వన్డే వరల్డ్ కప్‌కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ క్రికెట్ అభిమానుల్లో దానిపై ఆసక్తి రెట్టింపు అవుతోంది. మెగా టోర్నీ కోసం క్రికెట్ ప్రపంచం మొత్తం ఎంతగానో ఎదురు చూస్తోంది. ఫ్యాన్స్ మాత్రమే కాదు.. క్రికెట్ మాజీలు, విమర్శకులు, విశ్లేషకులు అందరూ దీని గురించే మాట్లాడుతున్నారు. ప్రపంచ కప్‌పై అప్పుడే ప్రెడిక్షన్స్ కూడా మొదలయ్యాయి. జట్ల కాంబినేషన్‌తో పాటు ఏ టీమ్ ఎక్కడి వరకు వెళ్లగలదు అనేది అంచనా వేసేస్తున్నారు. దీన్ని బట్టే మెగా టోర్నీ మీద బజ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా క్రికెట్ దిగ్గజం, సౌతాఫ్రికా మాజీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
వన్డే వరల్డ్ కప్‌లో ఏయే జట్లు సెమీస్‌కు చేరతాయనే దాని మీద డివిలియర్స్ తన ప్రెడిక్షన్ చెప్పాడు. యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన ఏబీడీ.. తన సహచర ప్లేయర్ విరాట్ కోహ్లీ గురించి కూడా ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. త్వరలో జరిగే వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ గనుక దుమ్మురేపితే భారత్ టైటిల్ గెలిచే అవకాశాలు ఉంటాయన్నాడు. విరాట్ రాణించడం పైనే టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయని మిస్టర్ 360 తెలిపాడు. భారత్‌తో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు సెమీఫైనల్‌కు చేరతాయని జోస్యం పలికాడు.
వన్డే ప్రపంచ కప్-2023 ఫైనల్లో భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడే అవకాశం ఉందన్నాడు డివిలియర్స్. కోహ్లీ తన ఫేవరెట్ ఐపీఎల్ బ్యాటర్ అని.. అతడితో కలసి బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తానని పేర్కొన్నాడు. విరాట్ ఒక గొప్ప వ్యక్తి అన్న ఏబీడీ.. అతడు మానవతావాది కూడా అని చెప్పుకొచ్చాడు. ‘మైదానంలో కోహ్లీ దూకుడుగా ఉంటాడు. ప్లేయర్లను ఎప్పుడూ ఉత్సాహపరుస్తూ ఉంటాడు. గెలవాలనే తపనతో ఆడతాడు. కానీ మైదానం దాటి బయటకు వస్తే మాత్రం చాలా ప్రశాంతంగా, సరదాగా ఉంటాడు. నేనెప్పటికీ ఆర్సీబీ మనిషిని. ఆ జట్టుకు పనిచేయాలనే కోరిక ఉంది’ అని డివిలియర్స్ పేర్కొన్నాడు.