iDreamPost

దంచికొట్టిన జైస్వాల్.. క్రెడిట్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాదే అంటూ..!

దంచికొట్టిన జైస్వాల్.. క్రెడిట్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాదే అంటూ..!

టీమిండియా టూర్ ఆఫ్ వెస్టిండీస్ లో భారత సేన అద్భుతంగా దూసుకుపోతోంది. నాలుగో టీ20లో టీమిండియా 9 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ లో సమిష్టి కృషిని కనబరిచి ఘన విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా యశస్వీ జైస్వాల్, శుభ్ మన్ గిల్ ఆడిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. కుర్రాళ్లు మళ్లీ గాడిలో పడ్డారంటూ క్రికెట్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. కేవలం ఒకే ఒక్క వికెట్ నష్టానికే 178 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంతో టీమిండియా ఆల్రౌండ్ ప్రదర్శనపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

మొదటి రెండు టీ20ల్లో చోటు దక్కని యశస్వీకి మూడు, నాలుగు మ్యాచుల్లో స్థానం కల్పించారు. అయితే మూడో టీ20లో జైస్వాల్ పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచిన విషయం తెలిసిందే. రెండే బంతుల్లో కేవలం ఒకే ఒక్క పరుగుకి పెవిలియన్ చేరాడు. అయితే అతనిపై నమ్మకంతో హార్దిక్ పాండ్యా మరోసారి అవకాశం కల్పించాడు. ఈసారి హార్దిక్, టీమిండియా జైస్వాల్ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు. యశస్వీ జైస్వాల్ నాలుగో టీ20లో విజృంభించాడు. తనదైనశైలిలో వెస్టిండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 51 బంతుల్లోనే 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేశాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్ లో అజేయంగా నిలిచాడు. అంతేకాకుండా యశస్వీ జైస్వాల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

మ్యాచ్ తర్వాత జైస్వాల్ మాట్లాడుతూ.. “టీమ్ కి ఏం కావాలో చూసి అందుకు తగినట్లుగా ఆడాను. అదే సమయంలో నన్ను నేను ఎక్స్ ప్రెస్ చేసేలా ఆడాను. నాకు పవర్ ప్లేలో ఎన్ని షాట్స్ ఆడేందుకు అవకాశం వస్తుంది అనేదే ఇక్కడ ముఖ్యం. ఇలా నన్ను నేను ఎక్స్ ప్రెస్ చేసుకునే అవకాశం దక్కడం నాకు సంతోషంగా ఉంది. నాపై నమ్మకం ఉంచిన టీం మేనేజ్మెంట్, సపోర్టింగ్ స్టాఫ్, కెప్టెన్ హార్దిక్ పాండ్యాలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. వీళ్లంతా నాపై ఎంతో నమ్మకం ఉంచారు. ఆ నమ్మకం నా ఆటపై చాలా ప్రభావం చూపుతుంది. ఇంక మరో యంగ్ స్టార్ శుభ్ మన్ గిల్ కూడా ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించాడు. జైస్వాల్ తో కలిసి పరుగుల వరద పారించాడు. కేవలం 47 బంతుల్లోనే 77 పరుగులు చేశాడు. అందులో 3 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. షాయ్ హోప్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ గా పెవిలియన్ చేరాడు.

మొత్తానికి కుర్రాళ్లు చెలరేగడంతో ఈ విజయం భారత్ కు ఎంతో సులభం అయిపోయింది. 3 ఓవర్లు మిగిలి ఉండగానే వెస్టిండీస్ పై భారత్ ఘన విజయం నమోదు చేసింది. బౌలింగ్ లో అర్షదీప్ సింగ్(3 వికెట్లు) అద్భుతంగా రాణించాడు. కుల్దీప్ సింగ్ కూడా రెండు వికెట్లు పడగొట్టాడు. అక్షర్, చాహల్, ముఖేష్ లకు తలో వికెట్ దక్కింది. మొత్తానికి ఆల్రౌండ్ ప్రదర్శనతో తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో టీమిండియా తమ సత్తా చాటింది. 5 టీ20ల సిరీస్ లో రెండు జట్లు చెరో 2 మ్యాచుల్లో విజయం సాధించాయి. ఆదివారం జరగబోయే మ్యాచ్ లో విజయం సాధించిన వారే ఈ సిరీస్ ని కైవసం చేసుకుంటారు. ఈ మ్యాచ్ లో తప్పకుండా విజయం సాధించి 3 సిరీస్లు సాధించిన ఘనత దక్కించుకునేందుకు టీమిండియా ఉర్రూతలూగుతోంది. ఐదో టీ20 ఆదివారం రాత్రి 8 గంటలకు టర్ఫ్ గ్రౌండ్ లో జరగనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి