iDreamPost
android-app
ios-app

ఇద్దరు సీనియర్లను ఇంటికి పంపిన ఆర్సీబీ! డివిలియర్స్‌ రీ ఎంట్రీ!

  • Author Soma Sekhar Published - 02:42 PM, Mon - 17 July 23
  • Author Soma Sekhar Published - 02:42 PM, Mon - 17 July 23
ఇద్దరు సీనియర్లను ఇంటికి పంపిన ఆర్సీబీ! డివిలియర్స్‌ రీ ఎంట్రీ!

వచ్చే ఐపీఎల్ ట్రోఫీ లక్ష్యంగా ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి. అందులో భాగంగానే.. జట్లలో మర్పులతో పాటుగా కోచింగ్ స్టాఫ్ ను కూడా మారుస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ఫ్రాంచైజీలు తమ హెడ్ కోచ్ లను, మెంటర్లను ఇంటికి సాగనంపాయి. ఈ జాబితాలోకి మరో జట్టు చేరింది. 16 సీజన్ల ఐపీఎల్ చరిత్రలో ఒక్కసారి కూడా కప్ గెలవని జట్టుగా చెత్త రికార్డును మూటగట్టుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. దాంతో వచ్చే సీజన్ లోనైనా కప్ కొట్టాలన్న ధ్యేయంతో.. పావులు కదుపుతోంది ఆర్సీబీ. ఈ మార్పుల్లో భాగంగానే.. కోచింగ్ స్టాఫ్ మెంబర్స్ అయిన సంజయ్ బంగర్(గత రెండు సీజన్లు హెడ్ కోచ్), టీమ్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మైక్ హెస్సెన్ లను తొలగించనున్నట్లు తెలుస్తోంది.

ఐపీఎల్ లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ జట్టు ఏది అంటే అందులో కచ్చితంగా ముందుండే పేరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. కానీ అభిమానుల చిరకాల కోరిక అయిన తొలి ఐపీఎల్ ట్రోఫీని మాత్రం ఇంతవరకు గెలవలేకపోయింది ఆర్సీబీ. విరాట్ కోహ్లీ, డివిలియర్స్, క్రిస్ గేల్, డు ప్లెసిస్ లాంటి హేమాహేమీలు ఉన్నాగానీ ఒక్కటంటే ఒక్క ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడలేకపోయింది. దాంతో వచ్చే సీజన్ ట్రోఫీని దక్కించుకోవాలని ఇప్పటి నుంచే ప్రణాళికలను రచిస్తోంది రాయల్ ఛాలెంజర్స్ యాజమాన్యం.

ఈ ప్రణాళికలలో భాగంగానే ఓల్డ్ కోచింగ్ స్టాఫ్ మెంబర్స్ ను ఇంటికి సాగనంపేందుకు సిద్దమైందని వార్తలు వినిపిస్తున్నాయి. కోచింగ్ స్టాఫ్ మెంబర్ సంజయ్ బంగర్, టీమ్ డైరెక్టర్ మైక్ హెస్సెన్ లు 2018 సీజన్ నుంచి ఆర్సీబీకి సేవలు అందిస్తున్నారు. అయితే వారి సేవలకు ముగింపు పలకాలని భావిస్తోందట ఆర్సీబీ యాజమాన్యం. వీరి స్థానంలో కొత్తవారిని తీసుకునే యోచనలో ఫ్రాంచైజీ ఉందట. ఇక ఆర్సీబీ హెడ్ కోచ్ గా దక్షిణాఫ్రికా, ఆర్సీబీ మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ ను నియమించుకోవాలని భావిస్తోందట.

ఇందుకు సంబంధించి ప్రముఖ న్యూస్ ఛానల్ ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో ఓ కథనం వచ్చింది. ఈ మేరకు ఆర్సీబీ మేనేజ్ మెంట్ డివిలియర్స్ తో చర్చలు సాగిస్తున్నట్లు సమాచారం. ఇక త్వరలోనే ఈ వార్తపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. డివిలియర్స్ కు ఆర్సీబీ జట్టుతో మంచి అనుబంధం ఉండటంతో.. రాబోయే సీజన్ లో ఫలితం కనిపించొచ్చన్నది క్రీడా పండితుల విశ్లేషణ. మరి ఆర్సీబీ హెడ్ కోచ్ గా డివిలియర్స్ వస్తే.. ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: వీడియో: బ్రావో భారీ సిక్స్‌! స్టేడియం బయటికి బంతి