ఏంటి భయ్యా ఇలా తగులుకున్నావ్.. కెమెరాకు చిక్కిన సూర్య

వన్డే వరల్డ్ కప్ 2023 జోరు కొనసాగుతోంది. క్రికెట్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తోంది. ఇప్పటికే జట్ల మధ్య లీగ్ మ్యాచ్ లు హొరాహోరిగా జరుగుతుండగా, ప్రేక్షకులకు మాత్రం కావాల్సిన వినోదాన్ని పంచుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచకప్ లో భాగంగా జరిగిన భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ లో ఓ హాస్యభరితమైన సన్నివేశం చోటుచేసుకుంది. టీమిండియా స్టార్ బ్యాటర్ డగౌట్ లో కూర్చుని తింటుండగా కెమెరా బంధించింది. ఆ సమయంలో ఆ క్రికెటర్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ ప్రతిఒక్కరికి నవ్వు తెప్పించేలా ఉన్నాయి. పాపం కెమెరా కంట పడగానే అతడు దాని నుంచి తప్పించుకోవడానికి నానా తంటాలు పడ్డాడు.

కాగా అక్టోబర్ 8న ఇండియా, ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆతిథ్య టీమిండియా ఆసిస్ పై విజయం సాధించి వరల్డ్ కప్ లో శుభారంబం చేసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కంగారులు భారత బౌలర్ల ధాటికి విలవిలలాడిపోయారు. భారత స్పిన్నర్ల చేతిలో ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ కుప్పకూలింది. నిర్ణీత 50 ఓవర్లలో 199 పరుగులు చేసిన ఆసిస్ ఆలౌట్ అయ్యింది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఛేదనలో తడబడినా కింగ్ కోహ్లీ, కేఎల్ రాహుల్ అద్భుతమైన ఇన్నింగ్స్ తో జట్టు విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా జరుగుతున్న వేళ సూర్య కుమార్ యాదవ్ తినడానికి ఉపక్రమించాడు.

భారత్ బ్యాట్స్ మెన్లు ముగ్గురు డకౌట్ అవ్వగా టీమిండియా ఫ్యాన్స్ తోపాటు డగౌట్ లో కూర్చున్న ప్లేయర్స్ ఒకింత భయాదోళనతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఈ సమయంలో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ స్కై మాత్రం ఎంచక్కా స్నాక్స్ తింటూ మ్యాచ్ చూస్తున్నాడు. ఈ దృశ్యాన్ని కెమెరా బంధించింది. ఈ విషయాన్ని గ్రహించిన సూర్య నమలడం ఆపేశాడు. రోబో మాదిరి కదల కుండా బిగుసుకుపోయాడు. అంతేగాక కెమెరా ఇంకా నా వైపే ఉందా అని దానివైపు ఓర కంటతో చూశాడు.

నవ్వులు పూయించే ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై కొందరు సరదాగా కామెంట్ చేస్తుండగా మరికొందరు టీమ్ కష్టాల్లో పడుతుంటే ఎలా తినాలనిపిస్తోందంటూ కామెంట్ చేస్తున్నారు.కాగా టాప్ టీ20 క్రికెట్ బ్యాటర్లలో ఒకడైన సూర్యకుమార్ యాదవ్ వరల్డ్ కప్ లో భారత్ ఆడిన తొలి మ్యాచ్ లో బెంచ్ కే పరిమితం కావాల్సి వచ్చింది. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ను మేనేజ్ మెంట్ ఎంపిక చేయడంతో సూర్యకు మ్యాచ్ ఆడే అవకాశం దక్కలేదు.

 

Show comments