క్రికెట్ అంటే ఎక్కువగా ప్లేయర్ల గురించే అంతా మాట్లాడుకుంటారు. ఎందుకంటే పెర్ఫార్మెన్స్ హైలైట్ అవుతుంది కాబట్టి. అందుకే ఆటగాళ్ల గురించే డిస్కషన్స్ ఉంటాయి. అయితే స్క్రీన్‌పై క్రికెటర్లు మాత్రమే కనిపించినా.. వారి వెనుక ఎంతో మంది కష్టం ఉంటుంది. ఒక మ్యాచ్ జరుగుతోందంటే దాని కోసం చాలా మంది రాత్రింబవళ్లు కృషి చేయాల్సి ఉంటుంది. ప్లేయర్ల వెనుక ఉండి చూసుకునే టీమ్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి పిచ్ క్యూరేటర్, గ్రౌండ్స్‌మెన్, బాల్ బాయ్స్, డ్రెస్సింగ్ రూమ్ సిబ్బంది.. ఇలా ఎంతో మంది కష్టం దీంట్లో ఉంటుంది.
క్రికెటర్లకు సన్మానాలు, సత్కారాలు కామనే. కానీ ఒక మ్యాచ్ జరిగేందుకు ఎంతగానో కష్టపడే గ్రౌండ్ స్టాఫ్‌తో పాటు పైన చెప్పుకున్న ఎందరో సామాన్యులు వెలుగులోకి రారు. వాళ్ల సేవలకు అంతగా గుర్తింపు కూడా లభించదు. అలా గుర్తింపులోకి రాని ఓ సామాన్యుడ్ని టీమిండియా సన్మానించింది. వినోద్ కుమార్ (వినోద్ జీ) అనే డ్రెస్సింగ్ రూమ్ సిబ్బందికి చెందిన వ్యక్తిని భారత క్రికెట్ జట్టు గౌరవించింది. ఆఫ్ఘానిస్థాన్‌తో మ్యాచ్ తర్వాత డీడీసీఏలో పనిచేస్తున్న వినోద్ జీని డ్రెస్సింగ్ రూమ్‌కు రావాల్సిందిగా టీమిండియా మేనేజ్మెంట్ ఆహ్వానించింది.
డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చిన వినోద్ జీకి భారత ప్లేయర్లు అందరూ వెల్కమ్ చెప్పారు. కోచ్ రాహుల్ ద్రవిడ్ సూచన మేరకు కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీలు కలసి టీమ్ జెర్సీని వినోద్‌కు అందించారు. 40 ఏళ్లుగా డ్రెస్సింగ్ రూమ్ అటెండెంట్‌గా అందిస్తున్న సేవలకు గానూ టీమిండియా క్రికెటర్ల సంతకాలతో కూడిన జెర్సీని వినోద్‌కు ఇచ్చారు. ఆ తర్వాత ప్లేయర్లు అందరూ ఆయన్ను హగ్ చేసుకొని అభినందించారు. వినోద్‌జీ లాంటి సామాన్య ఉద్యోగిని భారత జట్టు సన్మానించడంపై నెట్టింట ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. మరి.. సామ్యానుడ్ని టీమిండియా సత్కరించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: World Cup: 48 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా చెత్త రికార్డు.. నెదర్లాండ్స్ కంటే..!