SNP
SNP
కరేబియన్ క్రికెటర్ల పవరే వేరు.. ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో వారి దూకుడు ముందు ఎవరూ నిలబడలేరు. వెస్టిండీస్ టీమ్ సంగతి పక్కనపెడితే.. ప్రపంచ వ్యాప్తంగా ఏ మూలన ఫ్రాంచైజ్ లీగ్ జరిగినా అక్కడ కరేబియన్ క్రికెటర్లదే హవా. టీ20 క్రికెట్ కోసమే పుట్టినట్లు ఆడుతుంటారు కాబట్టే.. వారికంత క్రేజ్. తాజాగా అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలోను విండీస్ వీరులు రెచ్చిపోతున్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినా, వయసు మీద పడుతున్నా.. ఇంకా తమలో పదును తగ్గలేదన్నట్లు.. భారీ షాట్లతో మెరుపు ఇన్నింగ్స్‌లతో సత్తా చాటుతున్నారు.
టెక్సాస్ సూపర్ కింగ్స్ తరఫున ఆడుతూ.. మొన్న డ్వేన్ బ్రావో 106 మీటర్ల సిక్స్ కొట్టి ఔరా అనిపిస్తే.. రెండు రోజుల్లోనే ఆ రికార్డును ఆండ్రూ రస్సెల్ చెరిపేశారు. బ్రావో కొడితేనే గ్రౌండ్ బయట పడితే.. నేను కొడితే ఎక్కడ పడుతుందో చూడండి అంటూ బాదినట్టు ఉన్నాడు.. ఏకంగా స్టేడియం బయట కార్ పార్కింగ్‌లో వెళ్లి పడింది బంతి. పైగా కొట్టింది ఏ సాదా సీదా బౌలర్‌ని కూడా కాదు. అంతర్జాతీయ స్థాయిలో మేటి బౌలర్లలో ఒకడు, పాక్ పేస్ ఎటాక్‌లో నంబర్ టూ బౌలర్ హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో రస్సెల్ ఈ భారీ సిక్స్ బాదాడు.
ఇంతకీ అది ఎంత దూరం పోయింది అనుకుంటున్నారా.. ఏకంగా 108 మీటర్ల దూరంలో పడింది. ఈ భారీ సిక్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోను షేక్ చేస్తోంది. రస్సెల్ బ్యాట్‌కు తాకిన తర్వాత.. రాకెట్ వేగంతో బంతి అలా గాల్లోకి దూసుకెళ్తున్న సీన్ చూస్తుంటే.. ఇది కదా మాస్ బ్యాటింగ్ అని అనిపిస్తోందంటూ క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇంత సూపర్ షాక్ కొట్టినా.. రస్సెల్‌కు నిరాశ తప్పలేదు. 4 సిక్సులు, 2 ఫోర్లతో 26 బంతుల్లోనే 42 పరుగులతో విరుచుకుపడినా.. తన టీమ్‌ను రస్సెల్ గెలిచిపించలేకపోయాడు. దీంతో రస్సెల్ టీమ్ లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ 21 పరుగుల తేడాతో ఓడిపోయింది.
మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో భాగంగా మంగళవారం డాల్లస్ వేదికగా శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్‌స్-లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్సిస్కో జట్టు తొలుత బ్యాటింగ్ చేసి.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఓపెనర్ మ్యాథ్యూ వేడ్ 78 పరుగులతో దుమ్ములేపాడు. ఇక 213 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసి ఓటమిపాలైంది. చివర్లో రస్సెల్, కెప్టెన్ సునీల్ నరైన్ మెరుపులు మెరిపించినా.. ఫలితం దక్కలేదు. మరి ఈ మ్యాచ్‌లో రస్సెల్ కొట్టిన భారీ సిక్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Russell hit 108 meter six against Haris Rauf!!!
Longest in MLC. pic.twitter.com/2xiNu6MuV7
— Johns. (@CricCrazyJohns) July 19, 2023
ఇదీ చదవండి: IPLకు పోటీగా ఇంగ్లండ్ తెచ్చిన ‘ది హండ్రెడ్’ లీగ్ రద్దు! కారణం ఇదే..