iDreamPost

World Cup: 48 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా చెత్త రికార్డు.. నెదర్లాండ్స్​ కంటే..!

  • Author singhj Published - 08:48 AM, Fri - 13 October 23
  • Author singhj Published - 08:48 AM, Fri - 13 October 23
World Cup: 48 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా చెత్త రికార్డు.. నెదర్లాండ్స్​ కంటే..!

ఆస్ట్రేలియా.. క్రికెట్​లో ఈ పేరు వింటేనే అందరూ భయపడిపోతారు. అంతగా జెంటిల్మన్ గేమ్​ మీద కంగారూ జట్టు ప్రభావం చూపించింది. స్వదేశం, విదేశం అనే తేడాల్లేకుండా ఎక్కడ గ్రౌండ్​లోకి దిగినా ఆసీస్​దే విజయం. అవతల ఉన్నది ఎలాంటి జట్టయినా, పిచ్ కండీషన్స్ ఎలా ఉన్నా మ్యాచ్​ను చేజిక్కించుకోవడం ఆసీస్​కు వెన్నతో పెట్టిన విద్య. మెరికల్లాంటి పేసర్స్, అద్భుతమైన బ్యాటర్స్ ఆ టీమ్ సొంతం. అందుకే ఇన్నాళ్లూ వరల్డ్ క్రికెట్​ను శాసిస్తూ వచ్చింది ఆస్ట్రేలియా. ప్రపంచ కప్స్​లో ఆ టీమ్​కు ఉన్న రికార్డు ఇంకే టీమ్​కూ లేదు. ఏకంగా ఐదు సార్లు ఛాంపియన్​గా నిలిచింది ఆసీస్.

ఎంతో ఘన చరిత్ర కలిగిన ఆస్ట్రేలియా టీమ్ ఈసారి వరల్డ్ కప్​-2023లో అనుకున్నంత స్థాయిలో రాణించడం లేదు. అసలు ఆడుతున్నది కంగారూ టీమేనా అనేలా వారి పెర్ఫార్మెన్స్ ఉంది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్​లో దారుణంగా ఫెయిల్ అవుతోంది. మొదటి మ్యాచ్​లో భారత్ చేతిలో ఓడిన కమిన్స్ సేన.. రెండో మ్యాచ్​లో సౌతాఫ్రికా చేతిలో ఘోర ఓటమి మూటగట్టుకుంది. వన్​సైడ్​గా సాగిన ఈ మ్యాచ్​లో ఆసీస్ 134 రన్స్ తేడాతో చిత్తయింది. 48 ఏళ్ల వన్డే వరల్డ్ కప్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ ఆ జట్టు వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓటమి పాలైంది. సౌతాఫ్రికా చేతిలో పరాభవంతో ఈ చెత్త రికార్డును కంగారూ టీమ్ నమోదు చేసింది. ప్రస్తుత వరల్డ్ కప్​లో టీమిండియాతో జరిగిన మొదటి మ్యాచ్​లో 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఓటమి పాలైంది. గురువారం సౌతాఫ్రికా చేతిలో ఓడింది.

2019 వన్డే వరల్డ్ కప్​లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా చేతుల్లో వరుసగా ఓటమిపాలైంది ఆస్ట్రేలియా. ఆ ఏడాది సెమీస్​లో ఇంగ్లీష్ టీమ్ చేతిలో ఓడిన ఆసీస్.. ఆ మ్యాచ్​కు ముందు సౌతాఫ్రికాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్​లో 10 రన్స్ తేడాతో పరాజయం పాలైంది. ఇలా రెండు వరల్డ్ కప్స్​లో ఆడిన ఆఖరి నాలుగు మ్యాచుల్లోనూ ఓడి అప్రతిష్టను మూటగట్టుకుంది. భారత్, సౌతాఫ్రికాపై ఓటములతో డీలాపడిన కంగారూ జట్టు.. పాయింట్స్ టేబుల్​లో 9వ స్థానంలో నిలిచింది. ఆ టీమ్ రన్​రేట్ కూడా (-1.846) నెగెటివ్​లో ఉంది. పాయింట్ల పట్టికలో పసికూన నెదర్లాండ్స్ (8వ స్థానం) ఆస్ట్రేలియాకు ఎగువన ఉండటం గమనార్హం. కాగా, మెగా టోర్నీలో ముందడుగు వేయాలంటే మిగిలిన ఏడు మ్యాచుల్లో కనీసం ఆరింట్లోనైనా ఆసీస్ నెగ్గాల్సి ఉంటుంది. అలాగే మెరుగైన రన్​రేట్​తో నెగ్గితేనే సెమీస్​కు చేరే అవకాశం ఉంటుంది. మరి.. ఆస్ట్రేలియా పెర్ఫార్మెన్స్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: పాక్​పై నెగ్గాలంటే ఆ ప్లేయర్​ను టీమిండియా ఆడించాల్సిందే: వెటరన్ క్రికెటర్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి