iDreamPost
android-app
ios-app

ప్రపంచ క్రికెట్ పై టీమిండియా ఆధిపత్యం! 3 ఫార్మాట్లలోనూ మనమే నెంబర్ వన్

  • Author Soma Sekhar Published - 07:56 AM, Sat - 23 September 23
  • Author Soma Sekhar Published - 07:56 AM, Sat - 23 September 23
ప్రపంచ క్రికెట్ పై టీమిండియా ఆధిపత్యం! 3 ఫార్మాట్లలోనూ మనమే నెంబర్ వన్

వరల్డ్ కప్ ముంగిట టీమిండియా భీకర ఫామ్ లో ఉంది. ఇప్పటికే ఆసియా కప్ గెలిచి మంచి ఊపుమీదున్న భారత జట్టు.. అదే ఊపును ఆస్ట్రేలియాపై కూడా చూపిస్తోంది. కీలక ఆటగాళ్లు అందుబాటులో లేనప్పటికీ స్ఫూర్తిదాయక విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా.. తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఆసీస్ ను కంగుతినిపించింది. దీంతో సిరీస్ లో 1-0 ఆధిక్యం సంపాదించింది టీమిండియా. ఇక ఈ గెలుపుతో వన్డేల్లో అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. దాయాది పాకిస్థాన్ జట్టును వెనక్కి నెట్టి వరల్డ్ నంబర్ 1 జట్టుగా అవతరించింది. ఇప్పటికే టెస్టుల్లో, టీ20ల్లో అగ్రస్థానంలో ఉన్న భారత జట్టు.. తాజాగా వన్డేల్లో కూడా నంబర్ వన్ స్థానంలోకి రావడంతో.. క్రికెట్ లోని మూడు ఫార్మాట్లలో నంబర్ వన్ జట్టుగా అవతరించి రికార్డు సృష్టించింది.

ప్రపంచ క్రికెట్ పై టీమిండియా పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. వరల్డ్ కప్ ముంగిట భారత జట్టు అద్వితీయమైన ఆటతీరుతో ప్రత్యర్థి జట్లను మట్టికరిపిస్తూ.. అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. తాజాగా ఆసీస్ తో జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో నెగ్గి.. మూడు వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యం సంపాదించుకుంది. షమీ అద్భుత బౌలింగ్ కు తోడు టీమిండియా టాపార్డర్ రాణించడంతో 48.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో టీమిండియా వన్డేల్లో అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. కాగా.. ఇప్పటికే టెస్టుల్లో, టీ20ల్లో నంబర్ వన్ గా కొనసాగుతోంది భారత జట్టు. తాజాగా వన్డేల్లో కూడా తొలి స్థానంలోకి రావడంతో.. మూడు ఫార్మాట్లలో నంబర్ వన్ జట్టుగా అవతరించి.. వరల్డ్ క్రికెట్ పై పూర్తి ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది.

అయితే ఆసియా కప్ లోనే టీమిండియా నంబర్ వన్ ర్యాంక్ కు రావాల్సింది. కానీ బంగ్లాదేశ్ తో జరిగిన సూపర్ 4 మ్యాచ్ లో ఓటమితో అగ్రస్థానం కొద్దిలో మిస్ అయ్యింది. తాజాగా ఆసీస్ ను ఓడించడంతో.. 115 పాయింట్లతో ఉన్న పాక్ ను వెనక్కినెట్టి 116 పాయింట్లతో అగ్రస్థానంలోకి వచ్చింది టీమిండియా. దీంతో సౌతాఫ్రికా(2012) తర్వాత మూడు ఫార్మాట్లలో నంబర్ వన్ అయిన జట్టుగా టీమిండియా ఘనత సాధించింది. టెస్టుల్లో 118 పాయింట్లతో, టీ20ల్లో 264 రేటింగ్(15589 పాయింట్లు)తో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జట్టులో వార్నర్(52), ఇంగ్లిస్(45) స్టీవ్ స్మిత్(41) పరుగులతో రాణించారు.

ఇక టీమిండియా బౌలర్లలో షమీ నిప్పులు చెరిగే బంతులతో ఆసీస్ బ్యాటర్లను వణికించాడు. షమీ 51 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 277 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 48.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. యువ ఓపెనర్లు అదిరే ఆరంభాన్ని ఇవ్వగా.. దాన్ని సద్వినియోగం చేసుకుంటూ మిడిలార్డర్ బ్యాటర్లు భారత్ కు విజయాన్ని అందించారు. జట్టులో గిల్(74), గైక్వాడ్(71), సూర్య కుమార్(50), కెప్టెన్ కేఎల్ రాహుల్(58 నాటౌట్) పరుగులతో రాణించారు. మరి వరల్డ్ క్రికెట్ పై ఆధిపత్యం చెలాయిస్తున్న టీమిండియాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.