Krishna Kowshik
తెలంగాణ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అందించేందుకు రంగం సిద్దం చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ మేరకు ఆదివారం సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్సీలతో సమావేశమయ్యారు సీఎం రేవంత్, ఇతర మంత్రులు. కీలక నిర్ణయాలు చేశారు.
తెలంగాణ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అందించేందుకు రంగం సిద్దం చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ మేరకు ఆదివారం సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్సీలతో సమావేశమయ్యారు సీఎం రేవంత్, ఇతర మంత్రులు. కీలక నిర్ణయాలు చేశారు.
Krishna Kowshik
ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ వాటిని లబ్దిదారులకు అందించేందుకు కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే పలు పథకాలను అమలు చేసింది. మిగిలిన పథకాలను అమలుకు సంబంధించిన కార్యాచరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఆదివారం సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్సీలతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మీటింగ్ ముగిసిన అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సమావేశంలోని వివరాలను వెల్లడించారు. ఆరు గ్యారెంటీలను తాము అమలు చేస్తామని, గత ప్రభుత్వంలా కోతలు పెట్టమంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించిన కీలక వివరాలు తెలిపారు.
‘ఆరు గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులను ముందుగా ప్రజలకు అందిస్తాం. ఈ నెల 28 నుండి జనవరి 6 వరకు గ్రామ సభల ద్వారా దరఖాస్తులు తీసుకుంటాం. అర్హులైన వారు గ్రామసభల్లో అధికారులకు అప్లికేషన్ అందించాలి. ప్రజలు దరఖాస్తులు ఇచ్చిన తర్వాత రశీదు ఇస్తారు. స్వయంగా అధికారులు ఇంటింటికి వచ్చి దరఖాస్తులు తీసుకుంటారు. మారుమూల గూడెం అయినా సరే..10 ఇళ్లు వున్నా అధికారులే వెళ్లి దరఖాస్తు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలిచ్చాం. దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ తర్వాత.. అప్లికేషన్ దారులు ఏ పథకానికి అర్హులో అధికారులు నిర్ణయిస్తారు’ అని తెలిపారు. గ్రామ సభలకు వచ్చే వారి ఇబ్బంది పడకుండా సౌకర్యాలు కల్పించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. గ్రామసభలకు సౌకర్యాల కల్పనకు నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారని పొంగులేటి తెలిపారు.
గతంలో కలెక్టర్ల సమావేశానికి, ఈ సదస్సుకు వ్యత్యాసం ఉందని.. ప్రభుత్వ పనితీరుపై కలెక్టర్లు, ఎస్పీల అభిప్రాయాలు తెలుసుకున్నామని మంత్రి వెల్లడించారు. గతంలో 33 శాతం మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారని.. ఇప్పుడు ఆ శాతం 58కి పెరిగిందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాదిరి పథకాల్లో కోత పెట్టమని, ధరణి పోర్టల్ ద్వారా గత పాలకులు.. భూములను కబ్జా చేసి రెగ్యులరైజేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. మరికొన్ని ప్రాసెస్‌లో ఉన్నాయని, వాటన్నింటిపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. వాటిని తిరిగి వాస్తవ భూమి యాజమాన్యానికి అందిస్తామన్నారు. డ్రగ్స్ యువతకు ఎంత ప్రమాదకరమో.. రైతులు నష్టపోవడానికి నకిలీ విత్తనాలు కూడా అంతే ప్రమాదకరమన్న పొంగులేటి.. నకిలీ విత్తనాల అమ్మకం దారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరీ ఈ ఆరు పథకాలను రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేస్తున్న తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.