వన్డే వరల్డ్ కప్ వేదికల ఎంపికపై దుమారం.. క్లారటీ ఇచ్చిన BCCI

వన్డే వరల్డ్ కప్ వేదికల ఎంపికపై దుమారం.. క్లారటీ ఇచ్చిన BCCI

క్రికెట్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచ కప్ సంబరాలు ప్రారంభం అయిపోయాయి. వరల్డ్ కప్ షెడ్యూల్ కూడా విడుదలైంది. 2023 వన్డే వరల్డ్ కప్ కు భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 5 నుంచి మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈసారి వరల్డ్ కప్ తొలి, ఆఖరి మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగానే జరగనున్నాయి. అయితే వన్డే వరల్డ్ కప్ వేదికల విషయంలో మాత్రం రాజకీయంగా దుమారం రేగింది. మైదానాల ఎంపిక, మ్యాచ్ ల నిర్వహణ విషయంలో వివక్ష చూపారంటూ ఆరోపణలు వచ్చాయి. వాటిపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు క్లారిటీ ఇచ్చారు.

2023 వన్డే వరల్డ్ కప్ కోసం మొత్తం 12 వేదికలను ఎంపిక చేశారు. వాటిలో రెండు చోట్ల వార్మప్ మ్యాచెస్ జరగనుండగా.. 10 మైదానాల్లో ప్రపంచ కప్ మ్యాచెస్ జరుగనున్నాయి. పంజాబ్ క్రీడల మంత్రి గుర్మీత్ సింగ్ మైదానాల ఎంపిక విషయంలో తీవ్ర ఆరోపణలు చేశారు. మొహాలీకి చోటు దక్కకపోవడంపై రాజకీయంగా దమారం రేగింది. ఈ ఆరోపణలపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు. వస్తున్న ఆరోపణలు, జరుగుతున్న చర్చలకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు. వేదికల ఎంపిక తమ చేతుల్లో అంశం కాదని తేల్చి చెప్పారు. మొహాలీ వరల్డ్ కప్ మ్యాచెస్ కి కావాల్సిన స్టాండర్డ్స్ లో లేకపోవడం వల్లే ఎంపిక కాలేదని క్లారిటీ ఇచ్చారు.

“ఈ వరల్డ్ కప్ కోసం గతంలో ఎంపిక కాని వేదికలను కూడా ఎంపిక చేశాం. మొత్తం 12 వేదికలు ఎంపికయ్యాయి. తిరువనంతపురం, గువాహటి వేదికల్లో వార్మప్ మ్యాచెస్ నిర్వహించనున్నాం. మిగిలినవి లీగ్, నాకౌట్ మ్యాచెస్ కు ఆతిథ్యం ఇస్తాయి. మంచి వసతులు కల్పిస్తున్నాయి కాబట్టే వాటికి చోటు దక్కింది. వేదికల ఎంపిక విషయంలో మేము చేసేది ఏమీ లేదు. ఐసీసీ నిర్ణయంతోనే మ్యాచెస్ నిర్వహిస్తాం. ఏ వేదికపై కూడా వివక్ష చూపలేదు. మొహాలీ వేదికగా ద్వైపాక్షిక సిరీస్ లు నిర్వహించాం. కోహ్లీ వందో టెస్టు కూడా అక్కడే జరిగింది. మొహాలీలో మల్లాన్ పుర్ స్టేడియం రెడీ అవుతోంది. ఐసీసీ స్టాండర్డ్స్ కు తగినట్లు లేకపోవడం వల్లే అవకాశం దక్కలేదు. ద్వైపాక్షిక సిరీస్ ల మ్యాచ్ లకు స్టేడియాన్ని కేటాయించాం” అంటూ రాజీవ్ శుక్లా వ్యాఖ్యానించారు.

Show comments