P Venkatesh
CM Revanth reddy: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. వారికి ఎకరానికి రూ. 10 వేలు ఇస్తామని సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు.
CM Revanth reddy: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. వారికి ఎకరానికి రూ. 10 వేలు ఇస్తామని సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు.
P Venkatesh
తెలంగాణలో రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు అల్లకల్లోలం సృష్టించాయి. కుండపోత వర్షాలతో రాష్ట్రం చిగురుటాకులా వణికిపోయింది. భారీ వర్షాలతో వరదలు బీభత్సం సృష్టించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. జనజీవనం అస్తవ్యస్తమైంది. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు వణికించాయి. మున్నేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో ఖమ్మం నగరంలోని పలు కాలనీలు నీట మునిగాయి. కాగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ క్రమంలో వరదల్లో ఇళ్లు దెబ్బతిన్న వారికి తక్షణ సాయంకింద రూ. 10 వేలు ప్రకటించారు. అదే విధంగా రైతులకు గుడ్ న్యూస్ అందించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 10 వేలు పరిహారం ప్రకటించారు.
వరద బాధితులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఖమ్మంలో వరద ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం మంత్రులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంక్షోభ సమయంలో మంత్రులంతా ప్రజల వద్ద ఉండాలని, పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. పంట నష్టం వివరాలు సేకరిస్తున్నాం.. నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరానికి రూ.10వేలు చొప్పున పరిహారం ఇస్తాం అని తెలిపారు.
వరదల కారణంగా ఎవరైనా చనిపోతే వారి కుటుంబాలకు ఇచ్చే నష్ట పరిహారాన్ని భారీగా పెంచారు. ఇదివరకు రూ. 4 లక్షలు ఇస్తుండగా తాజాగా దాన్ని రూ. 5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు వరదల వల్ల రాష్ట్రంలో 16 మంది మరణించారని.. రూ.5,430 కోట్లు నష్టం జరిగిందని తెలిపారు. వరద బాధితులు సర్వం కోల్పోయారు. వారికి ఆహారం, తాగునీరు, మందులు అందిస్తున్నాం. ఎక్కడికక్కడ పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశాం. ఈ వరదలను జాతీయ విపత్తుగా పరిగణించి నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరాం అని సీఎం రేవంత్ వెల్లడించారు.