా పెరిగింది. ఇదిలా ఉండగా.. ఫిబ్రవరిలోనే మరో రెండు హామీల అమలుకు రెడీ అవుతోంది కాంగ్రెస్‌ సర్కార్‌. ఈమేరకు సీఎం రేవంత్‌ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు..

ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే రెండింటిని అమలు చేస్తోంది కాంగ్రెస్‌ సర్కార్‌. ఈ క్రమంలో మరో రెండు గ్యారెంటీల తక్షణ అమలుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజాపాలన దరఖాస్తులపై సచివాలయంలో కేబినేట్ సబ్ కమిటీ మంత్రులు, ఉన్నతాధికారులతో గురువారం నాడు.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ లబ్ధి జరిగేలా గ్యారంటీలను అమలు చేస్తామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈక్రమంలో రూ.500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకాలపై సంబంధిత విభాగాల అధికారులతో రేవంత్ రెడ్డి చర్చించారు. ఈ 3 గ్యారంటీల అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వీటిలో 500లకే గ్యాస్‌ సిలిండర్‌, ఫ్రీ కరెంటు ఈ రెండు హామీలను తక్షణమే ఫిబ్రవరి నుంచే అమలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

ఈ క్రమంలో ఒక్కో గ్యారంటీకి ఎంత మంది లబ్ధిదారులు ఉన్నారు.. వాటి అమలుకు ఎంత ఖర్చవుతుంది.. వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్‌. ఈ బడ్జెట్‌లోనే వాటికి అవసరమైన నిధులు కేటాయించాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లోపు మరోసారి కేబినేట్ సబ్ కమిటీతో సమావేశమై వీటిని ఫైనల్‌ చేస్తామని తెలిపారు.

ఆరు గ్యారెంటీల అమలుకు లబ్ధిదారులను ఎంపిక చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం.. గతేడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టి దరఖాస్తులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో మొత్తం 1,09,01,255 దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. జనవరి 12వ తేదీ నాటికే వీటికి సంబంధించిన డేటా ఎంట్రీ రికార్డు సమయంలో పూర్తి చేసినట్లు అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌కు విన్నవించారు. సీఎంకు నివేదించారు.

Show comments