iDreamPost
android-app
ios-app

అప్పుడు పంత్.. ఇప్పుడు జోసెఫ్.. గబ్బాలో విజయం ఎందుకంత ప్రత్యేకం?

  • Published Jan 29, 2024 | 4:32 PM Updated Updated Jan 30, 2024 | 12:57 PM

ఆస్ట్రేలియాపై వెస్టిండీస్‌ రెండో టెస్ట్‌లో విజయం సాధించింది. ఆ విషయం ప్రస్తుతం క్రికెట్‌ ప్రపంచంలో మారుమోగిపోతుంది. ఎందుకంటే.. అది గబ్బా టెస్ట్‌ కాబట్టి. అసలు గబ్బాలో ఆస్ట్రేలియాను ఓడించడం ఎందుకంత స్పెషల్‌? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఆస్ట్రేలియాపై వెస్టిండీస్‌ రెండో టెస్ట్‌లో విజయం సాధించింది. ఆ విషయం ప్రస్తుతం క్రికెట్‌ ప్రపంచంలో మారుమోగిపోతుంది. ఎందుకంటే.. అది గబ్బా టెస్ట్‌ కాబట్టి. అసలు గబ్బాలో ఆస్ట్రేలియాను ఓడించడం ఎందుకంత స్పెషల్‌? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jan 29, 2024 | 4:32 PMUpdated Jan 30, 2024 | 12:57 PM
అప్పుడు పంత్.. ఇప్పుడు జోసెఫ్.. గబ్బాలో విజయం ఎందుకంత ప్రత్యేకం?

‘టూటా హై గాబా కా ఘమండ్‌’.. అంటూ 2021లో గబ్బా వేదికగా ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం సాధించినప్పుడు కామెంటేటర్‌ చెప్పిన మాట. దానర్థం ఏంటంటే.. గబ్బా గర్వం అంతమైంది అని. టీమిండియా లాంటి వరల్డ్‌ క్లాస్‌ టీమ్‌.. ఆస్ట్రేలియాపై ఓ వేదికలో విజయం సాధిస్తే అంతలా సెలబ్రేట్‌ చేసుకున్నారు. అలాగే తాజాగా వెస్టిండీస్‌ సైతం ఆస్ట్రేలియాను గబ్బా వేదికగా జరిగిన రెండో టెస్టులో ఓడించింది. దీన్ని కూడా ఒక రేంజ్‌లో సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. 2021లో ఎలాగైతే టీమిండియా చరిత్ర సృష్టించిందని క్రికెట్‌ లోకం సంబురాలు చేసుకుందో.. ఇప్పుడు కూడా సేమ్‌ వైబ్స్‌ కనిపిస్తున్నాయి. క్రికెట్‌ ప్రపంచం మొత్తం.. గబ్బాలో వెస్టిండీస్‌ విజయం గురించే మాట్లాడుకుంటోంది. అసలు గబ్బాలో టెస్ట్‌ మ్యాచ్‌ గెలవడం ఎందుకంత స్పెషల్‌? ఆ పిచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించడం అంటే అదేదో ప్రపంచ కప్‌ గెలిచినట్లుగా ఎందుకు క్రికెట్‌ లోకం సంబరపడిపోతుంది? ఇలాంటి ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఆస్ట్రేలియా.. ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న జట్టు. 2023 వారి పేరిట లిఖించాల్సిన ఏడాది. అది ఆస్ట్రేలియా నామసంవత్సరం. అప్పటికే ఏకంగా ఐదు సార్లు వన్డే వరల్డ్‌ కప్‌ గెలిచి ఉన్న జట్టు మరో వరల్డ్‌ కప్‌ను గెలిచింది. అంతకంటే ముందు.. వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ గెలిచి.. సాంప్రదాయ క్రికెట్‌కు రారాజుగా అవతరించింది. కేవలం 2023 అనే కాదు.. కొన్నేళ్లుగా ఆస్ట్రేలియా ప్రపంచ క్రికెట్‌పై తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే ఉంది. అలాంటి ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై ఓడించడం అనేది నిజంగా పెద్ద విషయమే.. అందులోనూ గబ్బాలో ఆస్ట్రేలియాను ఓడించడం అంటే అది చరిత్ర. ఇంత పెద్ద మాట​ ఎందుకు వాడాల్సి వచ్చిందంటే.. గబ్బా అంటే ఆస్ట్రేలియా అడ్డా. సింహంతో ఫైట్‌ చేసి.. ఏ జంతువు గెలిచినా అది గొప్ప విషయమే.. కానీ, సింహాలుండే గుహలోకి వెళ్లి మరీ సింహాన్ని ఓడించిందంటే.. అది చరిత్ర. ఇక్కడ గబ్బా కూడా ఆస్ట్రేలియా సింహాలకు గుహ లాంటిదే.

హోం టీమ్స్‌కు సొంత పిచ్‌లపై కాస్త పట్టు ఉండటం సహజం. కానీ, గబ్బా.. ఆస్ట్రేలియాకు స్వర్గధామం లాంటి పిచ్‌. ఇక్కడ లభించే బౌన్స్‌ ఆస్ట్రేలియాకు పండగలా ఉంటే.. ప్రత్యర్థి బ్యాటర్లకు వెన్నులో వణుకుపుట్టిస్తుం‍ది.  గబ్బాలో అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ ఆడటం.. 1931లో మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు.. ఈ పిచ్‌పై 66 అంతర్జాతీయ టెస్ట్‌ మ్యాచ్‌లు జరిగాయి. వాటిలో ఆస్ట్రేలియా ఎన్ని మ్యాచ్‌లో ఓడిందో తెలుసా..? కేవలం 10 మాత్రమే. ఈ పది మ్యాచ్‌ల్లో కూడా ఇంగ్లండ్‌ 4, వెస్టిండీస్‌ 4, ఇండియా, న్యూజిలాండ్‌ చెరొకటి మాత్రమే గెలిచాయి. మరే జట్టుకు కూడా ఇక్కడ మ్యాచ్‌ గెలిచిన చరిత్ర లేదు. 1947లో ఇండియా గబ్బాలో తొలి టెస్ట్‌ ఆడింది. 1947లో ఆడటం మొదలుపెడితే.. 2021లో ఇండియాకు తొలి విజయం దక్కిందంటేనే అర్థం చేసుకోవచ్చు ఆస్ట్రేలియా ఏ రేంజ్‌లో డామినేషన్‌ చేసిందో. ఇక ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ కూడా.. పీక్‌లో ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ మ్యాచ్‌లు గెలిచాయి.

న్యూజిలాండ్‌ 1985లో గెలిచింది. గబ్బాలో 1988లో చివరి సారిగా వెస్టిండీస్‌ చేతిలో ఓటమి పాలైన ఆస్ట్రేలియా.. 35 ఏళ్ల వరకు మరో జట్టుకు అలాంటి అవకాశం ఇవ్వలేదు. 2021లో ఇండియా గెలిచి ఆ రికార్డును బ్రేక్‌ చేసింది. గబ్బాలో ఆడిన ఇన్నింగ్స్‌తోనే రిషభ్ పంత్‌ పేరు ప్రపంచ క్రికెట్‌లో మారుమోగిపోయింది. అతను స్టార్‌ క్రికెటర్‌గా మారాడు. ఇటీవల బీసీసీఐ ప్రకటించిన నమన్‌ అవార్డ్స్‌లో కూడా టీమిండియా మాజీ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి మాట్లాడుతూ.. తన జీవితంలో గబ్బాలో టెస్ట్‌ మ్యాచ్‌ గెలవడమే గొప్ప విషయమని తెలిపాడు.  1983 వరల్డ్‌ కప్‌ గెలిచిన దిగ్గజ మాజీ క్రికెటర్‌ సైతం.. వరల్డ్‌ కప్‌ను మించి..  ఒక కోచ్‌గా గబ్బాలో ఆస్ట్రేలియాపై టెస్ట్‌ మ్యాచ్‌ గెలవడం తన జీవితంలో పెద్ద విషయమని ప్రకటించాడంటేనే అర్థం చేసుకోవచ్చు, గబ్బా టెస్ట్‌ విజయం ఎంత గొప్పదో.

అలాంటి మధుర విజయాన్ని మళ్లీ ఇప్పుడు వెస్టిండీస్‌ అందుకుని కొత్త చరిత్ర లిఖించింది. 1988లో ఆస్ట్రేలియాను గబ్బాలో ఓడించిన విండీస్‌ జట్టు.. మళ్లీ ఇన్నేళ్లకు గబ్బాలో టెస్ట్‌ మ్యాచ్‌ గెలిచింది. ఇలాంటి నమ్మశక్యం కానీ రికార్డులు ఉన్నాయి కాబట్టే.. గబ్బాలో ఆస్ట్రేలియాను ఓడించడం అంటే వరల్డ్‌ కప్‌ గెలిచినదాంతో సమానం. గబ్బా అంటే కేవలం ఒక వేదిక కాదు. అది ఆస్ట్రేలియా విజయ గర్వం. అందుకే ఆస్ట్రేలియాను గబ్బాలో ఓడిస్తే.. కేవలం మ్యాచ్‌లో వాళ్లను ఓడించినట్లు కాదు. వాళ్ల గర్వాన్ని ఓడించినట్లు. అందుకే కంగారులపై గెలిస్తే గబ్బాలోనే గెలవాలి అంటారు క్రికెట్‌ అభిమానులు. అలాంటి విజయాలను ఇండియా, వెస్టిండీస్‌ రెండేళ్ల వ్యవధిలో పొందడంతో క్రికెట్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి గబ్బాలో టెస్ట్‌లో ఆసీస్‌పై వెస్టిండీస్‌ విజయం సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.