iDreamPost
android-app
ios-app

Revanth Reddy: నిజంగా శుభవార్తే.. CM రేవంత్‌తో కీలక ఒప్పందం.. 15 వేల మందికి ఉద్యోగాలు

  • Published Aug 06, 2024 | 9:35 AM Updated Updated Aug 06, 2024 | 9:35 AM

Revanth Reddy America Tour-Cognizant Company: యువతకు ఇది నిజంగా పండగలాంటి వార్తే అని చెప్పవచ్చు. సుమారు 15 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఆ వివరాలు..

Revanth Reddy America Tour-Cognizant Company: యువతకు ఇది నిజంగా పండగలాంటి వార్తే అని చెప్పవచ్చు. సుమారు 15 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఆ వివరాలు..

  • Published Aug 06, 2024 | 9:35 AMUpdated Aug 06, 2024 | 9:35 AM
Revanth Reddy: నిజంగా శుభవార్తే.. CM రేవంత్‌తో కీలక ఒప్పందం.. 15 వేల మందికి ఉద్యోగాలు

యువతకు ఇది పండగలాంటి వార్తే అని చెప్పవచ్చు. రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తూనే.. అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. విశ్వనగరంగా అభివృద్ది చెందుతున్న భాగ్యనగరానికి పెట్టుబడులను తీసుకురావడం కోసం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇదే విషయమై తాజాగా ఆయన అమెరికాలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌.. వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతూ.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో ఓ దిగ్గజ కంపెనీ సీఎం రేవంత్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం.. 15 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఆ వివరాలు..

ప్రపంచ స్థాయిలో ఐటీ రంగంలో పేరొందిన కాగ్నిజెంట్ కంపెనీ ప్రతినిధులతో.. సీఎం రేవంత్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో భారీ విస్తరణకు కాగ్నిజెంట్‌ సుముఖత వ్యక్తం చేసింది. హైదరాబాద్‌లో దాదాపు 15 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా సుమారు 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త సెంటర్ నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అధికారుల బృందం కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్, కంపెనీ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ భేటీ సందర్భంగా కాగ్నిజెంట్‌ ప్రతినిధులు సీఎం రేవంత్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు.

దీనిలో భాగంగా హైదరాబాద్‌లో తమ కంపెనీని విస్తరించడానికి అంగీకరించారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్‌గా నిలుస్తోన్న హైదరాబాద్‌ లాంటి విశ్వ నగరంలో తమ కంపెనీని విస్తరించటం సంతోషంగా ఉందని కాగ్నిజెంట్ సీఈవో ఎస్.రవికుమార్ తెలిపారు. హైదరాబాద్‌లో నెలకొల్పే కాగ్నిజెంట్ కొత్త సెంటర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ క్లయింట్లకు మెరుగైన సేవలందించేందుకు ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఐటీ సేవలతో పాటు కన్సల్టింగ్‌లోనూ అత్యాధునిక పరిష్కారాలను తమ కంపెనీ అందిస్తుందని కాగ్నిజెంట్‌ సీఈవో రవికుమార్ తెలిపారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్‌తో పాటు క్లౌడ్ సొల్యూషన్స్‌తో సహా ఇతర అధునాతన సాంకేతికతలపై ఈ కొత్త సెంటర్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని పేర్కొన్నారు.

హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర టైర్-2 నగరాలలో కూడా ఐటీ సేవలను విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన సూచన పట్ల కాగ్నిజెంట్‌ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే ప్రముఖ టెక్ కంపెనీలన్నీ హైదరాబాద్ వైపు చూస్తున్నాయని, ఇక్కడ కొత్త కేంద్రాన్ని స్థాపించాలనే కాగ్నిజెంట్ నిర్ణయం హైదరాబాద్ వృద్ధికి దోహదపడుతుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. దీని ద్వారా సుమారు 15 వేల మందికి ఉద్యోగాలు దొరకనున్నాయని చెప్పుకొచ్చారు.