టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పి చాలా కాలమే అయింది. అయితే జాతీయ జట్టుకు ఆడకపోయినా అతడికి ఉన్న క్రేజ్ ఇసుమంత కూడా తగ్గకపోవడం గమనార్హం. ఇప్పుడు భారత జట్టు తరఫున ఆడుతున్న బడా స్టార్ క్రికెటర్లకు ఉండే క్రేజ్, పాపులారిటీ ధోనీకి కూడా ఉన్నాయి. టీమిండియాకు ఆడకపోయినా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాడు ధోని. ఈ ఏడాది ఆ టీమ్‌కు మరో టైటిల్ అందించాడతను. పెద్దగా స్టార్లు ఎవరూ లేకపోయినా సీఎస్కేకు కప్ అందించాడు. అనుభవజ్ఞులు, యువకులతో కూడిన జట్టును చక్కగా నడిపించాడు.
ఐపీఎల్ పదహారో సీజన్ తొలి అంచెలో చెన్నై జట్టు అంతగా రాణించలేదు. వరుస ఓటములతో ఆ టీమ్ డీలాపడింది. కానీ సీనియర్లతో పాటు యువ క్రికెటర్లలో జోష్ నింపిన ధోని.. వారిలో ఉన్న టాలెంట్‌ను పరిస్థితులకు తగ్గట్లు వాడుకోవడంలో సక్సెస్ అయ్యాడు. దీంతో సీఎస్కేకు ఎదురు లేకుండా పోయింది. టోర్నీ ఫైనల్ ఫైట్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి కప్ ఎగరేసుకుపోయింది చెన్నై. వయసు మీద పడుతున్నా, ఇంజ్యురీలతో బాడీ అంతగా సహకరించకున్నా ధోని మాత్రం పట్టువీడలేదు. తాను అనుకున్నది అతడు సాధించాడు. చెన్నై ఒడిలో మరో కప్ ఒరిగేలా చేశాడు. అయితే వచ్చే ఐపీఎల్లో ధోని ఆడతాడా లేదా అనేది ఇంట్రెస్టింగ్గా మారింది.
మోకాలి గాయం నుంచి కోలుకుని ఫిట్‌గా ఉంటే ధోని మరో ఐపీఎల్ సీజన్ ఆడటం ఖాయమని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా.. ఎంఎస్ ధోని తనది మంచి మనసు అని మరోమారు చాటుకున్నాడు. సొంత విల్లా గేటు దగ్గర పనిచేసే సెక్యూరిటీ గార్డు తన డ్యూటీ కోసం వస్తుండగా.. ఆయన్ను ధోని చూశాడు. ఆ విల్లా నుంచి గేటు చాలా దూరం ఉండటంతో.. ధోని తన బైకుపై సెక్యూరిటీ గార్డును కూర్చోబెట్టుకొని గేటు వద్ద వదిలిపెట్టాడు. అదే టైమ్‌లో విల్లా గేటు వద్ద టీమిండియా మాజీ సారథిని చూసేందుకు ఎదురు చూస్తున్న అభిమానులు ఈ ఘటనను తమ ఫోన్లలో రికార్డు చేశారు. సెక్యూరిటీ గార్డును దించాక ఫ్యాన్స్‌కు హలో చెప్పి ధోని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సెక్యూరిటీ గార్డుకు మాహీ లిఫ్ట్ ఇచ్చిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ధోనీది ఎంత మంచి మనసు అని ఫ్యాన్స్ అతడ్ని మెచ్చుకుంటున్నారు.
Dhoni dropping his security in gate
😍🤌❤️@MSDhoni #MSDhoni #WhistlePodu pic.twitter.com/vhVMKqn49w— DHONI Era™ 🤩 (@TheDhoniEra) July 2, 2023