ప్రపంచ క్రీడల్లో ఫుట్‌బాల్‌కు ఉన్న పాపులారిటీనే వేరు. వందలాది దేశాల్లో ఈ గేమ్‌కు చాలా క్రేజ్ ఉంది. ఫుట్‌బాల్ స్టార్లను నెత్తిన పెట్టుకుంటారు అభిమానులు. ఫుట్‌బాలర్ల సంపాదన ముందు ఏ ఇతర క్రీడల్లోని స్టార్స్ పనికిరారు. ఏడాదికి రూ.వేల కోట్లు సంపాదిస్తుంటారు ఫుట్‌బాల్ ప్లేయర్లు. మన దేశంలో మాత్రం ఈ గేమ్‌కు ఆదరణ అంతంత మాత్రమనే చెప్పాలి. ఫుట్‌బాల్‌లో భారత జట్టు ప్రదర్శన కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. అయితే ఒకప్పుడు మాత్రం ఫుట్‌బాల్‌లో భారత జట్టు అంటే అందరూ గుర్తుపట్టేవారు. ఇండియన్ ఫుట్‌బాల్‌కు 70వ దశకాన్ని గోల్డెన్ పీరియడ్‌గా చెబుతుంటారు.
70వ దశకంలో అత్యుత్తమ ఫుట్‌బాలర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నారు మహమ్మద్ హబీబ్. అలాంటి ఆయన మంగళశారం కన్నుమూశారు. హైదరాబాద్‌కు చెందిన హబీబ్ కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 74 సంవత్సరాల హబీబ్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మరో హైదరాబాదీ సయ్యద్ నయీముద్దీన్ నాయకత్వంలో 1970లో బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో కాంస్య పతకం గెలిచిన భారత జట్టులో హబీబ్ కీలక సభ్యుడు. అయితే ఆయన కెరీర్లో అత్యుత్తమ దశ కోల్‌కతాలోనే గడిచింది. దాదాపు 18 ఏళ్ల పాటు అక్కడి ప్రధాన క్లబ్స్‌లో కీలక ఆటగాడిగా కొనసాగారాయన.
ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్లబ్‌లు మోహన్‌బగాన్, ఈస్ట్ బెంగాల్, మహ్మదాన్ స్పోర్టింగ్‌లకు హబీబ్ ప్రాతినిధ్యం వహించారు. ఈ క్రమంలో 1977లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఒక ఫ్రెండ్లీ మ్యాచ్‌లో మోహన్‌బగాన్ తరఫున బరిలోకి దిగాడు హబీబ్. ప్రత్యర్థి జట్టు కాస్మోస్ క్లబ్లో ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ గ్రేట్ ప్లేయర్లు పీలే, కార్లోస్ ఆల్బర్టో ఉన్నారు. ఆ మ్యాచ్ 2-2తో డ్రాగా ముగియడం గమనార్హం. ఇందులో మోహన్‌బగాన్ తరఫున హబీబ్ ఒక గోల్ చేశాడు. మ్యాచ్ తర్వాత హబీబ్‌ను పిలిచి పీలే ప్రశంసించడం విశేషం. 1965 నుంచి 1975 వరకు భారత జట్టు తరఫున ఆడిన హబీబ్‌ను కేంద్ర ప్రభుత్వం 1980లో ప్రతిష్టాత్మక అర్జున పురస్కారంతో గౌరవించింది.