iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ లో దంచి కొడుతున్న వర్షం.. నాలాలో పడి నాలుగేళ్ల బాలుడు మృతి!

హైదరాబాద్ లో దంచి కొడుతున్న వర్షం.. నాలాలో పడి నాలుగేళ్ల బాలుడు మృతి!

గత రెండు రోజుల నుంచి తెలంగాణలో వర్షం మళ్లీ ఊపందుకుంది. ముఖ్యంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు ఇళ్లల్లో నుంచి బయటకు రాలేనే పరిస్థితులు దాపరించాయి. మరీ ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా అపార్ట్ మెంట్లలోకే నీళ్లు రావడం విశేషం. అయితే ఈ క్రమంలోనే తాజాగా ఓ నాలుగేళ్ల బాలుడు నాలాలో పడి మృతి చెందాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు.ఈ వార్త తెలియడంతో బాలుడి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ ప్రగతి నగర్ లోని ఎన్ఆర్ఐ కాలనీకి చెందిన మిథున్ రెడ్డి (4) మంగళవారం 11 గంటలకు ఇంటి సమీపంలో ఆడుకుంటున్నాడు. అయితే ఈ క్రమంలోనే ఆ బాలుడు పక్కనే ఉన్న ఓ నాలాలో పడిపోయాడు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినట్లు తెలుస్తుంది. అయితే అతని తల్లిదండ్రులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జీహెచ్ఎంసీ అధికారుల సాయంతో బాలుడి ఆచూకి కోసం గాలించారు.

దాదాపు రెండు గంటల పాటు శ్రమించి ఎట్టకేలకు ఆ బాలుడి మృతదేహాన్ని రాజీవ్ గృహకల్ప వద్ద స్వాధీనం చేసుకున్నారు. కుమారుడిని ఆ స్థితిలో చూసి అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఉదయం పూట ఆడుతూ పాడుతూ కనిపించిన కొడుకు ఇక తిరిగి రాడని తెలిసి శోక సంద్రంలో మునిగిపోయారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో కాలనీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.