iDreamPost

వరల్డ్ కప్‌లో సౌత్‌ ఆఫ్రికా బలాలు, బలహీనతలు! తొలి కప్ గెలిచే ఛాన్స్? 

  • Author Soma Sekhar Published - 11:40 AM, Mon - 2 October 23
  • Author Soma Sekhar Published - 11:40 AM, Mon - 2 October 23
వరల్డ్ కప్‌లో సౌత్‌ ఆఫ్రికా బలాలు, బలహీనతలు! తొలి కప్ గెలిచే ఛాన్స్? 

క్రికెట్ ఆడే ప్రతీ జట్టు కల ఒక్కటే.. వరల్డ్ కప్ గెలవడం. తమ కల కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నాయి కొన్ని జట్లు. కానీ అది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. అలాంటి జట్లలో సౌతాఫ్రికా ఒకటి. జట్టు నిండా స్టార్లు, నిప్పులు చెరిగే బౌలర్లు, సునామీ ఇన్నింగ్స్ లతో బెంబేలెత్తించే బ్యాటర్లు, కళ్లు చెదిరే ఫీల్డర్లు ఉన్నా.. ఆ జట్టు మాత్రం ఇప్పటి వరకు ప్రపంచ కప్ ను ముద్దాడలేదు. ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న సఫారి టీమ్ ఈ సారైనా వరల్డ్ కప్ కు చేజిక్కించుకుంటుందా? ఈ ప్రపంచ కప్ లో సౌతాఫ్రికా బలాలు, బలహీనతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ప్రపంచ కప్ లో బ్యాడ్ లక్ కు బ్రాండ్ అంబాసిడర్ అంటే అందరూ సౌతాఫ్రికా అనే చెబుతారు. కర్ణుడి చావుకు లక్ష కారణాలు అన్నట్లుగా సఫారి టీమ్ వరల్డ్ కప్ ను గెలవలేకపోయింది అనడానికి కూడా అన్నే కారణాలు ఉన్నాయి. సౌతాఫ్రికా టీమ్ గ్రూప్ మ్యాచ్ ల్లో అద్బుతంగా రాణించి.. కీలక నాకౌట్ మ్యాచ్ ల్లో అదృష్టం కలిసిరాక ఇంటిదారి పట్టిన సంఘటనలున మనం చాలానే చూశాం. అయితే ఈసారి వైఫల్యాలను అధిగమించి తొలి వరల్డ్ కప్ ను ముద్దాడాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది ప్రోటీస్ టీమ్. అయితే ఆ జట్టును గాయల బెడద వేధిస్తోంది. మెగాటోర్నీ ప్రారంభానికి ముందే.. గాయాల కారణంగా స్టార్ ప్లేయర్లు దూరం కావడం ఆ జట్టుకు పెద్ద దెబ్బ. కాగా.. సౌతాఫ్రికా టీమ్ ప్రస్తుతం భీకర ఫామ్ లో ఉంది. ఇటీవలే ఆస్ట్రేలియా టీమ్ ను వన్డే సిరీస్ లో ఉతికారేసింది. జట్టులో భీకర హిట్టర్లతో పాటుగా.. సమయోచిత ఇన్నింగ్స్ ఆడగలిగే సత్తా ఉన్న బ్యాటర్లు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా బలాలు, బలహీనతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సౌతాఫ్రికా టీమ్ బలాలు

వరల్డ్ కప్ లో పాల్గొనబోయే సౌతాఫ్రికా టీమ్ సమష్టిగా కనిపిస్తోంది. సఫారి సారథి టెంబా బవుమాతో పాటుగా క్వింటన్ డికాక్, హెండ్రిక్స్, క్లాసెన్, మార్క్రమ్, మిల్లర్, వాండర్ డస్సెన్ లతో బ్యాటింగ్ భీకరంగా కనిపిస్తుండగా.. బౌలింగ్ కూడా మెరుపులాంటి ఆటగాళ్లను కలిగిఉంది. ఆల్ రౌండర్ మార్కో జన్సెన్, కేశవ్ మహరాజ్, లుంగీ ఎంగిడి, రబాడ, తబ్రైజ్ షంషీ లతో బౌలింగ్ విభాగం కూడా బలంగా కనిపిస్తోంది. కాగా.. మ్యాచ్ స్వరూపాన్ని ఒంటి చేత్తో మార్చేయగల ఆటగాళ్లు సఫారి జట్టులో ఉండటం అదనపు బలం. మిల్లర్, మార్క్రమ్, క్లాసెన్ లాంటి మెరుపు బ్యాటర్లు జట్టులో ఉన్నారు. అదీకాక సౌతాఫ్రికా జట్టులో చాలామంది ఆటగాళ్లకు ఇండియాలో ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది. ఇక్కడి పిచ్ లు, వాతావరణం వారికి అనుభవమే. ప్రస్తుతం సఫారి జట్టు అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తోంది. దీంతో అన్ని జట్లను మట్టికరిపించి తొలిసారి వరల్డ్ కప్ ముద్దాడాలని భావిస్తోంది.

దక్షిణాఫ్రికా బలహీనతలు

దక్షిణాఫ్రికా బలహీనతల్లో ముఖ్యమైనది.. గ్రూప్ మ్యాచ్ ల్లో రాణించి, నాకౌట్ దశకు వచ్చేసరికి ఒక్కసారిగా చేతులెత్తేయడం. గత కొన్ని వరల్డ్ కప్ ల నుంచి చూసుకుంటే ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది ప్రోటీస్ జట్టు. ఇక సౌతాఫ్రికాకు వరుణుడు కూడా ఓ బలహీనతనే చెప్పాలి. ప్రపంచ కప్ చాలా మ్యాచ్ ల్లో వరుణుడు విజయావకాశాలను దెబ్బతీశాడు. ఇక ప్లేయర్ల విషయానికి వస్తే.. వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే స్టార్ బౌలర్లు అయిన సిసిండ మగల, ఎన్రిచ్ నోర్ట్జే లు గాయం కారణంగా టోర్నీకి దూరం అయ్యారు. దీంతో బౌలింగ్ దళం వీక్ గా మారింది. ఇక డీకాక్ ఫామ్ కాస్త ఆందోళన కరంగానే ఉందని చెప్పాలి. ఓపెనర్ గెరాల్డ్ కోట్జీ ఆశించిన స్థాయిలో రాణించలేక జట్టుకు భారంగా మారాడు. రబాడా, ఎంగిడిలు తమ పేస్ కు ఇంకాస్త పదునుపెట్టాలి. అప్పుడే సౌతాఫ్రికా వరల్డ్ కప్ లో ప్రత్యర్థి జట్లను మట్టికరిపించగలదు. సఫారి నయా సంచలనాలు డెవాల్ట్ బ్రూయిస్, ట్రిస్టన్ స్టబ్స్ కు ఛాన్స్ లు ఇస్తే బాగుండేదని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. ఎడమ చేతి వాటం పేసర్ వేన్ పార్నెల్ ను జట్టులోకి తీసుకోకపోవడం ప్రోటీస్ టీమ్ కు పెద్ద దెబ్బనే చెప్పాలి. అయితే గాయం కారణంగా ఇద్దరు ప్లేయర్లు దూరం కావడంతో.. వారి స్థానంలో ఇతడికి అవకాశం దక్కొచ్చు. మరి భీకర ఫామ్ లో ఉన్న సౌతాఫ్రికా జట్టు తొలి వరల్డ్ కప్ ను ముద్దాడుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి