వన్డే వరల్డ్ కప్-2023లో టీమిండియా జైత్రయాత్ర కంటిన్యూ అవుతోంది. తొలి మ్యాచ్‌లో ఫేవరెట్స్‌లో ఒకటైన ఆస్ట్రేలియా ఓడించిన భారత్.. రెండో మ్యాచ్‌లో పసికూన ఆఫ్ఘానిస్థాన్‌ను చిత్తు చేసింది. మూడో మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌పై భారీ విజయాన్ని నమోదు చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. మొదట బాల్‌తో అదరగొట్టి పాక్‌ను 191 రన్స్‌కే కట్టడి చేసిన టీమిండియా.. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ అదే జోరును కొనసాగించింది. టార్గెట్‌ను కేవలం 30.3 ఓవర్లలోనే ఉఫ్‌మని ఊదేసి ప్రపంచ కప్‌లో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది.
ముచ్చటగా మూడో విజయంతో వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌పై 8-0 తేడాతో అజేయ రికార్డును పదిలం చేసుకుంది భారత్. ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో శకతం బాదిన రోహిత్ శర్మ.. పాక్‌పై మ్యాచ్‌లోనూ చెలరేగాడు. 63 బంతుల్లోనే అరడజను ఫోర్లు, అరడజను సిక్సుల సాయంతో 86 రన్స్ చేసి టీమ్ భారీ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ చాలా రికార్డులు బ్రేక్ చేశాడు. తాను సరిగ్గా ఆడితే రికార్డులకు మూడినట్లేనని మరోమారు ప్రూవ్ చేశాడు. మొత్తంగా పాక్‌తో మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ద్వారా హిట్‌మ్యాన్ ఐదు రికార్డులను బ్రేక్ చేశాడు. పాకిస్థాన్‌పై ఆరు సిక్సులు బాదిన రోహిత్ అరుదైన ఘనత సాధించాడు. వన్డే క్రికెట్లో 300 సిక్సుల క్లబ్లో చేరాడు.
సిక్సుల క్లబ్లో షాహిద్ అఫ్రిది (351), క్రిస్ గేల్ (331) రెండు స్థానాల్లో ఉండగా.. రోహిత్ శర్మ (303) మూడో ప్లేసులో ఉన్నాడు. సిక్సర్ల సంఖ్య విషయంలో అఫ్రిది, గేల్ ముందున్నా.. ఈ ఫార్మాట్లో అత్యంత వేగంగా 300 సిక్సర్లు కొట్టిన అరుదైన ప్లేయర్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఆరు సిక్సులు బాదడం ద్వారా వరల్డ్ కప్‌లో అత్యధిక సార్లు లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన టీమిండియా ప్లేయర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 86 రన్స్ చేసిన రోహిత్.. వరల్డ్ కప్‌లో పాక్‌పై అత్యధిక రన్స్ చేసిన భారత కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. 2019 వరల్డ్ కప్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 77 రన్స్ చేశాడు. ప్రపంచ కప్ మ్యాచుల్లో ఛేజింగ్‌లో అత్యధిక రన్స్ చేసిన భారత ప్లేయర్‌గానూ హిట్‌మ్యాన్ రికార్డు సృష్టించాడు.
ఇదీ చదవండి: IND vs PAK: అంపైర్‌కు కండలు చూపించిన రోహిత్! ఎందుకలా చేశాడు?