iDreamPost
android-app
ios-app

ఆసియా కప్పు తీసుకొచ్చి ఇతని చేతుల్లో పెట్టారు! ఎవరితను?

  • Published Sep 18, 2023 | 11:05 AM Updated Updated Sep 18, 2023 | 11:05 AM
  • Published Sep 18, 2023 | 11:05 AMUpdated Sep 18, 2023 | 11:05 AM
ఆసియా కప్పు తీసుకొచ్చి ఇతని చేతుల్లో పెట్టారు! ఎవరితను?

సంచలన ప్రదర్శనతో ఆసియా కప్‌ ఫైనల్‌లో శ్రీలంకను చిత్తు చేస్తూ.. టీమిండియా ఘన విజయం సాధించింది. ఏకంగా 8వ సారి ఆసియా కప్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆదివారం కొలంబోలో జరిగిన మ్యాచ్‌లో.. లంకను కేవలం 50 పరుగులకే భారత్‌ బౌలర్లు ఆలౌట్‌ చేసేశారు. ముఖ్యంగా సిరాజ్‌ ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లతో పాటు.. మొత్తంగా 6 వికెట్లు పడగొట్టి లంక పతనాన్ని శాసించాడు. ఆ తర్వాత 51 పరుగుల టార్గెట్‌ను టీమిండియా వికెట్‌ కోల్పోకుండా ఛేదించి.. 10 వికెట్ల తేడా ఘనవిజయం సాధించి.. ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది. అయితే.. మ్యాచ్‌ తర్వాత ట్రోఫీ అందుకున్న టీమిండియా రోహిత్‌ శర్మ.. కప్పును తీసుకెళ్లి ఓ వ్యక్తి చేతిలో పెట్టాడు. ఆ వ్యక్తి ఎవరో చాలా మందికి తెలియదు. దీంతో అతను ఎవరై ఉంటాడు? ఎందుకింత ఇంపార్టెంట్‌ ఇస్తున్నారు? అని ఫ్యాన్స్‌ తెగ సెర్చ్‌ చేస్తున్నారు. అయితే.. అతని పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా ఆటగాళ్ల ప్రేమ, గౌరవం పొందుతున్న ఆ వ్యక్తి పేరు రఘు. పూర్తి పేరు రాఘవేంద్రా. కర్ణాటకలోని కుమాట అనే గ్రామానికి చెందిన వాడు. దాదాపు పదేళ్లుగా ఇండియన్‌ టీమ్‌ కోసం త్రోడౌన్‌ బౌలర్‌ పనిచేస్తున్నాడు. ఓ 20 ఏళ్ల క్రితం క్రికెటర్‌ అవ్వాలనే ఆశయంతో చదువు మానేసి.. ముంబై చేరుకున్నాడు రఘు. దేశానికి ఆడాలని ఎన్నో కలలు కన్నాడు. కానీ, ఆ కలలను నిజం చేసుకోలేకపోయాడు. అయినా కూడా క్రికెట్‌పై తన పిచ్చి మాత్రం తగ్గలేదు. బెంగుళూరులోని నేషనల్‌ క్రికెటర్‌ అకాడమీ(ఎన్‌సీఏ)లో త్రోడౌన్‌ బౌలర్‌గా అవకాశం వస్తే అక్కడికి వెళ్లాడు. అక్కడికి ప్రాక్టీస్‌ కోసం, ఫిట్‌నెస్‌ సాధించేందుకు, గాయపడి కోలుకునేందుకు అకాడమీకి వచ్చే భారత క్రికెటర్లకు నెట్స్‌లో బాల్స్‌ విసిరేవాడు.

ఆ సమయంలో రఘు.. రాహుల్‌ ద్రవిడ్‌ కళ్లల్లో పడ్డాడు. అద్భుతమైన పేస్‌తో పాటు.. వేరియేషన్స్‌తో బాల్స్‌ విసిరేవాడు. 140, 150 వేగంతోనే కాకుండా.. ఇన్‌, అవుట్‌ స్వింగ్స్‌తో బ్యాటర్లకు మంచి ప్రాక్టీస్‌ అందించేవాడు. ఇండియన్‌ క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ సైతం రఘు టాలెంట్‌కు ముగ్ధుడైపోయాడు. రఘును ఏకంగా ముంబైలోని తన ఇంటికి తీసుకెళ్లి మరీ.. అతనితో కలిసి ప్రాక్టీస్‌ చేశాడు. ఎన్‌సీఏ నుంచి 2011 టైమ్‌లో ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ అసిస్టెంట్‌ సపోర్టింగ్‌ స్టాఫ్‌గా రఘుకు ప్రమోషన్‌ దక్కింది. అక్కడి నుంచి రఘు ఇండియన్‌ టీమ్‌లో రెగ్యులర్‌ సభ్యుడైపోయాడు. జట్టు ఎక్కడికి వెళ్లినా రఘు ఉండాల్సిందే. ప్రాక్టీస్ సెషన్స్‌లో అందరికంటే ముందు వచ్చేది.. అందరికంటే ఆఖరిగా వెళ్లేది రఘునే. అది అతని డెడికేషన్‌.

రఘుకు ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌లో చాలా మంది అభిమానులు ఉన్నారు. ఎంఎస్‌ ధోని, విరాట్‌ కోహ్లీ, పుజారా, మురళీ విజయ్‌, అజింక్యా రహానె వీళ్లందరికీ రఘు అంటే ఎంతో అభిమానం. తమ బ్యాటింగ్‌ ఇంప్రూమెంట్‌కు రఘు అందిస్తున్న సపోర్ట్‌కు వాళ్లేంతో కృతజ్ఙతగా ఉండేవాళ్లు. కొన్ని సందర్భాల్లో కోహ్లీ తన సక్సెస్‌ వెనుక రఘు కూడా ఉన్నాడని ప్రకటించాడు. ఇక ధోని అయితే.. ఇండియన్‌ టీమ్‌లో ఉన్న ఒకే ఒక ఫారెన్‌ ప్లేయర్‌ అంటూ రఘును పిలిచేవాడు. ఎందుకంటే అతను వేసే బంతులు ఫారెన్‌ పేసర్లు వేసేలా ఉంటాయని అలా అనేవాడు. రఘు వేసే బంతులు.. మోర్ని మార్కెల్‌, మిచెల్‌ స్టార్క్‌లు వేసే బంతుల్లా ఉంటాయి.

రఘు వేసే బంతులను ఎదుర్కొవడం వల్లనే ఇండియన్‌ క్రికెటర్లు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా లాంటి దేశాలకు వెళ్లినప్పుడు బౌన్సీ అండ్‌ ఫాస్ట్‌ పిచ్‌లపై అంత ధైర్యంగా ఆడి అద్భుతంగా పరుగులు చేయగలిగారు. ఒక సారి రఘు విసిరే బంతులను నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తూ.. అజింక్యా రహానె తన చేయి కూడా విరగ్గొట్టుకున్నాడు. అంత వేగంగా వస్తాయి రఘు వేసే బంతులు. నెట్స్‌లోనే కాకుండా.. జట్టు ఆటగాళ్లు హోటల్స్‌లో ఉన్న సమయంలో కూడా రఘు వాళ్లకు ఏం కావాలో చూసుకుంటూ ఉంటాడు. ఎప్పుడు ఉరుకులు పరుగులు పెడుతున్నా.. రఘు ఎప్పుడు అలసిపోడు, పైగా కించుతు గర్వం లేని మనిషి. ఎప్పుడు సిగ్గు పడుతూ.. చిరునవ్వుతో ఆటగాళ్లకు తోడుగా ఉంటాడు.

ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న త్రోడౌన్‌ బౌలర్లలో రఘు బెస్ట్‌గా ఉన్నాడు. రెండు మూడు దేశాల జట్లు సైతం.. తమ కోసం పనిచేయాలని భారీ ఆఫర్లు ఇచ్చినా.. వాటిని రఘు సున్నితంగా తిరస్కరించాడటా.. దేశంపై రఘుకు ఉన్న గౌరవం అది. అలాగే ఐపీఎల్‌లోను రఘు ఏ టీమ్‌ కోసం పనిచేయడు. ఓన్లీ ఫర్‌ ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌. అందుకే రఘు అంటే జట్టులోని ఆటగాళ్లందరికీ ఎంతో గౌరవం, ప్రేమ. చాలా కాలం చేత్తో బాల్‌ విసిరి విసిరి.. రఘు తన చేతి ఎముకలు కూడా కరిగించుకున్నాడు. కానీ, కొన్నేళ్లుగా సైడ్‌ఆర్మ్‌ అనే బంతులు విసిరి పరికరంతో అతనికి కాస్త ఉపశమనం లభించింది. పెద్ద చెంచలా ఉండే దాంతో రఘు ఇప్పుడు బంతులు విసురుతున్నాడు. విరాట్‌ కోహ్లీ లాంటి బ్యాటర్లు ప్రపంచ అగ్రేశ్రేణి క్రికెటర్లుగా కీర్తి ప్రతిష్టతలు అందుకుంటున్నారూ అంటే అందులో రఘు శ్రమ కూడా ఉంది. అందుకే రఘుని టీమిండియా క్రికెటర్లు ఆదివారం ఆసియా కప్‌ అందజేసి అంతలా గౌరవించారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: 23 ఏళ్ళ భారత్ పగ తీర్చిన సిరాజ్! అప్పట్లో మన పరువు తీశారు!