iDreamPost

23 ఏళ్ళ భారత్ పగ తీర్చిన సిరాజ్! అప్పట్లో మన పరువు తీశారు!

23 ఏళ్ళ భారత్ పగ తీర్చిన సిరాజ్! అప్పట్లో మన పరువు తీశారు!

మహమ్మద్ సిరాజ్.. ఆసియా కప్ ఫైనల్ లో అద్భుతమైన బౌలింగ్ చేసి.. ఒక్కసారిగా హీరో అయ్యాడు. ఒకే ఓవర్లో నాలుగు వికెట్స్ తీయడమే కాకుండా, మొత్తం 6 వికెట్స్ తన ఖాతాలో వేసుకుని శ్రీలంకని చావు దెబ్బ కొట్టాడు. సిరాజ్ ధాటికి శ్రీలంక 50 పరుగులకే ఆలౌట్ అయ్యి, పరువు పోగుట్టుకుంది. ఈ నేపథ్యంలోనే 23 ఏళ్ళ టీమిండియా పగ తీరింది అంటూ ఓ కొత్త చర్చ తెరపైకి వచ్చింది. శ్రీలంకని ఇంత తక్కువ స్కోర్ కే ఆలౌట్ చేయడం వెనుక.. టీమిండియాకి ఉన్న పగ ఏమిటి అనేది తెలియాలి అంటే కాలంలో కాస్త వెనక్కి వెళ్ళాలి. విజయం దక్కితే.. గర్వంతో రెచ్చిపోయే శ్రీలంక జట్టు గురించి తెలుసుకోవాలి. భారత్ తో మ్యాచ్ అంటే కసిగా రెచ్చిపోయే ఆ జట్టు ఆటగాళ్ల తీరు గురించి తెలుసుకోవాలి. 2000వ సంవత్సరం అక్టోబర్ 29వ తేదీన జరిగిన.. ఓ వన్డే మ్యాచ్ గురించి ఈ తరం క్రికెట్ ప్రేమికులు తెలుసుకోవాలి.

2000వ సంవత్సరం అక్టోబర్ 29.. కోకాకోలా ట్రోఫీ ఫైనల్ మ్యాచ్. టోర్నీలో మూడో జట్టైనా జింబాబ్వేని ఇంటికి పంపి ఇండియా-శ్రీలంక ఫైనల్ చేరుకున్నాయి. అప్పటికి గంగూలీ కెప్టెన్ అయ్యి.. నెలల కాలమే అవుతోంది. వరుస పరాజయాలు, అంతకుముందు ఏడాది మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు, వన్డేల్లో ఏడోవ ర్యాంకు.. ఇలా టీమిండియాకి ఎటు చూసినా పచ్చి గాయాలే. గంగూలీ అవన్నీ మర్చిపోయి, ముందుకి కదిలేలా టీమ్ లో అప్పుడే జవసత్వాలు నింపుతున్నాడు.

అలాంటి సమయంలో జయసూర్య, ఆటపట్టు, సంగక్కర, జయవర్ధనే, ముత్తయ్య మురళీధరన్, చమిందా వాస్ వంటి ఆటగాళ్లు ఉన్న బలమైన జట్టుపై విజయం మనకి అనివార్యమైంది. టీమిండియా ఘనత గతం కాదు, మాలో ఇంకా గెలిచే సత్తా ఉందని గంగూలీ నిరూపించాలి అనుకున్నాడు. కానీ.., సనత్ జయసూర్య ఎప్పటిలానే ఆ మ్యాచ్ లో కూడా టీమిండియాపై పంజా విసిరాడు. ఒక్కడే 189 పరుగులు సాధించాడు. తుఫానులా మన బౌలర్స్ ని ముంచేశాడు. 21 ఫోర్లు, 4 సిక్సర్లుతో విరుచుకుపడ్డాడు. దీంతో.. టీమిండియా టార్గెట్ దెబ్బతో 300కి చేరుకుంది.

300 స్కోర్ సాధించడం ఈరోజుల్లో చాలా మామూలు విషయం. కానీ.., 23 ఏళ్ళ క్రితం 300 అంటే ఛేదించడం అసాధ్యం. భారీ ఛేదనలో భారత్ పూర్తిగా తడబడింది. ఈరోజు మన సిరాజ్ లానే, నాడు చమిందా వాస్ మనపై నిప్పులు చెరిగాడు. సచిన్, గంగూలీ, కాంబ్లీ వంటి స్టార్స్ తో అప్పుడే కెరీర్ స్టార్ట్ చేసిన యువరాజ్ ని సైతం అవుట్ చేసి, భారత్ పతనాన్ని శాసించాడు. మొత్తం 5 వికెట్స్ అతని ఖాతాలో పడ్డాయి. మరో ఎండ్ నుండి ముత్తయ్య 3 వికెట్స్ తీసి భారత్ ని ముంచేశాడు. ఈ ఇద్దరి దెబ్బతో టీమిండియా కేవలం 54 పరుగులకే కుప్ప కూలింది. జట్టులో రాబిన్ సింగ్ ఒక్కడే రెండు అంకెల స్కోర్ చేశాడంటే.. లంకేయన్స్ మనపై ఎలాంటి యుద్ధం చేశారో అర్ధం చేసుకోవచ్చు.

ఆ మ్యాచ్ తో టీమిండియా కాన్ఫిడెన్స్ లెవల్స్ దారుణంగా పడిపోయాయి. పతనం దిశగా భారత్ అంటూ.. అప్పటి మీడియా దుమ్మెత్తి పోసింది. తరువాత కాలంలో గంగూలీ.. ఏ పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చాడు. టీమిండియాని ఓ అజేయమైన శక్తిగా నిలిపాడు. ఇక అక్కడ నుండి ధోని ప్రపంచ విజేతగా నిలపగా, కోహ్లీ సారథ్యంలో భారత్ కి తిరుగు లేకుండా పోయింది. ఇప్పుడు రోహిత్ హయాంలోనూ టీమిండియా అంతే పవర్ తో ముందుకి సాగిపోతోంది. కానీ.., ఈ 23 ఏళ్లలో ఎన్ని విజయాలు సాధించినా, లంకని కూడా అలా ఆలౌట్ చేసి పగ తీర్చుకోవాలన్న కోరిక అలానే ఉండిపోయింది.

అయితే.., ఇన్నాళ్ల తరువాత సిరాజ్ టీమిండియా పగ తీర్చడం విశేషం. పైగా.. అప్పట్లో భారత్ ఎలాంటి కష్టాల్లో అయితే ఉండిందో, ఇప్పుడు శ్రీలంక పరిస్థితి కూడా అలాంటిదే. పైగా.. అక్కడ కోకాకోలా ఫైనల్ లో మనకి దారుణ పరాజయం ఎదురవ్వగా.. ఇప్పుడు శ్రీలంకని కూడా ఫైనల్ లోనే చావు దెబ్బ కొట్టినట్టు అయ్యింది. దీంతో.. ఇది కదా సరిగ్గా పగ తీర్చుకోవడం అంటే.. థాంక్యూ సిరాజ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి