iDreamPost
android-app
ios-app

సంజయ్ బాంగర్​కు ఆర్సీబీ గుడ్ బై.. బెంగళూరు కొత్త హెడ్ కోచ్​ ఎవరంటే..?

  • Author singhj Published - 03:35 PM, Fri - 4 August 23
  • Author singhj Published - 03:35 PM, Fri - 4 August 23
సంజయ్ బాంగర్​కు ఆర్సీబీ గుడ్ బై.. బెంగళూరు కొత్త హెడ్ కోచ్​ ఎవరంటే..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో అత్యంత ప్రేక్షకాదరణ కలిగిన జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. టీమ్ నిండా స్టార్ ప్లేయర్లు ఉండటంతో ఆ ఫ్రాంచైజీకి భారీ ఫ్యాన్ బేస్ ఉంది. బెంగళూరు గెలిచినా, ఓడినా వెన్నంటే ఉండే అభిమానులు భారీ సంఖ్యలో ఉన్నారు. ఆర్​సీబీ మ్యాచ్ అంటే ఎక్కడైనా సరే.. స్టేడియం నిండిపోవాల్సిందే. వరల్డ్ టాప్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఈ జట్టులో ఉండటంతో ఆర్సీబీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక రేంజ్​లో ఉంది. అతడితో పాటు మరికొందరు స్టార్లు తమ అద్భుతమైన ఆటతీరుతో ఆర్​సీబీకి క్రేజ్ తీసుకొచ్చారు. అయితే కప్​ను అందించడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు.

ఇప్పటిదాకా జరిగిన ఐపీఎల్ పదహారు సీజన్లలో ఒక్కసారి కూడా ఆర్సీబీ ట్రోఫీని దక్కించుకోలేదు. 2009, 2011 సీజన్లలో మాత్రం రన్నరప్​గా నిలిచింది. ఈ ఏడాది ప్లేఆఫ్స్​కు చేరకుండానే నిష్క్రమించింది బెంగళూరు. ఈ నేపథ్యంలో ఐపీఎల్​-2024కు ముందు ఆర్సీబీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. తమ టీమ్ నూతన హెడ్​ కోచ్​గా జింబాబ్వే మాజీ కెప్టెన్ ఆండీ ఫ్లవర్​ను ఎంపిక చేసింది. ఇప్పటిదాకా హెడ్​ కోచ్​గా కొనసాగిన సంజయ్ బాంగర్ మీద బెంగళూరు వేటు వేసింది. అదే విధంగా తమ టీమ్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మైక్ హెస్సన్​కూ ఉద్వాసన పలికింది. కొత్త కోచ్ నియామకంపై ఆర్సీబీ ఓ ప్రకటన చేసింది.

ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్, టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్​కు కోచ్​గా పనిచేసిన ఆండీ ఫ్లవర్​ను తమ పురుషుల జట్టు ప్రధాన కోచ్​గా నియమించామని ట్విట్టర్​లో ఒక పోస్ట్ పెట్టింది ఆర్సీబీ. ఆండీ ఫ్లవర్ ఈ బాధ్యతలు స్వీకరించినందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. కాగా, జింబాబ్వే లెజెండరీ ప్లేయర్ అయిన ఆండీ ఫ్లవర్​కు దశాబ్దానికి పైగా కోచ్​గా పనిచేసిన అనుభవం ఉంది. ఇంటర్నేషనల్ క్రికెట్​తో పాటు ఫ్రాంచైజీ క్రికెట్​లోనూ అతడు కోచ్​గా సేవలను అందించడం విశేషం. 2010లో టీ20 వరల్డ్ కప్​ నెగ్గిన ఇంగ్లండ్​ టీమ్​కు కోచ్​గా ప్లవర్​ పనిచేశాడు. ఐపీఎల్​లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు గత రెండు సీజన్లుగా హెడ్​ కోచ్​గా ఆండీ పనిచేశాడు. అయితే నెక్స్ట్ సీజన్​కు ముందు అతడ్ని లక్నో విడుదల చేయడంతో ఆర్సీబీ గూటికి చేరాడు.