చెన్నై సూపర్ కింగ్స్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీల్లో ఒకటి. ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన సీఎస్కేకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. చెన్నై జట్టు మ్యాచ్ ఆడుతోందంటే చాలు.. ఏ వేదికలోనైనా స్టేడియం నిండిపోవాల్సిందే. ప్లేయర్లను ఎంకరేజ్ చేయడానికి ఎల్లో ఆర్మీ చేసే హంగామా అంతా ఇంతా కాదు. సీఎస్కే గ్రౌండ్లోకి దిగిందంటే ఎదురుగా ఎంత బలమైన ప్రత్యర్థి ఉన్నా భయపడాల్సిందే. పెద్దగా స్టార్ ప్లేయర్లు లేకపోయినా అందుబాటులో ఉన్న వనరులను చక్కగా వినియోగించుకుంటూ కెప్టెన్ ఎంఎస్ ధోని చెన్నైని నడిపించే తీరు అద్భుతమనే చెప్పాలి.
ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ నెగ్గి జోష్‌లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. మరో క్రికెట్ అకాడమీని ప్రారంభిచాలని డిసైడ్ అయింది. తమిళనాడులోని తిరుప్పూర్‌లో మొదలుపెట్టనున్న ఈ అకాడమీకి ‘సూపర్ కింగ్స్ అకాడమీ’ అనే పేరు కూడా పెట్టినట్లు వెల్లడించింది. చెన్నై నగరానికి 460 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాలి స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఈ కొత్త అకాడమీని ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎస్కే యాజమాన్యం తెలిపింది. ఫ్యూచర్ క్రికెటర్లకు ఇంటర్నేషనల్ లెవల్లో ఫెసిలిటీస్ ఇక్కడ లభించనున్నాయని పేర్కొంది.
సీఎస్కే ఏర్పాటు చేస్తున్న కొత్త అకాడమీలో మొత్తం ఎనిమిది పిచ్‌లను ఏర్పాటు చేశారట. ఇప్పటికే ఫ్లడ్‌లైట్లు సహా ఇతరత్రా సదుపాయాలు కూడా పూర్తయ్యాయని తెలుస్తోంది. 6 నుంచి 23 సంవత్సరాల వయసు కలిగిన అబ్బాయిలు, అమ్మాయిలు ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవచ్చట. కొత్త అకాడమీకి సంబంధించిన విశేషాలను సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్ చెప్పుకొచ్చారు. తమిళనాడులో సత్తా ఉన్న కుర్రాళ్లను వెలికి తీయడమే తమ టార్గెట్ అని విశ్వనాథ్ తెలిపారు. చెన్నైతో పాటు సాలెం, హోసూర్, తిరుచ్చి, తిరునల్వేలిలో సెంటర్లు రన్ అవుతున్నాయని పేర్కొన్నారు. ఇక్కడికి అత్యుత్తమ కోచ్‌లను తీసుకొస్తామని.. ఇది గొప్ప విజయమని యాలి స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ విష్ణు గోవింద్ అన్నారు.