ప్రతిష్టాత్మక ఆసియా కప్-2023 టోర్నమెంట్ నేపథ్యంలో ప్లేయర్ల జెర్సీల మీద ఆతిథ్య జట్టు పేరు లేకపోవడం ఇప్పుడు విమర్శలకు దారితీసింది. మామూలుగానే మేజర్ క్రికెట్ ఈవెంట్లలో ఆటగాళ్లు వేసుకునే జెర్సీలపై హోస్ట్ పేరు కూడా కనిపిస్తుంది. కానీ ఈసారి ఆసియా కప్ విషయంలో మాత్రం అలా జరగలేదు. ఈ టోర్నీలో భారత క్రికెటర్లు వేసుకునే జెర్సీల మీద పాకిస్థాన్ పేరు కనిపించడం లేదు. దీంతో ఆ దేశ మాజీ క్రికెటర్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్ పేరును కావాలనే వేయలేదంటూ మాజీ క్రికెటర్లు రషీద్ లతీఫ్, మొహ్సిన్ ఖాన్ ఏసీసీ మీద విమర్శలు గుప్పించారు.
ఆటగాళ్ల జెర్సీలపై తమ లోగో లేకపోవడానికి గల కారణాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వెల్లడించినట్లు ప్రముఖ నేషనల్ న్యూస్ ఛానల్ పేర్కొంది. ఈ సంవత్సరం నుంచి ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) కొత్త నిబంధనను తీసుకొచ్చిందని.. దాని ప్రకారం ఆతిథ్య జట్ల లోగోలు ఆటగాళ్ల జెర్సీల మీద ఉండవని చెప్పినట్లు ఆ ఛానల్ కథనం పేర్కొంది. ఇక మీదట ప్రతి జట్టుకూ ఇదే రూల్ వర్తిస్తుందని చెప్పినట్లు సమాచారం. కాగా, ఈసారి ఆసియా కప్ ఆతిథ్య హక్కులు మొదట పాకిస్థాన్ దక్కించుకుంది. అయితే, సెక్యూరిటీ రీజన్స్ వల్ల టీమిండియాను అక్కడికి పంపేందుకు భారత క్రికెట్ బోర్డు ససేమిరా అనడంతో శ్రీలంక లైన్లోకి వచ్చింది.
ఆసియా కప్-2023లో టీమిండియా ఆడే మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో జరిగే విధంగా హైబ్రిడ్ పద్ధతిలో టోర్నీ నిర్వహణకు పీసీబీని ఏసీసీ ఒప్పించింది. ఇప్పటికే ఈ టోర్నీ మొదలైంది. భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య రేపు (సెప్టెంబర్ 2వ తేదీ) మ్యాచ్ జరగనుంది. దీంతో టోర్నీలో ధరించే జెర్సీలతో భారత క్రికెటర్ల ఫొటోలు బయటకు వచ్చాయి. కానీ ఆ జెర్సీల మీద పాకిస్థాన్ పేరు, లోగో లేదు. దీంతో ప్లేయర్ల జెర్సీల మీద లోగో మిస్సవడం క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీసింది. దీనిపై పాక్ బోర్డు అనధికారికంగా క్లారిటీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కాంట్రవర్సీకి ఇక్కడితో ఫుల్స్టాప్ పడుతుందేమో చూడాలి.
ఇదీ చదవండి: ఇండో-పాక్ మ్యాచ్‌కు ముందు BCCIపై విమర్శలు