తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ కు కఠినమైన పరిస్థితి ఎదురైంది. అయినప్పటికీ ప్లేయర్లు సమష్టిగా రాణించి.. 100 పరుగుల తేడాదో డిఫెండింగ్ ఛాంపియన్ కు కంగుతినిపించారు. కాగా.. ఇంగ్లాండ్ పై భారత్ విజయానికి ఐదు ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ కు కఠినమైన పరిస్థితి ఎదురైంది. అయినప్పటికీ ప్లేయర్లు సమష్టిగా రాణించి.. 100 పరుగుల తేడాదో డిఫెండింగ్ ఛాంపియన్ కు కంగుతినిపించారు. కాగా.. ఇంగ్లాండ్ పై భారత్ విజయానికి ఐదు ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
వరల్డ్ కప్ లో టీమిండియాకు వరుస విజయాలు. ఇంకేముంది జట్టుకు ఎదురులేదు అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ అసలైన ఒత్తిడి ఉండేది మాత్రం విజేతలకే అని చాలా తక్కువ మందికే తెలుసు. విజేతలకు ఒత్తిడి ఉండటం ఏంటని మీకు అనుమానం రావొచ్చు. వరుసగా విజయాలు సాధిస్తున్న జట్టు ఆ తర్వాత కూడా గెలవాలనే భావిస్తుంది. పైగా అభిమానులు కూడా ఇదే కోరుకుంటారు. దీంతో సహజంగానే టీమిండియాపై ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో ఒత్తిడి ఉంటుంది. ఇక ఇదే విషయం మ్యాచ్ మెుదలైన కొద్దిసేపటికే తేటతెల్లం అయ్యింది. తొలుత బ్యాటింగ్ చేయడం.. ఆ తర్వాత ప్రత్యర్థిని పడగొట్టడం, లక్ష్యాన్ని కిందామీద పడి ఛేదించడం. ఇదీ వరల్డ్ కప్ లో గత ఐదు మ్యాచ్ ల్లో టీమిండియా వరస. కానీ తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ కు కఠినమైన పరిస్థితి ఎదురైంది. అయినప్పటికీ ప్లేయర్లు సమష్టిగా రాణించి.. 100 పరుగుల తేడాదో డిఫెండింగ్ ఛాంపియన్ కు కంగుతినిపించారు. కాగా.. ఇంగ్లాండ్ పై భారత్ విజయానికి ఐదు ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
టీమిండియా విజయానికి 5 ప్రధాన కారణాలు:
వరల్డ్ కప్ లో తొలిసారి టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. కానీ ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ బౌలర్ల నుంచి గట్టి సవాల్ ఎదురైంది. పిచ్ నుంచి మంచి సహకారం లభించడంతో.. టీమిండియా బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు ఇంగ్లీష్ బౌలర్లు. పరుగులు రావడం సంగతి అటుంచి.. వికెట్లు కాపాడుకోవడానికే కష్టమైంది. ఇలాంటి పరిస్థితుల్లో తమ అద్భుతమైన బ్యాటింగ్ తో టీమిండియాను గట్టెక్కించారు కెప్టెన్ రోహిత్, సూర్యకుమార్ యాదవ్. విల్లీ, వోక్స్ బౌలింగ్ ధాటికి 12 ఓవర్లలో 40 రన్స్ కే 3 కీలక వికెట్లు కోల్పోయింది టీమిండియా. గిల్(9), కోహ్లీ(0), శ్రేయస్ అయ్యర్(4) ఘోరంగా విఫలం అయిన చోట.. కెప్టెన్ రోహిత్, సూర్య కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును నిలబెట్టారు. తొలుత కేఎల్ రాహుల్ తో కలిసి ఇన్నింగ్స్ చక్కబెట్టాడు రోహిత్. సింగిల్స్ తీస్తూ.. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ.. 66 బంతుల్లో అర్దశతకం పూర్తి చేసుకున్నాడు హిట్ మ్యాన్. ఒక దశలో 30 ఓవర్లకు 131/3తో నిలిచిన భారత్ గాడిలో పడినట్లే కనిపించింది కానీ.. విల్లీ బౌలింగ్ కు వచ్చి కేఎల్ రాహుల్(39)ను బోల్తా కొట్టించాడు. దీంతో భారత ఇన్నింగ్స్ మళ్లీ మెుదటికి వచ్చింది. అయితే సూర్యతో కలిసి మళ్లీ టీమిండియాను గాడిలో పెట్టడానికి ప్రయత్నించాడు రోహిత్. కానీ శతకం దిశగా సాగుతున్న హిట్ మ్యాన్ భారీ షాట్ కు ప్రయత్నించి 87 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అయ్యాడు. అనంతరం ఓ వైపు వికెట్లు పడుతున్నా.. సూర్యకుమార్ మాత్రం తన శైలికి భిన్నంగా ఆడుతూ.. స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. 47 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్స్ తో 49 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. అయితే టీమిండియా విజయంలో అద్బుతమైన బ్యాటింగ్ తో రోహిత్, సూర్యలు కీలక పాత్ర పోషించారు.
బౌలింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై.. ఇంగ్లాండ్ బౌలర్లే ఆ రేంజ్ లో చెలరేగారంటే, టీమిండియా బౌలర్లు ఏ రేంజ్ లో దుమ్మురేపుతారో అని అందరూ అనుకున్నారు. అనుకున్నట్లుగా టీమిండియా వరల్డ్ క్లాస్ బౌలింగ్ దళం ఇంగ్లాండ్ పని పట్టింది. పేస్ కు అనుకూలిస్తున్న పిచ్ పై బుమ్రా, షమీ చెలరేగిపోయారు. మరీ ముఖ్యంగా మహ్మద్ షమీ ప్రతీ బంతికి వికెట్ పడగొట్టేలా బంతులు విసురుతూ.. ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించాడు. మరోవైపు కుల్దీప్ సైతం తన మణికట్టుతో మాయచేశాడు. షమీ, బుమ్రాలు చెరో ఎండ్ నుంచి నిప్పులు చెరిగే బంతులు వేయడంలో పరుగులు రావడం కష్టమైంది. తొలి నాలుగు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది ఇంగ్లాండ్. దీంతో టీమిండియా ఫ్యాన్స్ లో టెన్షన్ మెుదలైంది. కానీ వారి టెన్షన్ ను కొద్ది నిమిషాల్లోనే పోగొట్టారు భారత బౌలర్లు. వరుస బంతుల్లో డేవిడ్ మలన్, రూట్ ను అవుట్ చేసి టీమిండియాకు అద్భుతమైన బ్రేక్ త్రూ ఇచ్చాడు బుమ్రా. ఆ తర్వాత షమీ ఆ వారసత్వాన్ని స్వీకరించి చెలరేగిపోయాడు. సిరాజ్ విఫలమైన చోట బుమ్రా(32/3), షమీ(22/4), కుల్దీప్(24/2) చెలరేగడంతో ఇంగ్లాండ్ 129 పరుగులకే కుప్పకూలింది.
వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో అన్ని విభాగాల్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది భారత జట్టు. మరీ ముఖ్యంగా రోహిత్ శర్మ బ్యాటింగ్ లోనే కాకుండా కెప్టెన్సీలో కూడా ఆకట్టుకున్నాడు. ఫీల్డింగ్ సెటప్ దగ్గర నుంచి బౌలర్లను పిచ్ పరిస్థితులకు తగ్గట్లుగా ఉపయోగిస్తూ.. ఇంగ్లాండ్ బ్యాటర్లపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చాడు. 230 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడానికి పక్కాగా తన ప్రణాళికలను అమలు చేసి విజయం సాధించాడు. సిరాజ్ కు వికెట్లు పడకపోవడాన్ని గమనించి మళ్లీ బుమ్రా, షమీలకు బంతిని అందించి ప్రతీసారి ఫలితాన్ని రాబట్టాడు రోహిత్. కుల్దీప్ ను సైతం మ్యాచ్ లో పరిస్థితులకు అనుకూలంగా వాడుకుంటూ వికెట్లు సాధించాడు. టీమిండియా విజయానికి రోహిత్ కెప్టెన్సీ కూడా ఓ కారణమే.
230 రన్స్ ఇంగ్లాండ్ ముందు టీమిండియా ఉంచిన లక్ష్యం. దీంతో భారత పరాజయం ఖాయం అని అందరూ అనుకున్నారు. కానీ టీమిండియా బౌలర్లు వారి అంచనాలను తలకిందులు చేస్తూ.. ఇంగ్లాండ్ జట్టును కుదేలు చేశారు. ప్రారంభం నుంచే ప్రత్యర్థి బ్యాటర్లపై పైచేయి సాధిస్తూ..వారిని ఒత్తిడిలోకి నెట్టారు. ముఖ్యంగా షమీ, బుమ్రాలు ఈ మ్యాచ్ లో చెలరేగిన విధానం అమోఘం. వీరిద్దరు కలిసి 54 పరుగులు మాత్రమే ఇచ్చి 7 వికెట్లు పడగొట్టారు. ఇందులో బుమ్రా 3, షమీ 4 వికెట్లతో సత్తా చాటారు. మరీ ముఖ్యంగా షమీ ప్రతీ బంతికి వికెట్ తీసే బంతులు వేస్తూ.. ఇంగ్లాండ్ బ్యాటర్లకు చెమటలు పట్టించాడు. 7 ఓవర్లలో 2 మెయిడెన్ లతో చెలరేగాడు. ఇక రెండు వరుస బంతుల్లో మలన్, రూట్ లను అవుట్ చేసి టీమిండియాకు బ్రేక్ త్రూ అందించాడు బూమ్ బూమ్ బుమ్రా. వీరిద్దరు 5 నుంచి 10 ఓవర్లలో 14 రన్స్ మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టారు.
విజయం ఏ ఒక్కరో సాధించేది కాదని మరోసారి రుజువు చేశారు టీమిండియా ఆటగాళ్లు. తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో విజయం రోహిత్ కో, సూర్యకుమార్ కో, షమీ, బుమ్రాలకో చెందదు. ఇది టీమ్ ఎఫర్ట్. ఈ మ్యాచ్ లో అన్ని విభాగాల్లో టీమిండియా అదరగొట్టింది. బ్యాటింగ్ లో గిల్, విరాట్, అయ్యర్ విఫలం అయినప్పటికీ మిగతా ఆటగాళ్లు భారాన్ని మోసి.. జట్టుకు పోరాడే స్కోర్ ను అందించారు. రోహిత్, సూర్య, రాహుల్ సమయోచిత ఇన్నింగ్స్ లు ఆడగా.. బౌలర్లు స్వల్ప లక్ష్యాన్ని కాపాడటంలో విజయవంతమైయ్యారు. దీంతో ఇలాంటి విజయాలే టీమిండియా ఫ్యాన్స్ కోరుకునేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. బ్యాటింగ్ లో రోహిత్, రాహుల్, సూర్య లు రాణిస్తే.. బౌలింగ్ లో షమీ, బుమ్రా, కుల్దీప్ యాదవ్ సత్తాచాటారు. ఈ విజయానికి ముఖ్య కారణం టీమ్ ఎఫర్టే అని కచ్చితంగా చెప్పొచ్చు. మరి టీమిండియా సాధించిన ఈ విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.