iDreamPost
android-app
ios-app

గణపతి మండపంలోకి చొరబడి.. 21 కిలోల లడ్డూ ఎత్తుకెళ్లిన విద్యార్థులు!

గణపతి మండపంలోకి చొరబడి.. 21 కిలోల లడ్డూ ఎత్తుకెళ్లిన విద్యార్థులు!

వినాయక చవితిని పురుస్కరించుకుని దేశ వ్యాప్తంగా.. వాడవాడలా గణనాథులు కొలువు దీరిన సంగతి తెలిసిందే. ఇక, తెలుగు రాష్ట్రాల్లోని వినాయక మండపాల్లో భారీ లడ్డూలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. నిమజ్జనానికి ముందు ఆ లడ్డూలను వేలం వేయనున్నారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ లడ్డూలు వేలానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ వినాయక మండపంలో దొంగతనం చోటుచేసుకుంది. కొంతమంది విద్యార్థులు మండపంలోకి చొరబడి 21 కిలోల లడ్డూను ఎత్తుకెళ్లారు.

ఆ వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌, చార్మినార్‌ పీఎస్‌ పరిధిలోని ఘాన్సీ బజార్ గణేష్‌ మండపంలో 21 కిలోల లడ్డూను ఉంచారు. నిమజ్జనానికి ముందు వేలం వేద్దామని భావించారు. వేలానికి ముందే అనుకోని సంఘటన చోటుచేసుకుంది. కొంతమంది విద్యార్థులు స్కూలుకు వెళ్లే సమయంలో మండపంలోకి చొరబడ్డారు. దాదాపు 10 మంది దాకా ఆ లడ్డూను కాజేయటానికి ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. అక్కడ జనం తిరుగుతున్నారని తెలిసినా వాళ్లు దొంగతనానికి ప్రయత్నించారు.

ఓ విద్యార్థి లడ్డూ ఉన్న సంచిని పట్టుకుని మండంపంలోంచి పరుగులు పెట్టాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో రికార్డు కాకపోయినా.. లడ్డూను ఎత్తుకెళ్లిన తర్వాత ఆ విద్యార్థులు ఆ లడ్డూను తినేసినట్లు సమాచారం. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ పిల్లలు దేవుడితో సమానం.. తింటే తప్పు ఏముంది’’..‘‘తెలిసి చేశారో.. తెలియక చేశారో.. పాపం’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.