Nidhan
Shoaib Akhtar-Brett Lee: అందర్నీ భయపెట్టే ఆస్ట్రేలియాను ఆ రాక్షసుడు వణికించాడు. బ్రెట్‌లీ సవాల్‌ను స్వీకరించి కంగారూలను ఓ ఆటాడుకున్నాడు. ఇది జరిగి 22 ఏళ్లు అవుతోంది.
Shoaib Akhtar-Brett Lee: అందర్నీ భయపెట్టే ఆస్ట్రేలియాను ఆ రాక్షసుడు వణికించాడు. బ్రెట్‌లీ సవాల్‌ను స్వీకరించి కంగారూలను ఓ ఆటాడుకున్నాడు. ఇది జరిగి 22 ఏళ్లు అవుతోంది.
Nidhan
క్రికెట్లో వెస్టిండీస్ శకం ముగిశాక ఆస్ట్రేలియా హవా మొదలైంది. 1990వ దశకం చివరి నుంచి 2010 వరకు ఆ టీమ్ వరల్డ్ క్రికెట్‌ను శాసించింది. కంగారూలు అంటే అందరూ భయపడుతున్న రోజులవి. ఆస్ట్రేలియా ప్లేయర్లను చూస్తేనే అవతలి జట్లు గడగడలాడేవి. జస్టిన్ లాంగర్, మాథ్యూ హేడెన్, రికీ పాంటింగ్, మార్క్ వా, స్టీవ్ వా, డామియన్ మార్టిన్, ఆడమ్ గిల్‌క్రిస్ట్.. ఇలా ఒకర్ని మించిన ఒకరు అరివీర భయంకర బ్యాటర్లతో ఆ టీమ్ డేంజరస్‌గా ఉండేది. వీళ్లకు తోడు బౌలింగ్ యూనిట్ కూడా అంతే దుర్భేద్యంగా ఉండేది. గ్లెన్ మెక్‌గ్రాత్, జేసన్ గిలెస్పీ, బ్రెట్‌లీ, షేన్ వార్న్‌తో కూడిన బౌలింగ్ దళం ప్రత్యర్థి జట్లతో చెడుగుడు ఆడుకునేది. ఇలా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ బలంతో ఏళ్ల పాటు వరల్డ్ క్రికెట్‌పై పెత్తనం చలాయించింది ఆసీస్. అలాంటి టీమ్‌ను ఓ రాక్షసుడు భయపెట్టాడు.
వరుస విజయాలు, ట్రోఫీలు సాధించామనే గర్వంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు అవతలి జట్లను పట్టించుకునేవారు కాదు. ప్రత్యర్థి ఆటగాళ్లను తిడుతూ, ట్రోల్ చేస్తూ రెచ్చగొట్టేవారు. దీని వల్ల అపోజిషన్ ప్లేయర్లు కాన్సంట్రేషన్ కోల్పోయి ఔట్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ ఎత్తుగడను పాకిస్థాన్ లెజెండరీ పేసర్ షోయబ్ అక్తర్ తుత్తునియలు చేశాడు. 2002లో కొలంబో వేదికగా ఆసీస్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో అక్తర్‌ను బ్రెట్‌లీ రెచ్చగొట్టాడు. పాక్ ఇన్నింగ్స్ టైమ్‌లో అతడు విసిరిన ఓ బౌన్సర్ అక్తర్ హెల్మెట్‌కు తగిలి బౌండరీకి వెళ్లింది. దీంతో అక్తర్ దగ్గరకు వచ్చిన బ్రెట్‌లీ దమ్ముంటే కొట్టి చూపించమంటూ సవాల్ విసిరాడు. ఆ ఛాలెంజ్‌ను స్వీకరించిన అక్తర్.. బౌలింగ్ సమయంలో దుమ్మురేపాడు.
బ్రెట్‌లీ గెలకడంతో అక్తర్ తనలోని రాక్షసుడ్ని బయటకు తీసుకొచ్చాడు. రెచ్చిపోయి బౌలింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. రికీ పాంటింగ్, మార్క్ వా, స్టీవ్ వా సహా గిల్‌క్రిస్ట్, షేన్‌వార్న్‌ను ఔట్ చేశాడు అక్తర్. పాంటింగ్, మార్క్‌వా, గిల్‌క్రిస్ట్‌ను అతడు క్లీన్ బౌల్డ్ చేశాడు. గంటకు 150 కిలోమీటర్ల స్పీడ్‌కు తగ్గకుండా బౌలింగ్ చేస్తూ ఆసీస్ బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించాడు. భీకర వేగంతో పాటు గాల్లోనే బంతిని స్వింగ్ చేస్తూ కంగారూలతో ఓ ఆటాడుకున్నాడు.
అక్తర్ దెబ్బకు బాల్‌ను టచ్ చేయాలన్నా వాళ్లు భయపడ్డారు. తనకు సవాల్ విసిరిన బ్రెట్‌లీ బ్యాటింగ్‌కు రాగానే అతడికి బుల్లెట్ స్పీడ్‌తో ఓ ఫుల్‌టాస్ విసిరాడు. అది కాస్తా వెళ్లి అతడి తొడ మీద బలంగా తాకింది. దీంతో నొప్పితో అతడు విలవిల్లాడాడు. ఆ ఇన్నింగ్స్‌లో 8 ఓవర్లలో 5 వికెట్లు తీసి ఆస్ట్రేలియాను ఊపిరాడకుండా చేశాడు అక్తర్. అతడి దెబ్బకు 61-1తో ఉన్న టీమ్ కాస్తా 127కు కుప్పకూలింది. అయితే బ్యాటర్లు విఫలమవడంతో ఆ మ్యాచ్‌లో పాక్ 41 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అందర్నీ భయపెట్టే ఆసీస్‌ను ఆ రోజు అక్తర్ వణికించిన తీరు క్రికెట్ హిస్టరీలో స్పెషల్‌గా ఎప్పటికీ గుర్తుండిపోతుందనే చెప్పాలి.