వన్డే ప్రపంచ కప్ 2023.. ఇప్పుడు అందరి చూపు ఈ మెగా టోర్నీపైనే. తాజాగా ఐసీసీ ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది. ఇక ఇప్పటికే అన్ని దేశాలు 2023 వరల్డ్ కప్ గెలవడమే లక్ష్యంగా తమ ప్రణాళికలను సిద్దం చేసుకుంటున్నాయి. అయితే టీమిండియాను మాత్రం ఓ విషయం తెగ కాంగారు పెడుతోంది. గత రెండు వరల్డ్ కప్(1992, 2019)ల రికార్డులు చూస్తే.. టీమిండియా ఫ్యాన్స్ కు ఆందోళన తప్పట్లేదు. ఈ రెండు వరల్డ్ కప్ లను ఐసీసీ రౌండ్ రాబిన్ ఫార్మాట్ లో నిర్వహించింది. తాజాగా భారత్ వేదికగా జరగబోయే 2023 వరల్డ్ కప్ కూడా ఈ ఫార్మాట్ లోనే నిర్వహించబోతున్నారు. దాంతో టీమిండియా అభిమానుల్లో టెన్షన్ మెుదలైంది. అసలు ఈ రౌండ్ రాబిన్ ఫార్మాట్ అంటే ఏంటి? అది భారత్ కు గండంగా మారనుందా? తెలియాలి అంటే ఈ కథనం చదవాల్సిందే.
2023 వన్డే ప్రపంచ కప్ కు భారత్ ఆతిధ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా వరల్డ్ కప్ కు సంబంధించిన షెడ్యూల్ ను రిలీజ్ చేసింది ఐసీసీ. 2023 వరల్డ్ కప్ లో మెుత్తం 10 జట్లు తలపడనున్నాయి. అయితే ఈసారి వరల్డ్ కప్ ను రౌండ్ రాబిన్ పద్దతిలో నిర్వహించనున్నట్లు ఐసీసీ తెలిపింది. దాంతో టీమిండియా ఫ్యాన్స్ లో ఆందోళన మెుదలైంది. అసలు ఈ పద్దతికి, టీమిండియాకు సంబంధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వన్డే ప్రపంచ కప్ చరిత్రలో రౌండ్ రాబిన్ పద్దతిలో టోర్నీ జరపడం ఇది మూడోసారి మాత్రమే. గతంలో 1992, 2019లో మాత్రమే ఈ రౌండ్ రాబిన్ ఫార్మాట్ లో ప్రపంచ కప్ జరిగింది. ఈ రెండు వరల్డ్ కప్ ల్లో టీమిండియా ఓటములే చవిచూసింది. 1992లో ఇండియా నాకౌట్ చేరకుండానే ఇంటి ముఖం పట్టగా.. ఇక 2019లో సెమీఫైనల్లో కివీస్ చేతిలో ఓడి, అభిమానులను నిరాశపరిచింది. ఇక 2023 వరల్డ్ కప్ కూడా ఈ ఫార్మాట్ లో జరుగుతుండటంతో.. ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
రౌండ్ రాబిన్ పద్దతి ప్రకారం.. వరల్డ్ కప్ లో పాల్గొనే ప్రతి జట్టు ఒక్కో టీమ్ తో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అంటే గ్రూప్ స్టేజ్ లో ప్రతి టీమ్ 9 మ్యాచ్ లు ఆడుతుంది. టాప్-4లో నిలిచిన 4 జట్లు సెమీఫైనల్ కు అర్హత సాధిస్తాయి. ఇక పాయింట్ల పట్టికలో 1,4 స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఫస్ట్ సెమీఫైనల్ జరుగుతుంది. అలాగే 2,3 స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య రెండో సెమీఫైనల్ జరుగుతుంది. అయితే ఈ రౌండ్ రాబిన్ పద్దతిలో ప్రతీ జట్టుకు నాకౌట్ చేరేందుకు అవకాశాలు ఉన్నాయి. మెుదట్లో ఒకటి, రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయినా గానీ తర్వాత జట్లు పుంజుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ ఫార్మాట్ మాత్రం టీమిండియాకు అచ్చిరాలేదనే చెప్పాలి. మరి ఈసారైనా ఈ రౌండ్ రాబిన్ ఫార్మాట్ ను టీమిండియా బీట్ చేసి.. వరల్డ్ కప్ సాధిస్తుందో! లేదో.. వేచి చూడాలి.