iDreamPost
android-app
ios-app

VIDEO: జైస్వాల్‌-రుతురాజ్‌ తత్తరపాటు! వీళ్లను మించిపోయిన ఐర్లాండ్‌ ఆటగాళ్లు

  • Published Aug 19, 2023 | 9:20 AM Updated Updated Aug 19, 2023 | 9:20 AM
  • Published Aug 19, 2023 | 9:20 AMUpdated Aug 19, 2023 | 9:20 AM
VIDEO: జైస్వాల్‌-రుతురాజ్‌ తత్తరపాటు! వీళ్లను మించిపోయిన ఐర్లాండ్‌ ఆటగాళ్లు

పసికూన ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో విజయం సాధించింది. జస్ప్రీత్‌ బుమ్రా కెప్టెన్సీలో బరిలోకి దిగిన యువ టీమిండియా.. మంచి ప్రదర్శననే కనబర్చింది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. యువ ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌-రుతురాజ్‌ గైక్వాడ్‌ భారత ఇన్నింగ్స్‌ ఆరంభించారు. అయితే.. ఈ యువ ఓపెనర్ల మధ్య కాస్త సమన్వయం లొపించింది. దీంతో.. ఇద్దరూ ఒకే ఎండ్‌లోకి వచ్చేశారు. వీళ్ల తత్తరపాటుకే క్రికెట్‌ అభిమానులు షాకైతే.. వీళ్లకంటే మించిపోయారు ఐర్లాండ్‌ ఆటగాళ్లు.. ఇద్దరు బ్యాటర్లు ఒకే ఎండ్‌లో ఉన్నా.. బాల్‌ ఫీల్డర్‌ చేతిలో థర్టీయార్డ్‌ సర్కిల్‌లో ఉన్నా కూడా అవుట్‌ చేయలేకపోయారు. వినేందుకు నమ్మశక్యంగా లేకపోయినా.. ఇది నిజం.

టీమిండియా ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లోనే ఈ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. జోషువా లిటిల్‌ వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ మూడో బంతి.. జైస్వాల్‌ థైప్యాడ్‌కు తాకి షార్ట్‌ ఫైన్‌లెగ్‌ వైపు వెళ్లింది. దాంతో.. నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న రుతురాజ్‌ పరుగు కోసం కాల్‌ ఇచ్చాడు. వెంటనే జైస్వాల్‌ పరుగు అందుకున్నాడు. కానీ, బాల్‌ ఫీల్డర్‌ చేతుల్లోకి వెళ్లడం చూసిన రుతురాజ్‌ వెనక్కి వెళ్లిపోయాడు. కానీ జైస్వాల్‌ మాత్రం అప్పటికే పరుగులు పూర్తి చేసి.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌కు వచ్చేశాడు. దీంతో ఇద్దరు బ్యాటర్లు నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లోనే ఉన్నారు. బౌలర్‌ ఎండ్‌ వికెట్ల దగ్గర ఎవరూ లేకపోవడంతో రనౌట్‌ మిస్‌ అయింది. దీంతో రుతురాజ్‌ మళ్లీ పరిగెత్తి.. స్టైకింగ్‌ ఎండ్‌ వైపు డైవ్‌ చేస్తూ.. రన్‌ పూర్తి చేశాడు. అప్పటికీ రుతురాజ్‌ను అవుట్‌ చేసే ఛాన్స్‌ ఉన్నా.. ఐర్లాండ్‌ ఆటగాళ్లు అవుట్‌ చేయడంలో విఫలం అయ్యారు. ఈ సంఘటనతో గ్రౌండ్‌లో నవ్వులు పూసాయి. అప్పటికీ రుతురాజ్‌ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఉన్నాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌ 31 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినా.. కర్టిస్ కాంఫర్(39), బారీ మెక్‌కార్టీ(51) పోరాటంతో గౌరవప్రదమైన స్కోర్‌ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసి.. టీమిండియాకు ఫైటింగ్‌ టార్గెట్ ఇచ్చింది. భారత బౌలర్లలో కెప్టెన్‌ బుమ్రా, డెబ్యూ బౌలర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ, రవి బిష్ణోయ్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. అర్షదీప్‌ సింగ్ ఒక వికెట్‌ తీసుకున్నాడు. ఇక 140 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు జైస్వాల్‌-రుతురాజ్‌ మంచి స్టార్ట్‌ ఇచ్చారు. తొలి వికెట్‌కు 46 పరుగులు జోడించిన తర్వాత.. జైస్వాల్‌(23 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 24 రన్స్‌) అవుట్‌ అయ్యాడు.

జైస్వాల్‌ అవుట్‌ నెక్ట్స్‌ బాల్‌కే వన్‌డౌన్‌లో వచ్చిన తెలుగుతేజం తిలక్‌ వర్మ వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన సంజు శాంసన్‌ ఒక బాల్‌కు ఒక పరుగులు చేసిన తర్వాత వర్షం రావడంతో మ్యాచ్‌ను నిపిలివేశారు. వర్షం ఆగకపోవడంతో డక్త్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో విజేతను ప్రకటించారు. వర్షంతో మ్యాచ్‌ ఆడే సమయానికి టీమిండియా అవసరమైన రన్‌రేట్‌కు 2 రన్స్‌ అదనంగా చేయడంతో భారత్‌ను విజేతగా ప్రకటించారు. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్రదర్శనతో పాటు యువ ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌-రుతురాజ్‌ గైక్వాడ్‌ తత్తరపాటుకు గురవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: కొద్దిలో బతికిపోయిన బుమ్రా! లేదంటే.. మళ్లీ ఆస్పతి పాలయ్యేవాడు!