iDreamPost
android-app
ios-app

టీమిండియా క్రికెటర్ గొప్ప మనసు.. యువ క్రికెటర్ల కోసం సొంత డబ్బుతో ఏకంగా..

  • Author Soma Sekhar Published - 04:20 PM, Mon - 26 June 23
  • Author Soma Sekhar Published - 04:20 PM, Mon - 26 June 23
టీమిండియా క్రికెటర్ గొప్ప మనసు.. యువ క్రికెటర్ల కోసం సొంత డబ్బుతో ఏకంగా..

తానొక్కడే ఎదగాలనుకోవడం స్వార్థం.. ఇక తనతో పాటుగా పది మందీ ఎదగాలి అనుకోవడం మంచితనం. ఈ మంచితనం అందరికి ఉండదు. అలాంటి మంచితనాన్ని మనసునిండా నింపుకుని రాబోయే తరం క్రికెటర్లకు అండగా నిలుస్తున్నాడు ఓ టీమిండియా క్రికెటర్. తన గొప్ప మనసును చాటుకుని సొంత డబ్బులతో.. యువ ప్రతిభావంతులైన క్రికెటర్లను వెలుగులోకి తీసుకురావాలని పూనుకున్నాడు. అతడే టీమిండియా యార్కర్ల స్పెషలిస్ట్ టి. నటరాజన్. ఇంతకీ అతడు చేసిన పని ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నటరాజన్.. యార్కర్ల స్పెషలిస్టుగా టీమిండియాలో పేరుగాంచాడు. కాగా.. 2020 ఐపీఎల్ సీజన్ లో తన పదునైన యార్కర్లతో అందరి దృష్టిని ఆకర్షించాడు. దాంతో అతి తక్కువ కాలంలోనే టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. ఈ అవకాశాన్ని నటరాజన్ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్ లో అద్భుతంగా రాణించాడు. దాంతో టీమిండియా సెలక్టర్లు మూడు ఫార్మాట్లలో అతడికి అవకాశం కల్పించారు. అయితే అతడి కెరీర్ కు గాయాలు బ్రేక్ వేశాయి. గాయం కావడంతో.. జట్టుకు దూరం కావాల్సి వచ్చింది.

ఇక ఐపీఎల్ తర్వాత నటరాజన్ జీవితమే మారిపోయింది. ఆర్దికంగా నిలదొక్కుకున్నాడు. ఈ క్రమంలోనే తన కెరీర్ తొలినాళ్లలో పడ్డ కష్టాలు తన ఊరి యంగ్ క్రికెటర్లు పడొద్దని తన సొంత డబ్బులతో క్రికెట్ అకాడమీని నిర్మించాడు. ఇది తన జీవిత లక్ష్యంగా చాలా సార్లు పేర్కొన్నాడు కూడా. ఇప్పటికి నా కల నెరవేరిందని, మా సొంత గ్రామంలో క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేశాను. ఇది మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది, ఈ అవకాశం కల్పించిన ఆ భగవంతుడికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటూ నటరాజన్ చెప్పుకొచ్చాడు.

తమిళనాడులోని సేలం సమీపంలో చిన్నంపట్టి అనే గ్రామంలో నటరాజన్ ఈ క్రికెట్ గ్రౌండ్ ను నిర్మించాడు. తన ఊరిలోని ప్రతిభావంతులు అయిన యువ క్రికెటర్లకు శిక్షణ ఇచ్చేందుకు.. అన్ని వసతులతో కూడిన క్రికెట్ స్టేడియాన్ని నిర్మించాడు నటరాజన్. ఇక ఈ గ్రౌండ్ కు నటరాజన్ క్రికెట్ గ్రౌండ్ (NCG) అని పేరు పెట్టారు. ఈ క్రికెట్ అకాడమీని టీమిండియా వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ప్రారంభించాడు. యువ క్రికెటర్ల కోసం తన స్నేహితుడు చేస్తున్న పనిని అభినందించాడు దినేష్ కార్తీక్. ఈ కార్యక్రమానికి నటుడు యోగిబాబుతో పాటుగా మరికొంత మంది ప్రముఖులు హాజరయ్యారు.