క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వన్డే వరల్డ్ కప్ వచ్చేసింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో ఆడేందుకు ఒక్కొక్కటిగా అన్ని టీమ్స్ ఇండియాకు చేరుకున్నాయి. ఇప్పటికే పలు టీమ్స్ ప్రాక్టీస్ మ్యాచులు కూడా ఆడేశాయి. ఈసారి కప్పుపై చాలా జట్లు కన్నేశాయి. వాటిలో ఒకటి ఇంగ్లండ్. ప్రపంచ కప్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న వాటిల్లో ఇంగ్లీష్ టీమ్ కూడా ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బట్లర్ సేన బరిలోకి దిగనుంది. 2019లో జరిగిన ప్రపంచ కప్‌ను ఇంగ్లండ్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా కప్పు తమదేనంటున్న ఆ టీమ్ బలాలు, బలహీనతలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
క్రికెట్‌కు పుట్టినిల్లుగా ఇంగ్లండ్‌ను చెప్పుకుంటారు. ప్రపంచానికి జెంటిల్మన్ గేమ్‌ను పరిచయం చేసిందే తామని గొప్పలకు పోతారు. ఎంతో మంది లెజెండరీ ప్లేయర్లను తాము అందించామని, చాలా రికార్డులు తమ పేరు పైనే ఉన్నాయని అంటారు. కానీ 2019 వరకు ఇంగ్లండ్ ఒక్కసారి కూడా వరల్డ్ కప్‌ను అందుకోలేదు. 1979, 1987, 1992 వరల్డ్ కప్స్‌లో ఫైనల్స్‌కు చేరుకుంది ఇంగ్లీష్ టీమ్. అయినా ఆ మూడు సార్లూ ఓడిపోయారు. ఆ తర్వాత 1996 నుంచి 2015 వరకు కనీసం సెమీస్‌కు కూడా చేరుకోలేకపోయారు. కానీ ఐర్లాండ్‌కు చెందిన ఇయాన్ మోర్గాన్ ఎప్పుడైతే ఇంగ్లండ్ టీమ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడో అప్పటి నుంచి ఆ జట్టు రాతే మారిపోయింది.
ఇంగ్లీష్ టీమ్‌కు దూకుడుగా ఆడటం అలవాటు చేశాడు మోర్గాన్. ఇంగ్లండ్ క్రికెట్ డీఎన్ఏ, తలరాతను అతడు మార్చేశాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతవరకు సంప్రదాయబద్ధంగా ఆడుతూ వచ్చిన ఆ జట్టుకు అగ్రెసివ్‌గా బ్యాటింగ్ చేయడం నేర్పాడు మోర్గాన్. ఎవరు ఎప్పుడు బౌలింగ్ చేయాలి, ఎప్పుడు బ్యాటింగ్ చేయాలనే దానిపై ప్లేయర్లకు రోల్ క్లారిటీ ఇచ్చాడు. ఈ రకంగా మోర్గాన్ తీసుకొచ్చిన మార్పులు బాగా పనిచేశాయి. 2015 వరల్డ్ కప్‌లో చెత్త పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ఇంగ్లండ్.. 2019కి వచ్చేసరికి ఏకంగా కప్పును ఎగరేసుకుపోయింది.
ఈ వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ జట్టు కూర్పు చాలా బాగుంది. ఆ టీమ్ ప్లేయర్ల లిస్ట్ విషయానికొస్తే.. జాస్ బట్లర్ కెప్టెన్‌గా ముందుండి నడపనున్నాడు. జానీ బెయిర్‌స్టో రూపంలో మరో కీపర్/బ్యాటర్ అందుబాటులో ఉన్నాడు. డేవిడ్ మలాన్, జో రూట్, హ్యారీ బ్రూక్‌లు స్పెషలిస్ట్ బ్యాటర్లని చెప్పొచ్చు. ఆదిల్ రషీద్ రూపంలో స్పెషలిస్ట్ స్పిన్నర్ ఉండగా.. మెయిన్ అలీ, లియామ్ లివింగ్స్టన్ స్పిన్ ఆల్‌రౌండర్ల పాత్ర పోషిస్తారు. మార్క్ వుడ్, గస్ అట్కిన్సన్, రీస్ టోప్లేలు ప్రధాన పేసర్లు కాగా.. సీమ్ ఆల్రౌండర్లుగా బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్, సామ్ కర్రన్, డేవిడ్ విల్లీలు అందుబాటులో ఉన్నారు.
ఇంగ్లండ్ జట్టు అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోంది. ఆ టీమ్‌లో సామ్ కర్రన్, రీస్ టాప్లీ, డేవిడ్ విల్లీ రూపంలో ముగ్గురు నిఖార్సయిన లెఫ్టార్మ్ పేసర్లు ఉన్నారు. కొత్త కుర్రాడు, మంచి పొడగరి అయిన గస్ అట్కిన్సన్ కూడా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను వణికించేందుకు రెడీ అవుతున్నాడు. ఎక్స్పీరియన్స్ కలిగిన బట్లర్, బెయిర్‌స్టో, రూట్ లాంటి బ్యాటర్లు ఉండటం ఇంగ్లీష్ టీమ్‌కు ప్లస్ పాయింట్. అలాగే బౌలింగ్, బ్యాటింగ్ చేయగల ఆల్‌రౌండర్లు ఎక్కువ మంది ఉండటం మరో స్ట్రెంగ్త్ అని చెప్పాలి.
టీమ్‌లో ఉన్న వారిలో ఆరు నుంచి ఏడు మంది బౌలింగ్ చేయగలగడం, తొమ్మిదో నంబర్ వరకు బలమైన బ్యాటర్లు అందుబాటులో ఉండటం ఇంగ్లండ్ బలమనే చెప్పాలి. బౌలింగ్, బ్యాటింగ్‌లో డెప్త్ ఉంది కాబట్టే ఆ జట్టు ఇంత అగ్రెసివ్‌గా క్రికెట్ ఆడుతోంది. ఈ టీమ్‌లో ఉన్న చాలా మంది ప్లేయర్లకు ఐపీఎల్లో ఆడిన అనుభవం ఉంది. అది కూడా వారికి కలిసొచ్చే అంశమే. ఇంగ్లీష్ టీమ్‌లో మ్యాచ్ విన్నర్లకు కొదవలేదు. బెన్ స్టోక్స్, బెయిర్‌స్టో, బట్లర్లు తమదైన రోజున మ్యాచ్‌ను వన్‌సైడ్ చేసేస్తారు. మెయిన్ అలీ, సామ్ కర్రన్లు కూడా తమ ఆల్‌రౌండ్ ఎబిలిటీస్‌తో మ్యాచ్‌ను తారుమారు చేయగల సత్తా ఉన్నవారే. ఇన్ని బలాలు ఉన్నాయి కాబట్టే ఈ వరల్డ్ కప్‌లో టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఇంగ్లండ్ బరిలోకి దిగుతోంది.
భారత గడ్డపై ఆడిన ఎక్స్‌పీరియెన్స్ ఉన్న ప్లేయర్లు ఇంగ్లండ్ టీమ్‌లో చాలా మందే ఉన్నారు. కానీ వారిలో ఒకరిద్దరు తప్పితే ఎవరూ అంతగా రాణించలేదు. హ్యారీ బ్రూక్, డేవిడ్ మలాన్, లియామ్ లివింగ్‌స్టన్‌లు ఇండియన్ పిచ్‌లపై ఐపీఎల్లో దారుణంగా ఫ్లాప్ అయ్యారు. వీళ్లు మిగతా దేశాల్లో ఆడినట్లుగా ఇక్కడ తమ బ్యాట్లతో సత్తా చాటలేకపోయారు. ఐపీఎల్-2017లో ఎంట్రీ ఇచ్చిన స్టోక్స్ కూడా ఆ ఒక్క సీజన్లోనే దుమ్మురేపాడు. ఆ ఏడాది ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన ఈ ఇంగ్లీష్ ఆల్‌రౌండర్.. ఆ తర్వాతి సీజన్లలో మాత్రం అంత స్థాయిలో ఆడలేకపోయాడు. కానీ భారత గడ్డపై వన్డేల్లో ఓవరాల్‌గా అతడి పెర్ఫార్మెన్స్ మాత్రం బాగానే ఉంది. ఈసారి అతడు ఎలా ఆడతాడో చూడాలి. భారత్ ఆతిథ్యం ఇస్తున్న వరల్డ్ కప్‌లో సెకండాఫ్‌లో పిచ్‌లో నెమ్మదిస్తాయి.
స్లో డౌన్ అయిన పిచ్‌ల మీద ఇంగ్లీష్ ప్లేయర్లు ఎంత మేర రాణిస్తారనేది సందేహమే. బ్యాట్ పైకి బాల్ వస్తే ఆడేందుకు మొగ్గుచూపే ఇంగ్లండ్ బ్యాటర్లు.. స్లో పిచ్‌ల మీద తక్కువ ఎత్తులో వచ్చే బంతులను ఎదుర్కొని క్రీజులో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. ఇంకో విషయం స్పిన్‌కు సహకరించే భారత్ పిచ్‌లపై వారికి ఆదిల్ రషీద్ రూపంలో ఒక్క స్పెషలిస్ట్ స్పిన్నర్ మాత్రమే అందుబాటులో ఉన్నాడు. ఐపీఎల్లో గానీ భారత్‌లో జరిగే ఇంటర్నేషనల్ మ్యాచుల్లో గానీ అతడు అంతగా రాణించలేదు. ఆ టీమ్‌లో లెఫ్టార్మ్ స్పిన్నర్ కూడా లేడు. ఇంగ్లండ్ మరో బలహీనతగా ఫైనల్ ఫోబియా అని చెప్పొచ్చు. వరుసగా మూడు వరల్డ్ కప్ ఫైనల్స్‌లో ఓడిన ఈ టీమ్.. 2019లో కూడా పడుతూ లేస్తూ ఆఖరికి సూపర్ ఓవర్‌కు వెళ్లడం.. ఆ తర్వాత బౌండరీల కౌంట్ ద్వారా ఛాంపియన్‌గా అవతరించింది. 2016 టీ20 ప్రపంచ కప్‌లోనూ ఫైనల్స్‌లో గెలిచే స్థితిలో ఉండి ఓడిపోయింది.
ఇంగ్లండ్ అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తున్నా గాయాల బెడద ఆ జట్టును ఇబ్బంది పెడుతోంది. అనేక సార్లు గాయపడిన బెన్ స్టోక్స్, మార్క్ వుడ్ లాంటి ప్లేయర్లకు గనుక ఇంజ్యురీ అయితే ఆ టీమ్ బ్యాలెన్స్ పూర్తిగా దెబ్బతింటుంది. బెయిర్‌స్టో గాయం నుంచి కోలుకొని కమ్‌బ్యాక్ ఇస్తున్నాడు. అతడు ఎలా ఆడతాడో చూడాలి. ఇంగ్లీష్ టీమ్‌ను భయపెడుతున్న మరో విషయం కెప్టెన్ బట్లర్ ఫామ్. భారత గడ్డ మీద బట్లర్‌కు మంచి రికార్డు లేదు. ఇక్కడ ఆడిన వన్డేల్లో అతడి యావరేజ్ 11గా ఉంది. ఈసారైనా భారత పిచ్‌లకు తగ్గట్లు తన బ్యాటింగ్‌ను అడ్జస్ట్ చేసుకుంటాడేమో చూడాలి. గత రికార్డులు, బలాలు, బలహీనతల్ని పరిగణనలోకి తీసుకుంటే ఇంగ్లండ్ సెమీస్‌కు వెళ్లే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. ఆ జట్టు ప్రస్తుత ఫామ్‌ను చూసుకుంటే రెండో సారి కప్ ఎగరేసుకుపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి.. ఈసారి వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ ఎంత వరకు వెళ్లగలుగుతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికా బలాలు, బలహీనతలు ఇవే..!