Tirupathi Rao
New EV Policy In Telangana: తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఈవీ పాలసీ సోమవారం నుంచి అమలులోకి వచ్చింది. అయితే ఈ కొత్త పాలసీ ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటి? వాహనదారులు ఎంత మేర లాభ పడనున్నారు? పూర్తి వివరాలు చూడండి.
New EV Policy In Telangana: తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఈవీ పాలసీ సోమవారం నుంచి అమలులోకి వచ్చింది. అయితే ఈ కొత్త పాలసీ ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటి? వాహనదారులు ఎంత మేర లాభ పడనున్నారు? పూర్తి వివరాలు చూడండి.
Tirupathi Rao
దేశ రాజధాని ఢిల్లీ మహా నగరం కాలుష్య కోరల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. చలికాలం వస్తే అక్కడి పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుంది. గాలి పీల్చుకుంటే ప్రాణం పోతుందేమో అనేంత దారుణంగా అక్కడి పరిస్థితులు మారుతున్నాయి. అలాంటి కాలుష్యాన్ని అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వం చాలానే చర్యలు తీసుకుంటోంది. అయితే అలాంటి పరిస్థితి మన హైదరాబాద్ కు రాకూడదు అని రేవంత్ సర్కార్ భావిస్తోంది. అందుకోసం ముందు జాగ్రత్త చర్యలను చేపట్టింది. కాలుష్యాన్ని నివారించేందుకు విద్యుత్ వాహనాల వాడకాన్ని పెంచే దిశగా అడుగులు వేస్తోంది. ఈవీల కొనుగోళ్లను మరింత ప్రోత్సహించే దిశగా కొత్త ఈవీ పాలసీని ప్రవేశ పెట్టింది. ఆ కొత్త ఈవీ పాలసీ సోమవారం నుంచి నవంబర్ 18 నుంచి అమలులోకి వచ్చింది. అసలు ఈ కొత్త ఈవీ పాలసీ ఏంటి? దీని వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి? అసలు ఈ కొత్త ఈవీ పాలసీ ప్రజలకు ఎంత మేలు చేస్తుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
రాష్ట్రంలో వాహన కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు రేవంత్ సర్కారు నడుం బిగించింది. రాష్ట్రవ్యాప్తంగా నూతన ఈవీ పాలసీ అమలులోకి వచ్చింది. జీవో 41 కింద నూతన ఈవీ పాలసీని తీసుకొచ్చింది. కొత్త పాలసీకి సంబంధించి రవాణా శాఖ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కొత్త ఈవీ పాలసీ ప్రకారం విద్యుత్ బైకులు, విద్యుత్ కార్లు, ఎలక్ట్రిక్ క్యాబులు, ఎలక్ట్రిక్ ఆటోలు, ఈవీల్లోనే టాటా ఏస్ తరహాలో ఉండే లైట్ గూడ్స్ క్యారియర్లు, ఈవీ ట్రాక్టర్స్ పై ఈ ప్రయోజనాలు లభించనున్నాయి. లిస్ట్ లో ఉన్న ఈవీ వాహనాలకు రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్ నుంచి 100 శాతం రాయితీ లభిస్తుంది. అంటే ఈ విద్యుత్ వాహనాలకు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ నూతన ఈవీ పాలసీ 2026 డిసెంబర్ చివరి వరకు అమలులో ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సోమవారం నుంచే విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసిన వాళ్లు ఈ ప్రయోజనాలను అందుకోవచ్చు.
అలాగే ఆర్టీసీలో త్వరలోనే ఈవీ బస్సులో పరుగులు పెట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆర్టీసీ విద్యుత్ బస్సులను కొనుగోలు చేస్తే.. వాటికి లైఫ్ టైమ్ ట్యాక్స్ ఫ్రీ బెనిఫిట్స్ లభించనున్నాయి. అలాగే ఏవైనా ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగుల రవాణా కోసం విద్యుత్ బస్సులు కొనుగోలు చేస్తే.. వారికి కూడా ఈ ప్రయోజనాలు లభించనున్నాయి. రాష్ట్రంలో వాహన కాలుష్యాన్ని కట్టడి చేసే దిశగా ఈ కొత్త పాలసీ తీసుకొచ్చినట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం 2020-2030 విద్యుత్ పాలసీని తీసుకొచ్చింది. అయితే ఆ పాలసీలో ఈవీల కొనుగోళ్లపై కొన్ని పరిమితులు ఉన్నాయి అన్నారు. అందుకే ఆశించిన స్థాయిలో ఈవీల కొనుగోళ్లు జరగలేదని అభిప్రాయ పడ్డారు. ఇప్పుడు వాటిని సవరిస్తూ కొత్త విధానం తీసుకొచ్చామన్నారు. ఇప్పుడు విద్యుత్ వాహనాల కొనుగోళ్లలో ఆశించిన ఫలితాలు లభిస్థాయి అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా హైదరాబాద్ మహా నగరం పరిస్థితి ఢిల్లీ, హర్యానా, పంజాబ్ వంటి రాష్ట్రాల మాదిరి కాకూడదు అనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. వాహనాల కాలుష్యం మితి మీరితే కట్టడి చేయడం చాలా కష్టమని అభిప్రాయ పడ్డారు. ప్రత్యక్ష ఉదాహరణగా ఢిల్లీ మహానగరం మన కళ్ల ముందే కనిపిస్తోంది అన్నారు. అలాంటి పరిస్థితి మన రాష్ట్రానికి రాకూడదు అనే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామన్నారు. వాయు కాలుష్యాన్ని నియంత్రించడమే తమ లక్ష్యం అని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. త్వరలోనే రవాణా శాఖకు కొత్త లోగో తీసుకురాబోతున్నామని తెలిపారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న 3 వేల బస్సుల స్థానంలో విద్యుత్ బస్సులను ప్రవేశ పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కొత్త ఈవీ పాలసీతో ప్రజలకు కూడా మేలు జరిగే అవకాశం ఉంది. కమర్షియల్ వాహనాల మీద కూడా ట్యాక్స్ రాయితీ రావడం మేలు చేసే అంశం అనే చెప్పాలి. బతుకుదెరువు కోసం క్యాబులు, లైట్ గూడ్స్ క్యారియర్లు కొనుగోలు చేసే వారికి ఈ పాలసీ వల్ల భారీ ప్రయోజనం లభిస్తుంది. అలాగే కొత్త పాలసీతో కచ్చితంగా విద్యుత్ వాహనాల కొనుగోళ్లు జోరందుకుంటాయి. మరి.. కొత్త ఈవీ పాలసీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.