iDreamPost
iDreamPost
దేనికైనా రాసిపెట్టుండాలి. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ. హైవోల్టేజ్ డ్రామ్. ఇంకొక్క సిక్సర్ కొడితే…గెలుపే. పంజాబ్ కింగ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్…గెలవాలంటే సిక్స్ కొట్టాల్సిన పరిస్థితి. ఎక్కువసార్లు లాస్ట్ బాల్ సిక్స్ ను కొట్టలేక ఓడిపోతారు. కాని, ఒత్తిడిని అధిగమించి తమ జట్టును గెలిపించాడు రాహుల్ తెవాటియా. గుజరాత్ టైటాన్స్‌కు హ్యాట్రిక్ విన్ ఇచ్చాడు.
ఈ సూపర్ ఇన్నింగ్స్‌తో తెవాటియా, చెన్నై సూపర్‌కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సరసన చేరాడు. ఐపీఎల్ మ్యాచ్‌లో విజయానికి 2 బంతుల్లో 12 పరుగులు అవసరమైన దశలో రెండు వరుస సిక్స్‌లతో టీమ్‌ను గెలిపించిన రెండో ప్లేయర్ తెవాటియా. 2016 ఐపీఎల్ లో పంజాబ్ మ్యాచ్‌లో, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ధోని పుణే సూపర్ జెయింట్స్ తరపున రెండు సిక్స్ లు బాదాడు. ఓడిపోయిందనుకున్న జట్టుకు గెలుపునిచ్చాడు. సూపర్ ధోనీ అనిపించాడు.
పంజాబ్‌తో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో ఓడియన్ స్మిత్ మర్చిపోలేని చేదు అనుభవాన్ని, తెవాటియా మిగిల్చాడు. మూడు బంతులు ఆడాడు. 2 సిక్సర్లతో 13 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు.
అంతకుముందు బౌలర్లను చితక్కొట్టిన ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (59 బంతుల్లో 96 పరుగులు, 11 ఫోర్లు, సిక్స్) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.